భైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. తీవ్ర ఆందోళన

by  |
భైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. తీవ్ర ఆందోళన
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా బస్టాండ్ సమీపంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ పని చేసి ఉంటారని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దాడిని నిరసిస్తూ అంబేద్కర్ వాదులు ఉద్రిక్త పరిస్థితులను కొనసాగించారు. రెండు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

దీంతో భైంసాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. అయినప్పటికీ సదరు నిందితుడిని త్వరగా శిక్షించాలని పలువురు దళితులు పట్టణంలోని నిర్మల్ చౌరస్తా, బస్ స్టాండ్, పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఓ నిరసనకారుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో నిరసన చేస్తున్న పలువురిని అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు.

కాగా, భైంసా మండలంలో చెలరేగిన ఆందోళన మిర్జాపూర్ గ్రామానికి పాకింది. దీంతో ఆ గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఏఎస్పీ కిరణ్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వివాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నట్టు హెచ్చరించారు.


Next Story