డేరింగ్ లేడీ.. కశ్మీర్‌లో 50 ఎత్తయిన సరస్సుల ట్రెక్కింగ్‌తో రికార్డ్

by  |
డేరింగ్ లేడీ.. కశ్మీర్‌లో 50 ఎత్తయిన సరస్సుల ట్రెక్కింగ్‌తో రికార్డ్
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేసే బెంగళూరుకు చెందిన నమ్రత నందీష్‌కు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఉద్యోగ, ఇంటి బాధ్యతలతో కూడిన గజిబిజి జీవితం ఆమె అభిరుచులకు, ఇష్టాలకు బ్రేక్ వేసింది. అయితే మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం రావడంతో ఆ సమయాన్ని తన లక్ష్యాల కోసం ఉపయోగించుకున్న నమ్రత.. 4 నెలల వ్యవధిలో కశ్మీర్‌లో ఎత్తయిన ప్రదేశాల్లో గల 50 సరస్సులకు ట్రెక్కింగ్ చేసి రికార్డు సృష్టించింది.

దక్షిణ కశ్మీర్‌, పహల్గామ్ ప్రాంతంలోని పీర్ పంజాల్, జంస్కార్ పర్వత శ్రేణుల నడుమన గల తులియన్ సరస్సుతో ప్రారంభించి, అనంతనాగ్-కిష్త్‌వర్ ప్రాంతంలోని శిల్సార్ సరస్సు వరకు మొత్తంగా 50 సరస్సులకు ట్రెక్కింగ్ చేసిన తొలి మహిళగా నమ్రత నందీష్ చరిత్ర సృష్టించింది. ఆల్‌పైన్ సరస్సులు సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంటాయి. దీంతో ట్రెక్కింగ్ కమ్యూనిటీ తనను ‘ఆల్‌పైన్ గర్ల్’‌‌గా అభివర్ణించింది.

ఉమెన్స్ కలెక్టివ్ ట్రస్ట్ కృషి అభినందనీయం..

పక్కాగా ప్లాన్ అంటూ లేదు. శ్రీనగర్‌ను సందర్శించాలనే ఆలోచనతో ఇదంతా ప్రారంభమైంది. గడ్డకట్టిన దాల్ సరస్సును చూడాలనుకున్నాం. జనవరి 26న కశ్మీర్ లోయకు జర్నీ స్టార్ట్ చేశాం. అక్కడికెళ్లాక నా పుట్టినరోజు కానుకగా సీజన్‌లో 33 సరస్సులను ట్రెక్కింగ్ చేయాలని నిర్ణయించుకుని ట్రెక్కింగ్ గ్రూప్‌లో చేరాను. ఈ ఏడాదిలో 31 రోజుల పాటు 460 కిలోమీటర్లు వర్క్ ఫ్రమ్ చేస్తూనే ట్రెక్కింగ్ చేశాను. చివరగా ముర్గాన్ శిఖరం 13,000 అడుగుల ఎత్తు ఉన్నందున అక్యూట్ మౌంటైన్ సిక్‌నెస్ (AMS)కు గురయ్యాను. కానీ ఆత్మవిశ్వాసానికి తోడు నా భర్త అందించిన మద్దతు, ట్రెక్ లీడర్ సహకారంతో కంప్లీట్ చేశాను. కశ్మీర్ లోయలో ట్రెక్కింగ్ చేసేందుకు మహిళల్ని ప్రోత్సహించడంలో ఉమెన్స్ కలెక్టివ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయం. అయితే ట్రెక్కింగ్ గ్రూపులకు మార్గదర్శకులుగా ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవడం వల్ల లోయలోకి వచ్చే మహిళా సందర్శకుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. ఇది లోయలోని స్థానిక మహిళలకు ప్రత్యామ్నాయ వ్యాపారంగా మారవచ్చు.
– నమ్రత నందీష్

ట్రెక్కింగ్ మీద ఇష్టంతో ఎంతోమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. 3-4 రోజుల సుదీర్ఘ ట్రెక్ చేయాలని కోరుకుంటారు, అయితే నమ్రత మాత్రం వారికి భిన్నం. తన కోసం ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం కష్టపడింది. ఆమె ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నా.. తన దృఢ నిశ్చయం చూశాక ఆ భయాలన్నీ మాయమయ్యాయి. నిజంగా ఆమె డేరింగ్ లేడి. నిస్సందేహంగా కశ్మీర్ లోయలో విస్తరించి ఉన్న 50 ఆల్‌పైన్ సరస్సులను ఒక్క సీజన్‌లో కవర్ చేసిన వారిని నేను చూడలేదు. ఈ రకమైన ఫీట్‌ను పూర్తి చేసిన మొదటి మహిళ తనే. దశాబ్ద కాలంగా ఈ ఫీల్డ్‌లో పనిచేస్తున్న నాకు ఆమెతో కలిసి ట్రెక్కింగ్ చేయడం సంతోషంగా అనిపించింది.
– సయ్యద్ తాహిర్, ట్రెక్ లీడర్

నమ్రత మహిళలకు స్ఫూర్తి. పర్వతాలు, సరస్సులు ఉన్న ప్రదేశంలో నివసిస్తున్నప్పటికీ చాలా మంది కశ్మీరీ మహిళలు ట్రెక్కింగ్, పర్వతారోహణ లేదా ఈత వంటి క్రీడల్లో పాల్గొనేందుకు పెద్దగా ఇష్టపడరు. మా స్వచ్ఛంద సంస్థ చొరవతో మహిళల కోసం ఇటువంటి ఈవెంట్స్‌ ప్రోత్సహిస్తున్నాం. నమ్రత వారికి ప్రేరణనిస్తోంది.
– రషీద్, ఉమెన్స్ కలెక్టివ్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్

Read More:

ఇండియన్ సెల్ బయాలజిస్ట్ రణదివేకు గూగుల్ నివాళి


Next Story

Most Viewed