రైతులకు వ్యవసాయ యూనివర్సిటీ కీలక సూచనలు

503
paddy crop

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి పంటలను కాపాడుకోవాలి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. సాధారణ వర్షంపాతం కంటే 62శాతం అధికంగా వర్షం కురిసినందుకు పంటలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. వివిధ పంటల్లో చేపట్టాల్సిన జాగ్రత్తలను వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు గురువారం ప్రకటన ద్వారా తెలిపారు.

వరిలో పాటించాల్సిన జాగ్రత్తలు

వరి పొలంలో పేరుకుపోయిన మురుగు నీటిని ప్రత్యేకంగా కాలువలు ఏర్పాటు చేసి పూర్తిగా తొలగించాలి. పంటలకు తాత్కాలికంగా ఉపయోగించే నత్రజని, ఎరువులను వాడకూడదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరికి బాక్టీరియా, ఎండాకు తెగులు సోకే అవకశాలున్నాయి. దీని నివారణకు 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రా. ప్లాంట్ మైసిన్ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పత్తి పంటకు ఇలా..

అధిక వర్షాలు, ఆకాశం మేఘావృతమై ఉండడం వలన పత్తిలో వడలు తెగులు సోకే ప్రమాదముంది. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు చుట్టూ నేలను తడపాలి. ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగుల నివారణకు ఒక గ్రాము కార్బెండజిమ్, 1.5గ్రామలు ఎసిఫేట్ మందును లీటరు నీటితో పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పత్తిలో గూడు రాలుటకు అనువైనవి. వీటి నివారణకు 2 మీ.లి ప్లానోఫిక్స్ మందును పది లీటర్ల నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత పైపాటుగా అదనపు మోతాదుగా ఎకరానికి 35 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. లేదా 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా మల్టీ-కె మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

కంది సస్యరక్షణ ఇలా..

కందిలో ఫైటోఫ్తారా ఎండు తెగులు ఆశిస్తున్నందున 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును ఒక లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రాము కార్బెండజిమ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత నెలలో పైపాటుగా ఎరువులను లేదా 20 గ్రా. యూరియాను లేదా 10 గ్రా. మల్టి-కే మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఇలా మొక్కజొన్నను కాపాడుకోండి

వర్షాలు ఆగిన తర్వాత పైపాటుగా అదనపు మోతాదుగా ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎర్వినియ ఎండు తెగులు ఆశించడానికి అనుకూలంగా ఉన్నందున నివారణకు 100 కిలోల వేపపిండి, 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ కలిపి పొలమంతా చల్లుకోవాలి.

సోయాచిక్కుడు ఆ ఎరువులు మేలు

వర్షాలు ఆగిన తర్వాత, నేలలో పైపాటుగా ఎరువులు లేదా 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా. మల్టీ-కె మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆశింస్తున్నందున నివారణకు 2.5గ్రా. కాల్బెండజిమ్ + మాంకోజెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కూరగాయల పంటలకు ఇదే సరైంది

కూరగాయలలో ఆకుపచ్చ తెగులు సోకుతోంది. దాని నివారణ కోసం 1గ్రాం కార్బెండజిమ్ లేదా 1మిలీ ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. దీని వల్ల కూరగాయల పంటలను కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..