మనోడైతే చాలు.. విరమణ పొందినా సర్వీస్ పొడగింపు!

by  |
మనోడైతే చాలు.. విరమణ పొందినా సర్వీస్ పొడగింపు!
X

అయినవారికి ఆకుల్లో… కానివారికి కంచాల్లో అన్న చందంగా అధికారులకు నచ్చితే అందలం ఎక్కించుకుంటారు. లేదంటే కుదరదు పొమ్మంటారు. పదవీ విరమణ చేసినవారి సర్వీసు పొడిగింపు వద్దంటూ వివిధ శాఖలకు లేఖలు రాసే విభాగమే దాన్ని తుంగలో తొక్కింది. కేంద్ర సర్వీసుకు చెందిన ఓ అధికారి కొంతకాలంగా రాష్ట్రంలో పనిచేస్తూ ఫిబ్రవరి 28న పదవీ విరమణ పొందాడు. ఆయనకు ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ కేంద్రం మాత్రం అస్సలే కుదరదంటూ కరాఖండిగా చెప్పేసింది. పదవీ విరమణ చేయగానే మాతృ సంస్థకు పంపించాలని రాతపూర్వకంగా స్పష్టం చేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆ అధికారి మీద ఆర్థికశాఖ అధికారులకు ఎందుకంత ప్రేమ అన్నది ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఆ అధికారి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలియదుగానీ పదవీ విరమణ తర్వాత కూడా ఆయన సేవలను వినియోగించుకోవాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్‌లో సైంటిస్టు/ఇంజినీర్ (ఎస్‌జీ)గా పనిచేస్తున్న డాక్టర్ జి. శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని తెలంగాణ స్టేట్ రిమోట్ అప్లికేషన్ సెంటర్‌ (ట్రాక్)లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ మీద వచ్చిన ఆయన గతేడాది డిసెంబరు 31 వరకు ‘ట్రాక్’లో పనిచేయడానికి వీలుంది. ఆ తర్వాత కొనసాగాలంటే కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ విభాగం (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌)లో సైంటిస్ట్/ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి డిప్యూటేషన్ గడువు డిసెంబరుతో ముగిసింది.

ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ‘ట్రాక్’కు అదనపు డైరెక్టర్ జనరల్‌ హోదాలో పనిచేస్తున్నారు. డిప్యూ టేషన్ గడువు ముగిసిన వెంటనే ఆయనను ట్రాక్ ఉన్నతాధికారులు తిరిగి మాతృసంస్థకు పంపాలి. ఎలాగో మరో రెండు నెలల్లో (ఫిబ్రవరి 28వ తేదీన) ఆయన సర్వీసు కూడా పూర్తవుతున్నందున రిటైర్‌మెంట్ తర్వాత ఎక్స్‌టెన్షన్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు బెంగుళూరులోని అంతరిక్ష భవన్ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) డైరెక్టర్‌కు లేఖ (డీవో నెం. 179/అడ్మిన్/ట్రాక్) రాశారు. కానీ అంతరిక్ష భవన్‌లోని డిప్యూటీ సెక్రటరీ ఎం. రాందాస్ మాత్రం రిటైర్‌మెంట్ పూర్తి చేసుకున్నశ్రీనివాసరెడ్డికి ఎక్స్ టెన్షన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ (నెం. బి/18011/7/2007-3)లో స్పష్టం చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో సైంటిస్ట్/ఇంజనీర్ హోదాలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి తెలంగాణకు రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ టెక్నాలజీ అప్లికేషన్ సేవలకు నోడల్ ఏజెన్సీగా ఉన్న ‘ట్రాక్’లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నందున పదవీ విరమణ తర్వాత ఆయనను మాతృ సంస్థకు పంపించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

తెలంగాణ ‘ట్రాక్’ తన అవసరాలకు తగిన అర్హతలున్న అధికారులను ఎంపిక చేసుకుని ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని, శ్రీనివాసరెడ్డిని మాత్రం కొనసాగించడం కుదరదని పేర్కొన్నారు. నిజానికి పదవీ విరమణ చేసిన తర్వాత వారికి ఎక్స్‌టెన్షన్ ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం 2015లోనే నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయినవారిని కన్సల్టెంట్లుగానూ, అడ్వయిజర్లుగానూ, ఓఎస్డీలుగా తిరిగి నియమించడంగానీ, అవకాశాలు కల్పించడంగానీ కుదరదని, ప్రభుత్వం నిషేధం విధిస్తూ 2015 మే 2న నిర్ణయం తీసుకున్నదని ఆర్థిక శాఖ (ఫైనాన్స్ హెచ్ఆర్ఎం -1) పేర్కొంది. ఒకవేళ అలాంటి అపాయింట్‌మెంట్ల విషయంలో ఆయా శాఖలు తప్పనిసరి అవసరం అని భావించినట్లయితే విధిగా ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా మినహాయింపులు, అనుమతులు పొందాల్సి ఉంటుందని పేర్కొంది.

సాగునీటిపారుదల విభాగంలో ఇలాంటి అపాయింట్‌మెంట్ల విషయంలో ఇటీవల వచ్చిన ఒక విజ్ఞప్తికి స్పందించిన ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జనవరి 25న ఇదే విషయాన్ని (ఫైనాన్స్ యూఓ నెం. 917359/10/ఏ-1/హెచ్ఆర్ఎం-1/2021) స్పష్టం చేశారు. ఈ మేరకు సర్క్యులర్ (సీ నెం. 11683/ఎల్ఏ.ఏ-1/2020)లో పేర్కొన్నారు. పదవీ విరమణ చేసినవారిని నియమించుకోరాదని, ప్రభుత్వం నిషేధం విధించిందని అన్ని శాఖలకూ సర్యులర్ పంపిన ఆర్థిక శాఖ ‘ట్రాక్’ అదనపు డీజీ విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన శ్రీనివాసరెడ్డికి మూడేళ్ళ పాటు (డిసెంబరు 31, 2023) ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అన్ని శాఖలకూ సర్క్యులర్ పంపే ఆర్థిక శాఖ శ్రీనివాసరెడ్డికి మాత్రం ప్రత్యేక మినహాయింపు ఎందుకు కోరుతోంది, ముఖ్యమంత్రి నుంచి ఆ మేరకు అనుమతి తీసుకున్నదా అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Next Story

Most Viewed