ఏడేళ్లుగా పోలీస్ శాఖపైనే ఫోకస్.. వాటిని మరిచిన కేసీఆర్

by  |
Telangana, police Vehicles
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖకు సరికొత్త హంగులు సమకూరాయి. ఏడున్నరేళ్ళ కాలంలో కేవలం పోలీసు శాఖ 16,116 కొత్త వాహనాలను సమకూర్చుకున్నది. ఇందుకోసం రూ.673.96 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో రూ. 16.71 కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా పోలీసు శాఖ ఆధునికీకరణ కింద వచ్చిన నిధులు కాగా మిగిలిన రూ. 657.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చింది. ఇందులో మోటారు సైకిళ్ల మొదలు మినీ ట్రక్కుల వరకూ ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే రూ.300 కోట్లతో 1659 ఇన్నోవా కార్లను, 2073 బైక్‌లను సమకూర్చుకోగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మరో 15,553 వాహనాలను సమకూర్చుకున్నది.

రాష్ట్రంలో నేరాలను నియంత్రించడానికి, విజిబుల్ పోలీసింగ్ ద్వారా శాంతిభద్రతలను అదుపులోకి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం వందల కోట్ల రూపాయలను ప్రతీ ఏటా ఖర్చు చేస్తున్నది. రోడ్లమీద కనిపిస్తున్న పాట్రోలింగ్ వాహనాలు, ఇంటర్‌సెప్టర్ వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అనుసంధానం చేయడంతో జవాబుదారీతనం నెలకొన్నది. కానీ పోలీసు అధికారులకు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం పెరిగిపోయింది. కొన్ని రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు విజిబుల్ పోలీసింగ్ పేరుతో రోడ్ల పక్కన చెట్ల నీడన పార్కింగ్ చేయడం తరచూ కనిపిస్తూ ఉంటుంది.

నేరాల నియంత్రణ, శాంతిభద్రతలను అదుపు చేయడం లాంటి కారణాలతో అవి అలా ఉంటున్నా పోలీసు సిబ్బంది సేద తీరడానికి, కునుకు తీయడానికి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతున్నాయి. ఏడేళ్ళ కాలంలో మొత్తం రెండు విడతలుగా ప్రభుత్వం పోలీసు శాఖకు వాహనాలను సమకూర్చింది. తొలి ఏడాదిలోనే రూ.1.83 కోట్లను ఖర్చు చేసింది. రెండో విడతలో మరో రూ. 474 కోట్లను ఖర్చు చేసింది. పాట్రోలింగ్ వాహనాల వినియోగం పెరగడంతో గతంతో పోలిస్తే డయల్ 100 నెంబర్‌కు ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సంఘటనా స్థలాలకు చేరుకుంటున్నాయి. కానీ కొద్దిమంది అధికారులు ఒకటికి మించి వాహనాలు వాడుతుండడంతో వ్యక్తిగత అవసరాలకూ ప్రభుత్వ వాహనాలు, డీజిల్‌ను వినియోగించడం పెరిగిపోయింది. వీటికి జవాబుదారీతనం లేకుండా పోయింది.

పోలీసు శాఖ ఇటు వాహనాలు, అటు టెక్నాలజీ, మరోవైపు సీసీ టీవీల్లాంటి ఉపకరణాలకు భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నా.. హోంశాఖ పరిధిలో ఉన్న ఫైర్ డిపార్టుమెంట్ లాంటివి మాత్రం ఆ స్థాయి ఆధునికీకరణకు నోచుకోలేకపోతున్నాయి. ‘కాగ్’ సైతం ఇదే విషయంలో ప్రభుత్వ పనితీరును తప్పుపట్టింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన 20 రోజుల వ్యవధిలోనే హోం శాఖను గాడిన పెట్టే పనిని మొదలుపెట్టారు. పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తక్షణం వీటిని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పి రూ. 300 కోట్లను విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

ఆ ప్రకారం తొలి ఏడాది (2014)లోనే పోలీసు శాఖ 2073 బైక్‌లను బీట్ పెట్రోలింగ్ కోసం, 1659 ఇన్నోవా పాట్రోలింగ్ కార్లను సెక్టార్ స్థాయిలో వినియోగించడానికి కొనుగోలు చేసింది. వీటికి తోడు 254 మీడియం వాహనాలను, 26 హెవీ మోటారు వాహనాలను కూడా సమకూర్చుకున్నది. వీటికి రూ.183 కోట్లను ఖర్చు చేసింది. ఒక్కో ఇన్నోవా వాహనాన్ని సగటున రూ.11 లక్షల చొప్పున కొనుగోలు చేసింది. స్కార్పియో, బొలెరో లాంటి వాహనాలను మాత్రం సగటున రూ. 9 లక్షలకు కొనుగోలు చేసింది. బైక్‌లను మాత్రం సగటున రూ. 58 వేల చొప్పున కొనుగోలు చేసింది.

పాట్రోలింగ్ కోసం వాడే ఇన్నోవా వాహనాలు, రద్దీ ప్రాంతాల్లో ఉంచుతున్న ఇంటర్‌సెప్టర్ లాంటి వాహనాలు, రాత్రిపూట బీట్ పాట్రోలింగ్ కోసం వాడుతున్న బైక్‌లు పెద్దగా దుర్వినియోగం కాకపోయినా వ్యక్తిగత వాహనాల కదలికలపై మాత్రం నియంత్రణ కరువైంది. ఈ వాహనాలన్నీ బేసిక్ మోడల్‌వి మాత్రమే కొనడంతో ఆ తర్వాత కమ్యూనికేషన్ ఉపకరణాలు, సైరన్, బీకాన్ తదితరాలకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత బడ్జెట్‌ నుంచి రూ. 657 కోట్లను 15,533 వాహనాల కోసం ఖర్చు చేయగా కేంద్రం నుంచి వచ్చిన రూ. 16.71 కోట్లతో 583 వాహనాలను కొనుగోలు చేసింది.

పాట్రోలింగ్ వాహనాలకు పెద్దగా పనులు లేకుండా పోవడంతో కేవలం విజిబుల్ పోలీసింగ్ అవసరాల కోసం రోడ్ల పక్కన పార్కింగ్ చేసి ఉంచాల్సి వస్తున్నది. కొన్ని సందర్భాల్లో కేవలం పోలీసులు ఫోన్లలో వీడియోలు చూసుకోడానికి, విశ్రాంతి తీసుకోడానికి ఉపయోగపడుతున్నాయి. ఒకటీ రెండు సందర్భాల్లో పాట్రోలింగ్ వాహనంలోనే మద్యం సేవిస్తూ ఉన్న దృశ్యాలూ మీడియా కంట పడ్డాయి. కొత్త వాహనాల ద్వారా విజిబుల్ పోలీసింగ్ పెరిగి కిడ్నాప్‌లు, చైన్ స్నాచింగ్‌లు లాంటివి నియంత్రణలోకి రాగలిగాయి. ఇక సీసీటీవీలను వినియోగించడం ద్వారా మరికొంత అదుపులోకి వచ్చినట్లయింది.

పోలీసు శాఖ రాష్ట్ర బడ్జెట్ నుంచి సమకూర్చుకున్న కొత్త వాహనాల వివరాలు :

2014-15లో :
మీడియం వాహనాలు – 254 – రూ. 27.76 కోట్లు
లైట్ వెహికల్స్ – 1659 = రూ. 139 కోట్లు
బైక్‌లు – 2073 – రూ. 12.05 కోట్లు

2018-19లో :
మీడియం వాహనాలు – 496 – రూ. 75.01 కోట్లు
లైట్ వెహికల్స్ – 3025 = రూ. 348 కోట్లు
బైక్‌లు – 8000 – రూ. 39.91 కోట్లు

మొత్తం వాహనాల కొనుగోళ్ళు :
మీడియం వాహనాలు – 776 – రూ. 106.85 కోట్లు
లైట్ వెహికల్స్ – 4684 = రూ. 488 కోట్లు
బైక్‌లు – 10,073 – రూ. 51.96 కోట్లు

కేంద్ర బడ్జెట్ నుంచి కొన్నవి :
భారీ వాహనాలు – 10 – రూ. 3.90 కోట్లు
లైట్ వెహికల్స్ – 571 = రూ. 12.79 కోట్లు
బైక్‌లు – 2 – రూ. 1.06 లక్షలు


Next Story

Most Viewed