అమెజాన్‌ పే సేవలు మరింత వేగం

by  |
అమెజాన్‌ పే సేవలు మరింత వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డిజిటల్ చెల్లింపుల విభాగం అమెజాన్‌పే దేశవ్యాప్తంగా ఈ-చెల్లింపులు, క్రెడిట్, ఆర్థిక సేవలను మరింత వేగవంతం చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాలు, ఇతర పట్టణాలతో సహా భారత్‌లో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని కంపెనీ భావిస్తోంది. దీనివల్ల ఇప్పటికే ఈ విభాగంలో ఉన్న పేటీఎమ్, గూగుల్‌పేతో పోటీ పడనుంది.

అమెజాన్‌పే ఇటీవలే భారత్‌లో 5 కోట్ల మంది వినియోగదారులను సాధించింది. షాపింగ్, బిల్లుల చెల్లింపులు మొదలుకొని చాలావరకు అమెజాన్‌పేలో చెల్లింపులు చేయడం పెరిగింది. కేవలం అమెజాన్‌పే యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారానే 2 కోట్ల మంది స్థానిక స్టోర్ల వద్ద చెల్లింపులను వినియోగించారని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అమెజాన్‌పే సీఈఓ, వైస్-ప్రెసిడెంట్ మహేంద్ర నెరుర్కర్ చెప్పారు.

వినియోగదారులు చేసే చెల్లింపులను మరింత సురక్షితంగా, వేగంగా అందించడం, కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, నగదు చెల్లింపులు చేసేవారితో పాటు క్రెడిట్ యాక్సెస్ అవసరమైన వినియోగదారులను చేరుకోవడం తమ లక్ష్యమని ఆయన వివరించారు. దేశంలోని మొత్తం జనాభాలో కేవలం 2-3 శాతం మందికి మాత్రమే క్రెడిట్ కార్డులు ఉన్నాయని మహేంద్రా తెలిపారు.


Next Story

Most Viewed