స్టూడెంట్స్‌ను బడికి రప్పించిన రైలు బోగీలు

by  |
bogeelu1
X

దిశ, ఫీచర్స్: చాలా సందర్భాల్లో పిల్లలు స్కూల్‌కు వెళ్లేందుకు మారాం చేస్తుంటారు. చదువు మీద ఆసక్తి లేకపోవడంతోపాటు కొన్నిసార్లు బడి వాతావరణం నచ్చకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే పిల్లలు తమంతట తామే ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యేందుకు ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటోంది. జంషెడ్‌పూర్‌, తంగరాన్‌ పాఠశాలలోని ప్రిన్సిపాల్ అరవింద్ తివారీ.. రైలు బోగీ మాదిరి పెయింటింగ్స్‌ వేయించి తరగతి గదులను మొత్తం మార్పించేశాడు. అంతేకాదు విద్యార్థులు క్లాస్ రూమ్‌లో ఎంజాయ్ చేసే విధంగా ఫ్లోరింగ్‌పై భారీ పాము, నిచ్చెనతో వైకుంఠ పాళి గేమ్‌ను చిత్రీకరించాడు.

ఈ ఏడాది కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత స్కూల్ రీ-ఓపెన్ చేసినపుడు(సెప్టెంబర్ 24న) 75 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. గతేడాది 30-35 మంది విద్యార్థులతో పోలిస్తే.. ఈ సంఖ్య ఎక్కువ కాబట్టి ఇది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1-8 తరగతుల వరకు మొత్తం 269 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే.. తివారి 2017లో మొదటిసారి ఈ పాఠశాలకు బదిలీ అయినప్పుడు పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు కనీస ఆసక్తి చూపడం లేదనే విషయాన్ని గమనించాడు. దీనికోసం ఒక ప్రణాళికను రూపొందించాలనుకున్న తను.. పలు ఆలోచనాత్మక సెషన్ల తర్వాత పాఠశాలను రైలు ఆకారంలోకి మార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రతీరోజు రైలు ‘మిస్’ కావద్దని పిల్లలకు సూచిస్తూ సమయపాలన పాటించే ఆసక్తిని కలిగించాడు. ఈ విధంగా కొత్త అడ్మిషన్లు పెరగగా.. ఇంతకు ముందు ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన ఆరుగురు విద్యార్థులు సైతం ఇదే స్కూల్‌లో కొత్తగా చేరడం విశేషం.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు గర్వపడాలని, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల కంటే ఏ మాత్రం తక్కువ కాదని వారికి అనిపించడమే లక్ష్యమని తివారీ అన్నారు. ఇక రోజువారీ హాజరును గణనీయంగా మెరుగుపరిచే ప్రయత్నం విజయవంతమైందని గ్రామ ప్రధాన్ మంగళ్ పాన్ వెల్లడించారు. పొరుగున ఉన్న జోనోడిహ్, ఖిదిర్‌సాయితో పాటు సిలింగ్ గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలలో చేరుతున్నారని తెలిపారు. పిల్లలు విసుగు చెందకుండా ఉండేందుకే వివిధ మార్గాలను అవలంబించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ప్రతీరోజు స్కూల్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎక్కడికో వెళ్ళేందుకు రైలు ఎక్కుతున్నట్లుగా అనిపిస్తోందని, ఇది చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు.


Next Story

Most Viewed