ఇదేందిదీ.. మాకేం అర్థమవడంలేదు

by Chintha Aamani |

<p>దిశ, ఆదిలాబాద్: తినడానికి తిండిలేదు.. కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకడంలేదు.. ఇలాగే అయితే ఇక్కడే చచ్చేలా ఉన్నామని సొంతూర్లకు బయలుదేరారు. కానీ, వీళ్లందరినీ ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. మరోవైపు ఇలా వస్తున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకో మీరే చదవండి.. కరోనా కారణంగా వలసబాట పట్టిన వివిధ రాష్ట్రాల కూలీలు సరిహద్దుల్లో పోటెత్తడం కలకలం రేపుతున్నది. సుదూర ప్రాంతాల నుండి కాలినడకన వస్తున్న వందలాది మందిని రాష్ట్ర సరిహద్దుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో [&hellip;]</p>

దిశ, ఆదిలాబాద్: తినడానికి తిండిలేదు.. కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకడంలేదు.. ఇలాగే అయితే ఇక్కడే చచ్చేలా ఉన్నామని సొంతూర్లకు బయలుదేరారు. కానీ, వీళ్లందరినీ ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. మరోవైపు ఇలా వస్తున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకో మీరే చదవండి..

కరోనా కారణంగా వలసబాట పట్టిన వివిధ రాష్ట్రాల కూలీలు సరిహద్దుల్లో పోటెత్తడం కలకలం రేపుతున్నది. సుదూర ప్రాంతాల నుండి కాలినడకన వస్తున్న వందలాది మందిని రాష్ట్ర సరిహద్దుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో నిలిపివేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని తానూర్ మండలం బెల్తారోడ, బాసర మండలం బిడ్రెల్లి, సారంగాపూర్ మండలం సిర్పెల్లి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గొయగాంతోపాటు మరో రెండు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలిరోజుల్లో మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాల్లోకి జనం రాగా… ఇప్పుడు ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు పెద్దఎత్తున వలసలు మొదలయ్యాయి.

దయనీయం..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో వలస కూలీలు పెద్ద ఎత్తున బ్రతుకుతెరువు సాగిస్తున్నారు. మహారాష్ట్రతోపాటు రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా గృహ నిర్మాణ రంగ పనుల్లో ఈ కూలీలు పని చేస్తున్నారు. మార్బుల్ బండలు, ప్లైవుడ్ వర్క్, పీఓపీ, లప్పం, ఇంటీరియర్ పనుల్లో ఈ కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వారం రోజులు అక్కడ ఇక్కడ తలదాచుకున్న కూలీలకు క్రమంగా కూడు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఎక్కడ కూడా వారికి తినేందుకు తిండి, నిలువనీడ లేని పరిస్థితి తలెత్తింది. పనులు చేయించుకునేందుకు కూలీలను పిలిపించుకున్న మేస్త్రీలు, గృహ నిర్మాణ రంగ కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేయడంతో వలస కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది.

ఇక్కడ ఇలాగే ఉంటే ఆకలి చావులు తప్ప మరేం ఉండదని వలస కూలీలు ఇంటి బాట పట్టారు. రవాణా రంగం అన్ని కోణాల్లో మూసుకు పోవడంతో కొందరు ట్రాలీ బండ్లను మాట్లాడుకుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కాలినడకన స్వరాష్ట్రంలోకి వెళ్లే సాహసం చేస్తున్నారు. అయినప్పటికీ వలస కూలీలను రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో నిలిపివేస్తున్నారు. ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తున్నది. ఇక్కడ తిండి దొరక్క, సొంత రాష్ట్రాలకు వెళ్దామంటే వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు.

సవాలుగా మారింది..

కరోనా విలయతాండవం చేస్తున్న ఈ నేపథ్యంలో గుంపులు గుంపులుగా ఉండొద్దన్న లాక్ డౌన్ ఆదేశాల మేరకు వలస కూలీల సమస్య ఒక సవాలుగా మారింది. ఇది అధికార యంత్రాంగానికి కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వలస కూలీలు వందలకొద్దీ వస్తున్న నేపథ్యంలో వీరిని ఎక్కడ ఉంచాలన్నది ఇబ్బందిగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బాసరలోని ఒక సత్రంలో, ముధోల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో, తానూర్ మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో, నిర్మల్ లోని దివ్యా గార్డెన్స్ లో వలస కూలీలకు ఆశ్రయం కల్పించారు. సుమారు ఆరు వందలకు పైగా వలస కూలీలు వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యేదాకా వీరిని వదలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. వలస కూలీలు రోజు వందలకొద్దీ పోటెత్తడంతో వీరందరినీ ఎక్కడ ఉంచాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం కన్నా వలస కూలీల సంరక్షణ ఒక టాస్క్ లా మారిందని అధికారులు వాపోతున్నారు.

ఆశ్రయం కల్పిస్తున్నాం: కలెక్టర్

కరోనా నేపథ్యంలోఇతర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలను గుర్తించి వారికి ఆశ్రయం కల్పిస్తున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో కూలీలకు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వారికి అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు.

Tags: Adilabad, Migrant Workers, Asylum and Trouble Officers

Next Story