ఈ ఒక్క పనితో ప్రభుత్వానికి రోజుకు రూ. 20 కోట్లు ఆదా

by  |
air
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా టాటా గ్రూప్ సొంతమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రైవేటీకరణకు సంబంధించి గత కొంతకాలంగా ప్రభుత్వం తక్కువ ధరకే ఎయిర్ఇండియాను ప్రైవేట్ కంపెనీకి అప్పగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. తీవ్రమైన రుణ భారాన్ని మోస్తున్న ఎయిర్ఇండియా సంస్థ ద్వారా టాటా గ్రూప్ పెద్దగా లాభపడిపోయే అవకాశం లేదన్నారు.

‘కొత్త యాజమాన్యానికి ఎయిర్ఇండియాను కొనసాగించడం సులభమైన పని కాదు. విమానాలన్నిటినీ పునరుద్ధరించడానికి టాటా సన్స్ భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సంస్థను కొనసాగించడానికి ప్రభుత్వం రోజుకు రూ. 20 కోట్లను ప్రజల సొమ్ము ద్వారా ఖర్చు చేసింది. ఇప్పుడు ఆ వ్యయం నుంచి విముక్తి లభించింది. ఎయిర్ఇండియాను కొనడం వల్ల ఉన్న ఒకే ఒక ప్రయోజనం కొత్త యాజమాన్య సంస్థకు ఎప్పటి నుంచో ఉన్న అప్పులు కొనసాగకపోవడం. ఎయిర్ఇండియా అమ్మకం ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం ప్రజల పన్నులను ఆదా చేసింది’ అని తుహిన్ కాంత పాండే వివరించారు.

‘రానున్న రోజుల్లో ఎయిర్ఇండియా విమానాలను నడిపేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయక తప్పదు. దీనికోసం టాటా గ్రూప్ భారీగా పెట్టుబడులకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఏడాది కాలం వరకు ఉద్యోగులను తొలగించడానికి లేదు. ఏడాది అనంతరం వాలెంటరీ రిటైర్‌మెంట్(వీఆర్ఎస్) ఇవ్వడానికి వీలుంటుంది’ అని ఆయన చెప్పారు. కాగా, వీలైనంత తక్కువ సమయంలో టాటా సంస్థకు ఎయిర్ఇండియాను అప్పగించనున్నట్టు తుహిన్ కాంత పాండే వెల్లడించారు.


Next Story