Araku Coffee : ప్రపంచ మార్కెట్ లోకి అరకు కాఫీ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-02 13:09:43  IST  )

విశాఖ అరకు ఏజెన్సీ(Visakhapatnam Araku Agency)లో గిరిజన రైతు(Tribal Farmers)లు పండించే కాఫీ(Coffee)కి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌(Organic Certification) లభించింది.

Araku Coffee : ప్రపంచ మార్కెట్ లోకి అరకు కాఫీ
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ అరకు ఏజెన్సీ(Visakhapatnam Araku Agency)లో గిరిజన రైతు(Tribal Farmers)లు పండించే కాఫీ(Coffee)కి ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌(Organic Certification) లభించింది. గిరిజన సహకార సంస్థ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇన్నాళ్లూ దీనిని ‘జీసీసీ అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో విక్రయిస్తోంది. ఇకపై ‘సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ కాఫీ’ పేరుతో మార్కెట్‌లో అమ్మేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం టాటా కంపెనీతో జీసీసీ ఒప్పందం చేసుకుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.

పూర్తిగా సేంద్రియ పంట అయినప్పటికీ ‘అగ్రికల్చర్‌ అండ్‌ ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(అపెడా)’ ధ్రువీకరిస్తే తప్ప ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ రాదు. రైతులు కాఫీ పండించే విధానాన్ని అన్ని దశల్లో మూడేళ్లు వరుసగా పరిశీలించి సంతృప్తి చెందితే తప్ప ‘అపెడా’ సర్టిఫికెట్‌ ఇవ్వదు. దీనికి జీసీసీ అధికారులు నిత్యం రైతులను ప్రోత్సహిస్తూ కాఫీని సాగు చేయించారు. దీని కోసం మరో రూ.70 లక్షలు వెచ్చించారు. ఎట్టకేలకు ‘అపెడా’ అరకు కాఫీకి గత నెల ‘ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌’ ఇచ్చింది. ఒక్క కాఫీకే కాకుండా అందులో అంతర పంటగా వేసిన మిరియాలకు కూడా ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ వచ్చింది. దాంతో ఒక్కసారిగా అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌ ద్వారాలు తెరుచుకున్నాయి.

జర్మనీ సహా పలు యూరప్‌ దేశాల నుంచి అరకు ఆర్గానిక్‌ సర్టిఫైడ్‌ కాఫీ కావాలనే డిమాండ్‌ మొదలైంది. ఈ ఉత్సాహంతో మిరియాలను కూడా ‘ఆర్గానిక్‌ పెప్పర్‌’ పేరుతో విక్రయించాలని జీసీసీ యత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మరికొన్ని మండలాల్లో కాఫీ సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు రూ.2.2 కోట్లు మంజూరు చేసింది. నిజానికి, అరకు కాఫీ ప్రాధాన్యాన్ని సీఎం చంద్రబాబు ఎప్పుడో గుర్తించారు. హుద్‌హుద్‌ తుఫాన్‌కు ధ్వంసమయిన కాఫీ తోటలను పునరుద్ధరించడానికి అప్పట్లో రూ.540 కోట్లు మంజూరుచేశారు.

విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ప్రత్యేకంగా అరకు కాఫీ పేరుతో స్టాల్‌ ఏర్పాటుచేయించారు. అమరావతి సచివాలయంలో అరకు కాఫీ స్టాల్‌ పెట్టించారు. ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించవద్దని సూచిస్తూ 2,600 గిరిజన కుటుంబాలకు శిక్షణ ఇప్పించారు. వారికి అవసరమైన ఆర్థిక సాయం, పంట కొనుగోలు, మార్కెటింగ్‌ వంటి బాధ్యతలను జీసీసీ తీసుకుంది. త్వరలోనే విశ్వవిపణిలోకి అరకు కాఫీ సగర్వంగా అడుగుపెట్టనుంది. యూరప్‌ దేశాల్లో అరకు కాఫీకి మంచి డిమాండ్‌ నెలకొంది.

మరోవైపు విశాఖ ఏజెన్సీ, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోను పసుపుకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ సాధించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది.

Next Story