నా దుస్తులను ముట్టుకోకండి.. అఫ్ఘాన్ మహిళల నిరసన.. ఫొటోస్ వైరల్

215

దిశ, ఫీచర్స్: తాలిబన్లు అఫ్ఘానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశంలో మహిళల రక్షణ ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ చట్టాల పేరుతో వారిపై కఠిన ఆంక్షలు మోపుతున్నారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా హిజాబ్ ధరించాలని, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు హాజరయ్యేవారు అబయా వస్త్రాన్ని ధరించి, నిఖాబ్‌తో ముఖాన్ని కప్పుకోవాలని ఆదేశించారు. అయితే తాలిబన్ల డ్రెస్ కోడ్ రూల్స్‌ను వ్యతిరేకిస్తున్న పలువురు అఫ్ఘాన్ మహిళలు.. అసలైన అఫ్ఘాన్ల వస్త్రధారణతో కూడిన ఫొటోగ్రాఫ్స్ పోస్టు చేస్తూ ఆన్‌లైన్ క్యాంపెయిన్ చేపట్టారు.

చాలామంది మహిళలు #DoNotTouchMyClothes, #AfghanistanCulture హ్యాష్‌ట్యాగ్స్‌ ఉపయోగించి అసలు సిసలు అఫ్ఘాన్ సంప్రదాయ దుస్తులు ధరించిన ఫొటోలను షేర్ చేస్తూ తమ సంస్కృతి, గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. నిత్యం నల్లని ముసుగులో కనిపించే అఫ్ఘాన్ మహిళల స్టీరియోటైపికల్ ఇమేజ్‌ను సవాలు చేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌కు మద్దతు పెరుగుతుండగా.. ట్రెడిషనల్ బ్లాక్ బుర్కాకు భిన్నంగా రంగురంగుల వేషధారణతో కూడిన ఫొటోలతో అఫ్ఘాన్ మహిళలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచారు. ఈ మేరకు ‘కలర్‌ఫుల్, బ్యూటిఫుల్‌గా ఉండే నా సంప్రదాయ అఫ్ఘాన్ దుస్తులను గర్వంగా ధరిస్తాను’ అంటూ ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేయగా.. ఈ నిరసన అందంగా ఉందని మరొక యూజర్ కామెంట్ చేసింది. ఈ అద్భుతమైన వేషధారణ తమ కల్చర్‌లోని బ్యూటీ, ప్రైడ్, ఆనందాన్ని తెలియజేస్తుందని.. ఇది సెలబ్రేట్ చేసుకోవల్సిన సమయమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇస్లామిక్ షరియా చట్టానికి కట్టుబడి మహిళలకు హక్కులు కల్పిస్తామని తాలిబాన్లు మొదట హామీ ఇచ్చినప్పటికీ, ఇటీవల జరిగిన అనేక సంఘటనలు అవన్నీ నిజం కావని సూచిస్తున్నాయి. కోఎడ్యుకేషన్‌ను నిషేధించడం నుంచి మహిళల్ని పనులకు, ఆటలకు అనుమతించకపోవడం వరకు అనేక తిరోగమన చట్టాలపై దేశంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే తాలిబాన్ ప్రతినిధి ఒకరు.. మహిళా క్రీడలు, ప్రత్యేకంగా మహిళల క్రికెట్‌ను దేశంలో నిషేధిస్తామని చెప్పారు. ఇస్లాం, ఇస్లామిక్ ఎమిరేట్.. బహిరంగ ప్రదేశాల్లో ఆడే క్రీడలకు మహిళలను అనుమతించదని పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..