అదనపు రుణ సేకరణకు అనుమతించండి.. వైసీపీ ఎంపీ రిక్వెస్ట్

by  |
ycp mp
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర విభజన నాటి నుంచి తీవ్ర రెవెన్యూ లోటుతో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో అదనంగా 0.5 శాతం రుణాల సేకరణకు అనుమతించాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ఆయన ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు.

అత్యధిక వృద్ధి రేటు సాధించడానికి ప్రతి రాష్ట్రం తపన పడుతుంది. వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తోంది. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన తీరని అన్యాయం కారణంగా రెవెన్యూ వనరులన్నీ తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయాయి. అశాస్త్రీయంగా జరిగిన విభజన వలన ఏపీ ఇప్పటికే భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. ఏపీలో రెవెన్యూ లోటు అనివార్యమని 14వ ఆర్థిక సంఘం కూడా స్పష్టం చేసింది అని విజయసాయి రెడ్డి సభలో ప్రస్తావించారు. రెవెన్యూ లోటు కారణంగా అనేక ఇబ్బందులు, అవరోధాలు ఎదురవుతున్నా, కేంద్రం నుంచి ఆశించిన సాయం అందకపోయినా ముఖ్యమంత్రి నవరత్నాల ద్వారా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాలలో 45 శాతం మూలధన వ్యయం చేసిన ఏడు రాష్ట్రాలకు జీఎస్‌డీపీలో అదనంగా 0.5 శాతం రుణం సేకరించుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రి అనుమతించారు. మూలధన వ్యయం అనే నిబంధన విధించడం ద్వారా విభజన నాటి నుంచి రెవెన్యూ లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోమారు అన్యాయం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించి, పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రాష్ట్రాలతో నేరుగా సంప్రదింపులు జరుపుతామనంటూ ఇటీవల ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇప్పటికే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకునిజీఎస్‌డీపీలో 0.5 శాతం అదనంగా రుణ సేకరణకు రాష్ట్రాన్ని అనుమతించాలి అని విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా అమలు చేయడానికి దోహదం చేసినట్లవుతుందని ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed