మధ్యాహ్నం కునుకు మంచిదే!

by  |
మధ్యాహ్నం కునుకు మంచిదే!
X

ధ్యాహ్నం భోజనం చేయగానే ప్రపంచంలో ఉన్న నిద్రమత్తు మొత్తం మన మీద ఉన్నట్లు అనిపిస్తుంటుంది. కానీ ఆఫీసులో పనిచేస్తూ నిద్రపోలేం కదా!.. కానీ వీలైతే ప్రయత్నించండి అని సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుతుజా దివేకర్ అంటున్నారు.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ చిన్న కునుకు తీయడం ద్వారా కొవ్వు పెరిగి లావైపోతారని, రాత్రిపూట నిద్ర రాక ఇబ్బంది పడతారని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ సరైన పద్ధతిలో, సూచించిన సమయం పాటు పడుకుంటే ఎలాంటి సమస్యలు ఉండకపోగా ఆరోగ్యానికి చాలా మంచిదని రుతుజా చెబుతున్నారు. దీని గురించి ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సరిగా తిని, సరిగా పడుకోని వాడికి యోగం దొరకదని భగవద్గీతలో చెప్పారు. అలాగే కునుకు తీయనివాడు దెయ్యంతో సమానమని ముస్లిం సంస్కృతి చెబుతోంది. అలాగే ప్రముఖ అథ్లెట్ రొనాల్డో తన పర్ఫార్మెన్స్‌కి మధ్యాహ్నం కునుకే ప్రధాన కారణమని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె ఉదహరించారు.

కునుకు వల్ల లాభాలేంటి?

గుండె సర్జరీలు అయిన వారికి, హై బీపీతో బాధపడేవారికి ఈ కునుకు వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్, పీసీఓడీ, థైరాయిడ్ సమస్య ఉన్నవారికి హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది. ఇంకా జీర్ణశక్తి పెరుగుతుంది, నిద్రలేమి తగ్గుతుంది.

కానీ ఇవన్నీ కలగాలంటే కునుకు తీసే విధానంలో కొన్ని విధానాలు పాటించాలి. సరిగ్గా భోజనం చేసిన వెంటనే పడుకోవాలి. వామకుక్షి ఆసనంలో అంటే ఎడమవైపుకి తిరిగి తలకింద చేయి పెట్టుకొని పడుకోవాలి. 10 నుంచి 30 నిమిషాల పాటు మాత్రమే నిద్రపోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆరోగ్యం బాగోలేనివారు 90 నిమిషాల వరకు పడుకోవచ్చు. సరిగ్గా మధ్యాహ్నం ఒకటి నుంచి మూడింటి మధ్య మాత్రమే పడుకోవాలి.

చేయకూడనివి!

సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల మధ్య నిద్రించొద్దు. అలాగే భోజనం చేసిన వెంటనే కాఫీలు, టీలు, సిగరెట్లు, చాక్లెట్లు తినొద్దు. ఫోన్, టీవీ పక్కన పెట్టాలి. 30 నిమిషాల కంటే ఎక్కువసేపు పడుకోవద్దు.

ఇంట్లో ఉండేవారికి ఇలా పాటించడం సాధ్యమవుతుంది. మరి ఆఫీసులో వారికి కష్టం కాబట్టి కొన్ని మార్పులు చేయవచ్చు. పూర్తిగా కాళ్లు చాపి పడుకోకుండా మీ కంప్యూటర్ కీబోర్డుని పక్కకి జరిపి రెండు చేతుల మీద ఎడమవైపుకి తల పెట్టి కళ్లు మూసుకుని ఏదైనా మంచి ప్రదేశం గురించి ఆలోచిస్తూ నిద్రపోండి. ఆఫీసులో నిద్ర పోతున్నపుడు మీ హెచ్‌ఆర్ వచ్చి లేపితే ఉత్పాదకత పెంచుతున్నామని చెప్పండి.


Next Story