డేంజర్ బెల్స్… దడ పుట్టిస్తున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్

332

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా కలవరం సృష్టిస్తోంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్​ దడ పుట్టిస్తున్నది. ఒమెక్రాన్​గా పిలవబడుతున్న వైరస్​ మహాడేంజర్​గా మారుతున్నది. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందికి వ్యాపిస్తోంది. అంతేగాక వేగంగా తీవ్రతనూ పెంచుతున్నది. మొదటి, రెండో వేవ్​లతో పోల్చితే శరీరంపై స్పీడ్​గా దాడి చేస్తున్నదని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలు, శాస్త్రవేత్తలు ఇప్పటికే అలర్ట్​ను ప్రకటించారు. మొదటి, సెకండ్​వేవ్​ల​లో వచ్చిన ఆల్ఫా, డెల్టాతో పోల్చితే వైరస్​లో ఇది 38 శాతం మార్పులు చెందుతూ వ్యాప్తికి దారితీస్తున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేసింది. దీని తీవ్రత కూడా అధికంగా ఉంటుందని స్వయంగా డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం. వివిధ దేశాల్లో ఇప్పటికే ప్రయాణ ఆంక్షలు కూడా విధించారు. టీకా తీసుకున్న వారికీ ముప్పేనని ఎయిమ్స్​ డాక్టర్లు కూడా చెప్పడం కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్​ జారీ చేసింది. ఎయిర్​ పోర్టులలో ప్రత్యేకంగా స్క్రీనింగ్​ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించింది.

అంతేగాక కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్న ఏడు దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎక్కడిక్కడ టెస్టులు చేస్తూ అనుమానితుల శాంపిల్స్​ను జీనోమ్​ సీక్వెన్సీకి పంపించాలని సూచించింది. దీంతో పాటు పీఎం మోడీ కూడా శనివారం ఉదయం కేంద్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్​ పరిస్థితి, ఒమెక్రాన్​ గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్త వేరియంట్​ను నియంత్రించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చారు.

హరీష్ ​అత్యవసర సమావేశం

కొత్తగా తెరమీదకు వచ్చిన కొత్త కరోనా వేరియంట్​పై ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. మొదటి, రెండో వేవ్​లలో పోల్చితే దాడి ఎక్కువ చేస్తుందనే ప్రచారం, రీసెర్చ్​లు చూసి భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్​పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇతర దేశాల్లో వ్యాప్తి వేగంగా పెరుగుతుండటంతో ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ప్రత్యేక స్క్రీనింగ్​లతో పాటు టెస్టింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనుమానితుల శాంపిల్స్​ను సీసీఎంబీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక అంతరాష్ట్రాల బోర్డర్లలోనూ టెస్టింగ్​లు మళ్లీ షురూ చేశారు. మరోవైపు వైరస్​ రాష్ట్రంలో చొరబడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు ఆదివారం వైద్యశాఖ హెచ్​ఓడీలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసులు పెరుగుతున్న తీరు, వ్యాప్తి రేట్​, దాని తీవ్రత వంటి అంశాలపై చర్చించనున్నారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా చేయాల్సిన కార్యక్రమాలు, వ్యాక్సినేషన్​ స్పీడప్​పై ప్రత్యేక ప్రణాళికను తయారు చేస్తున్నారు. అంతేగాక కొత్త కరోనా పరిస్థితులపై రేపు సాయంత్రం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రితో కూడా మంత్రి హరీష్​ మాట్లాడనున్నారు. దీంతో పాటు ఒక వేళ కేసులు పెరిగితే నియంత్రణకు చేయాల్సిన కార్యక్రమాలు, మందులు, మౌలిక వసతుల సమకూర్పుపై చర్చ జరగనుంది. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లోని బెడ్లను మళ్లీ సిద్ధం చేయాలని ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.వ్యాక్సినేషన్​, టెస్టులు తప్పనిసరి చేయనున్నారు.

టీకా తీసుకున్నా…

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ టీకా రెండు డోసులు తీసుకున్నా అంటుకుంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్​తో పాటు కరోనా నిబంధనలపై కూడా ఫోకస్​ పెట్టాలని డబ్ల్యూహెఓ సూచించింది. తొలి విడతగా దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్‌ పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తర్వాత ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ ఈ కేసులు భారీగా నమోదయ్యాయి. ఆయా దేశాల్లో కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారి శాతం కూడా ఎక్కువగా ఉన్నా.. వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందడం గమనార్హం. దీంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. పది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో సగటున ప్రతి రోజూ 300 మంది కరోనా బారిన పడగా, నాలుగైదు రోజుల నుంచి కేసులు మూడు రెట్లు పెరిగినట్లు అక్కడి అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్‌ ప్రావిన్సులో ఈ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్థానిక వైద్య నిపుణులు వెల్లడించారు. అక్కడ నమోదవుతున్న వాటిలో 90% కేసులకు ఈ వేరియంటే కారణమని, మరో ఏడు, ఎనిమిది దేశాల్లోనూ ఈ వేరియంట్‌ వ్యాపించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్​ఓ కూడా పేర్కొన్నది. మరోవైపు న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ ప్రకటిస్తూ అక్కడి అధికారులు ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం పేర్కొన్నది. కానీ న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ , ముందస్తు జాగ్రత్తతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు స్పష్టం చేసింది.

ఆ దేశాలపై ఆంక్షలు

దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇప్పటికే ఇజ్రాయెల్‌ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ బి.1.1.529 వేరియంట్‌ నమోదు కాకపోయినా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్‌, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశం కూడా శుక్రవారం ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి. ఆస్ట్రేలియా కూడా సౌత్​ ఆఫ్రికా, నబిబియా, జింబావ్వే, తదితర దేశాల నుంచి వచ్చే వారిపై దృష్టి పెట్టింది. అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్​ విధించాలని అక్కడి అధికారులకు సూచించింది. జపాన్​ కూడా ఆయా దేశాల నుంచి వస్తే 10 రోజులు, కెనడా 14 రోజుల పాటు క్వారంటైన్​ విధించాలని నిర్ణయం తీసుకున్నది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం వెల్లడించింది. కానీ అనధికారంగా ఇప్పటికే దేశంలోనూ కొత్త వేరియంట్​ ఎంట్రీ అయినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో కొత్త వేరియంట్‌ పరిస్థితిపై నిత్యం పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.

ఢిల్లీలో హడావుడి…

కొత్త కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా వివిధ దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆయా దేశాల నుంచి భారత్‌లోకి వైరస్ ప్రవేశించే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం ఇప్పటికే సౌతాఫ్రికాకు పలు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్‌ ఇప్పటికే ఆంక్షలు విధించింది. మరోవైపు కొన్ని దేశాలు రాత్రికి రాత్రే విమాన సర్వీసులు రద్దు చేస్తున్నాయి. క్వారంటైన్‌ నిబంధనలను మళ్లీ షురూ చేస్తున్నాయి. టెస్టులను కూడా తప్పనిసరి చేస్తున్నాయి.