రేపటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

by  |
రేపటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాడ్మింటన్ ఆటగాళ్లు మరో టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానున్నది. టోక్యో ఒలంపిక్స్‌లో బెర్త్ కోసం భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల ముగిసిన స్విస్ ఓపెన్‌లో పీవీ సింధు మినహా అందరూ విఫలమయ్యారు. సింధు ఫైనల్‌లో కారొలినా మారియాపై ఓటమి పాలైంది. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో సత్తా చాటడానికి సిద్దపడుతున్నారు. మొయిన్ డ్రాలో మెన్స్ సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయి ప్రణీత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలు ఉన్నారు. ఇక మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడి, మేఘన జక్కంపూడి-పూర్విష రామ్, అశ్విని భట్-శిఖ గౌతమ్‌లు మహిళల డబుల్స్‌లో, ధృవ్ కపిల-మేఘన జక్కంపూడి, సాత్విక్ సాయిరాజ్-అశ్విని పొన్నప్ప, ప్రనవ్ జెర్రీ చోప్రా-సిక్కి రెడ్డి మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నారు.

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్- మార్చి 17 నుంచి
వేదిక : బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్
లైవ్ : స్టార్ స్పోర్ట్స్ 3, బీడబ్ల్యూఎఫ్ యూట్యూబ్ చానల్
సమయం : ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి


Next Story