నిరుద్యోగుల రిక్వెస్ట్.. వయోపరిమితి సడలింపు గడువు పూర్తి

by  |
Unemployment, cm kcr
X

‘తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక తర్వాత లక్షకుపైగా ఉద్యోగాలిచ్చాం. ఈ స్థాయిలో ఉద్యోగాలను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వమూ భర్తీ చేయలేదు. అతి త్వరలో మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం’
-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మంత్రులు.

మూడేండ్లుగా నోటిఫికేషన్లు లేక నిరాశలో ఉన్న నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి గుదిబండగా మారనుంది. తాజాగా వ్యవసాయవిశ్వవిద్యాలయం, వెటర్నరీ వర్సిటీల్లో 112 జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి మార్చి 31న నోటిఫికేషన్ వెలువడింది. అందులో జనరల్ కేటగిరీ వయోపరిమితి కేవలం 34 ఏండ్లుగా ప్రభుత్వం పేర్కొన్నది. గతంలో ఇచ్చిన పదేళ్ల సడలింపు ప్రస్తావనే లేదు. దీంతో హాస్టళ్లు, క్యాంపస్ లలో ఉంటూ కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ కు సిద్ధమవుతున్న వారు ఢీలా పడుతున్నారు. త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్లకూ మరో మారు సడలింపు ఇవ్వకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మూడేండ్లుగా నోటిఫికేషన్లు లేక తీవ్ర నిరాశలో ఉన్న అభ్యర్థులకు మంత్రుల ప్రకటన కొత్త ఆశలు రేపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కోడ్ ముగియగానే ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిరుద్యోగులు భావిస్తున్నారు. యాభై వేల కొలువులు భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా డిసెంబరు 13న ప్రకటన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ స్థాయిలో ప్రిపరేషన్ కూడా మొదలైంది. ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వివరాలు పంపాలని సీఎస్ రెండు సార్లు సర్క్యూలర్ జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా, గతంలో ఇచ్చిన ‘వయోపరిమితి’ నిబంధన అమలవుతుందా? లేదా? అన్నది నిరుద్యోగుల్లో, ఆశావహుల్లో గుబులు రేపుతున్నది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ప్రత్యక్ష నియామకాల్లో పదేండ్ల వయో సడలింపు జీవోకు కాలం చెల్లి ఏడాదిన్నర అయినా దాని పొడిగింపుపై ఎలాంటి ప్రకటనా లేదు.

ఏడాదిన్నర క్రితం కాలం చెల్లు

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు విలువైన కాలం నష్టపోయారన్న కారణంతో ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల వయోపరిమితిలో పదేండ్ల సడలింపు ఇస్తూ 2015 ఆగస్టులో జీవో జారీ చేసింది. ఈ జీవో కాలపరిమితి ఏడాది మాత్రమే అని పేర్కొంది. కానీ ఆ ఏడాదిలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. అందుకే ప్రభుత్వం జీవో పరిమితిని మరో ఏడాది పాటు పొడిగించింది. ఆ తర్వాత కోర్టు కేసులు, ఇతర కారణాలతో నియామకాల్లో జాప్యం జరిగింది. ఆశించిన స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు రాకపోవడం, వయస్సు మీరి పోతుండటంతో వయోపరిమితి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అభ్యర్థించారు. వారి అభ్యర్థనను దృష్టిలో పెట్టుకుని మరోసారి వయో పరిమితిని పొడిగిస్తూ 2017, ఆగస్టు 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈసారి రెండేండ్లపాటు వర్తించనున్నట్లు పేర్కొంది. ఆ ప్రకారం 2019, జూలై 26తో జీఓ 190కు కాలం చెల్లిపోయింది. ఆ తర్వాత నోటిఫికేన్లు వెలువడకపోవడంతో నిరుద్యోగులు కూడా వయోపరిమితిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

తాజా నోటిఫికేషన్‌లో దక్కని అవకాశం

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో 112 జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులను డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేయడానికి మార్చి 31న నోటిఫికేషన్ విడుదలైంది. అందులో జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏండ్లుగా ప్రభుత్వం పేర్కొంది. గతంలో జీవోలో పేర్కొన్న పదేళ్ల సడలింపు ప్రస్తావన లేదు. అందుకే నిరుద్యోగ అభ్యర్థుల్లో ఇప్పుడు ఆందోళన తలెత్తింది. చాలా కాలం తర్వాత ‘జనరల్ డిగ్రీ’పై నోటిఫికేషన్ విడుదలైందన్న సంతోషంలో ఉన్న అభ్యర్థులకు ‘వయోపరిమితి’ షాక్‌ ఇచ్చింది. త్వరలో గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగ ప్రకటనలు వస్తాయనుకుంటున్న నేపథ్యంలో వయోపరిమితి పొడిగించకుంటే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన మొదలైంది.

యూనిఫామ్డ్ సర్వీసెస్ ఉద్యోగాలకు మినహా మిగిలిన పోస్టులకు జనరల్ క్యాటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 34 ఏండ్లుగా ఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, పీహెచ్‌సీ (దివ్యాంగులు) అభ్యర్థులకు 10 ఏండ్లు సాధారణ సడలింపు అమలవుతున్నది. ఈ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 39 ఏండ్లు, పీహెచ్‌సీలకు 44 ఏండ్లు అవుతున్నది. కానీ జీవో 190 ప్రకారం అందరికీ 10 ఏండ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అలాగైతే జనరల్ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లు అవుతుంది. మిగతా క్యాటగిరీ అభ్యర్థులకు సాధారణ పొడిగింపుతో మరికొంత వెసులుబాటు కలుగుతుంది.

అడపాదడపా నోటిఫికేపన్లతో ఇబ్బందులు

గత 10 ఏండ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా వెలువడలేదు. 2011లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చివరిది. కోర్టు కేసుల నేపథ్యంలో భర్తీలో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు 2019లో ఉద్యోగ నియామకాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేండ్లలో ఒకే ఒక గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చి కూడా చాలా కాలమైంది. తరుచూ నోటిఫికేషన్లు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఏండ్లకేండ్లు చదువుతుండటంతో చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, ఇండ్లకు వెళ్లలేక యూనివర్సిటీల క్యాంపస్‌లు, రూమ్‌ల్లో ఉంటూ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిలో వయోపరిమితి సడలింపును ఇవ్వకుండా నోటిఫికేషన్ వచ్చినా వృథానే అని భావిస్తున్నారు.

తీవ్రంగా నష్టపోతాం : వెంకటేశ్, నిరుద్యోగి, నల్లగొండ

“నా వయస్సు ఇప్పుడు 40 ఏండ్లు. గత గ్రూప్-1 నోటిఫికేషన్‌లో మెయిన్స్ వరకు వెళ్లాను. కానీ, ఉత్తీర్ణత సాధించలేకపోయాను. నూతన గ్రూప్-1 నోటిఫికేన్‌కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. జోనల్, పోస్టుల విభజన కారణంగా నోటిఫికేషన్ నాలేదు. అతి త్వరలో నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నాను. కానీ, వయస్సు దాటిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిలో సడలింపు ఇవ్వకుంటే నష్టపోతా”.

మరోసారి అవకాశం ఇవ్వాలి : మురళీ, నిరుద్యోగి, ఖమ్మం

“ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఇంటికి కూడా వెళ్లకుండా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు నాకు 36ఏండ్లు. జనరల్ క్యాటగిరీకి చెందిన వ్యక్తిని. త్వరలో 50వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తామని మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎంతో సంతోషించా. కానీ, వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం లేదని తాజా జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్‌తో స్పష్టమైంది. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను”.


Next Story

Most Viewed