మొక్కుబడి సమావేశాలు.. సొల్యూషన్స్ నిల్లు!

by  |
మొక్కుబడి సమావేశాలు.. సొల్యూషన్స్ నిల్లు!
X

వరంగల్ బల్దియాలో ప్రస్తుత పాలకవర్గం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 20 సమావేశాలు జరిగాయి. కానీ సభ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో ఇంత నష్టం జరిగేది కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దిశ, వరంగల్ సిటీ: పదుల్లో ప్రజాప్రతినిధులు, వందల్లో ప్రభుత్వ అధికారులు, లక్షల్లో వినతులు, వేల కోట్ల రూపాయల నిధులు.. ఇవేవీ వరంగల్ మహా నగర రూపురేఖల్ని మార్చలేకపోతున్నాయి. ఫలితంగా మహా నగరం కాస్త నరకప్రాయంగా మారింది. నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ చేతలు ఆకిలి కూడా దాటడం లేదు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్ అని, హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ అన్నారు. శాసనసభ వేదికగా వరంగల్‌కు బడ్జెట్‌లో కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.

సమావేశాలే తప్ప పరిష్కారం చూపరు..

వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాశ్‌ రావు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 20 సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ప్రతి సమావేశంలో ప్రజాప్రతినిధులు వారివారి డివిజన్లలోని సమస్యలను లేవనెత్తడం, దానికి సమాధానంగా త్వరలో పరిష్కరిస్తామనే బదులు రావడం.. అలాగే ప్రతీ సమావేశంలో వందల కోట్ల నిధుల కేటాయింపు జరుగుతోంది. తప్ప పనులు మొదలు కావడం లేదు. చాలా పనులు టెండర్ల ప్రక్రియలోనే ఆగిపోతుండగా, మరికొన్ని శిలాఫలకాల వరకు వెళ్తున్నాయి. ఇంకొన్ని పనులు ప్రారంభమై అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. కొన్ని పనులు పూర్తయినా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభం ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

అధికారులపై అసహనం

జూలైలో నిర్వహించిన 16వ బల్దియా సర్వసభ్య సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. పని చేయని అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు నెలలో నిర్వహించిన 17వ బల్దియా సర్వసభ్య సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంట్రాక్టర్ కాళ్లు మొక్కినా పనులు కావడం లేదని ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సక్రమంగా చేపట్టడం లేదని అధికారుల మీద తీవ్ర విమర్శలు చేశారు. వీరే కాక బల్దియా పరిధిలోని ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్, రాజయ్య, ఎంపీలు పలు సందర్భాల్లో పనుల ఆలస్యంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

సభ జరిగితే సమస్యల ఏకరువే..

బల్దియా పరిధిలో 58 డివిజన్లు ఉండగా.. 58 మంది కార్పొరేటర్లు వారి వారి డివిజన్లలో ఉన్న సమస్యలను ఏకరువు పెడుతుంటారు. ప్రతీ సమావేశంలో సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం పరిపాటిగా మారింది తప్ప పరిష్కారం దిశగా అడుగులు పడడం లేదు. 16వ సర్వసభ్య సమావేశంలో హన్మకొండలోని కొత్త బస్టాంట్ రోడ్డు దుస్థితి, పబ్లిక్ గార్డెన్‌లోని వసతుల లేమి, కేడీసీ, బాల సముద్రం రోడ్డు పరిస్థితిని కార్పొరేటర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కానీ నేటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదు.

లక్ష్యం లేని ప్రయాణం..

అటు బల్దియా ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఏదో మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం, హాజరవడం జరుగుతోంది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని 100కు పైగా కాలనీలు నీట మునిగాయి. ఆ తర్వాతి క్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించారు. తక్షణ సాయంగా రూ.25 కోట్లు ప్రకటించారు. కానీ మంగళవారం కురిసిన వర్షాలకు నగరం మళ్లీ మునిగింది. అయితే రెండు నెలల తర్వాత కూడా గత చేదు అనుభవాల నుంచి పాలకులు ఏమీ చేయలేదని అర్థం అవుతోంది.

విలీన గ్రామాల్లో వ్యతిరేకత

వరంగల్ పురపాలక సంస్థలో నగరం చుట్టూ ఉన్న 42 గ్రామాలను కలుపుతూ 2016లో గ్రేటర్ వరంగల్‌గా ఏర్పాటు చేశారు. నాడు విలీన గ్రామాల ప్రజలు తమని కార్పొరేషన్‌లో విలీనం చేయొద్దని వ్యతిరేకించారు. అయిరా ప్రభుత్వం ఆయా గ్రామాలను గ్రేటర్లో విలీనం చేసింది. బల్దియాలో చేరిన ఆయా గ్రామాల్లో ఇప్పటికీ కనీస మౌలిక వసతుల కల్పన కరువైంది. విలీన గ్రామాల్లో రోడ్లు వేయడం లేదని, డ్రైనేజీలను నిర్మించడం లేదని విలీన గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్ చల్లా ధర్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పలు గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్‌లో సైతం ఎమ్మెల్యేలతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్లలో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏళ్ల తరబడి అపరిష్కతంగానే..

వరంగల్ మహా నగరంలోని హన్మకొండ బస్టాండ్ రోడ్, ఆటోనగర్ రోడ్, వరంగల్ స్టేషన్‌రోడ్, ఎంజీఎం నుంచి హంటర్ రోడ్డు వెళ్లే మార్గం ఏళ్ల నుంచి గుంతలమయంగానే ఉంది. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఊసే లేదు. నాలాలు, చెరువుల కబ్జాల నివారణకు చర్యలు శూన్యం. ఇక డివిజన్లలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా ఉంటోంది. ఇక పరిశుభ్రతకు కొలమానంగా నిలిచే స్వచ్ఛ సర్వేక్షణ్లో గతంలో బల్దియా 30వ స్థానంలో నిలువగా.. ఈసారి ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది.



Next Story

Most Viewed