మరోసారి భగ్గుమన్న ఆదివాసీలు… ఇక ఉద్యమమే..!

by  |
మరోసారి భగ్గుమన్న ఆదివాసీలు… ఇక ఉద్యమమే..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదివాసుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. గత కొంత కాలంగా సద్దుమణిగిన ఈ వివాదం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీలో అగ్గి రాజేసేలా కనిపిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా తోపాటు ఆదిమ గిరిజన తెగలు విస్తరించి ఉన్న వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతాల లోను వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ తో చైతన్యపరిచే కార్యక్రమాలను తుడుం దెబ్బ రూపొందిస్తున్నది.

ప్రధాన డిమాండ్లు ఇవి…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఆదిమ గిరిజన తెగలు అన్నీ ఏకం అవుతున్నాయి. ఆదివాసుల ఆందోళనల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న తుడుందెబ్బ వీరిని ఏకం చేసేందుకు వేదికగా మారింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5,6 ప్రకారం ప్రాంతాల్లో ఆదివాసులు మినహా ఎవరికీ చోటు లేదు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన లంబాడీల కారణంగా తమకు పూర్తిగా అన్యాయం జరుగుతున్నదని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. 90 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు వలస లంబాడీలు ఎగరేసుకుపోయారని దీంతో అసలు ఏజెన్సీ ఆదివాసులకు న్యాయం జరగడం లేదన్నది తుడుందెబ్బ వాదనగా ఉంది.

అలాగే ఉద్యోగాలన్నీ ఆదివాసులకే దక్కాలన్న జీవో 3 రద్దు అంశం కూడా తమకు గొడ్డలిపెట్టుగా మారుతుందని ఆదిమ జాతులు ఆందోళన చెందుతున్నాయి. మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలో వలసలతో పాటు అనేక గిరిజనేతర వాళ్లు కూడా చేరి ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను నాన్ ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించారని, దీని కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దీన్ని కూడా సవరించి నాన్ ఏజెన్సీ గ్రామాలుగా ఉన్నవాటిని ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని… ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదిమ గిరిజన తెగలకు అటవీ హక్కు పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ డిమాండ్లపై ఆదివాసి సంఘాలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల సమాధానం లేకపోవడం కారణంగా ఆదివాసులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.

9న రాష్ట్ర బంద్ కు పిలుపు…

ఆదివాసుల దీర్ఘకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించి వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఐక్య ఆదివాసీ సంఘాలు, తుడుం దెబ్బ ఈ నెల 9న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావం మైదాన ప్రాంతాల్లో ఉండకపోయినా… ఏజెన్సీ ప్రాంతాలు విస్తరించి ఉన్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, వరంగల్ జిల్లా ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతాల్లో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు నడవకుండా, వ్యాపార సంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆదివాసీ సంఘాలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.రాష్ట్ర బందును పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్, గొడం గణేష్, నాయక్ పోడ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకగారి భూమయ్యలు పిలుపునిచ్చారు.

ఉద్యమం వెనక ఎంపీ, ఎమ్మెల్యే..?

కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆదివాసుల ఆందోళన మళ్లీ తెరకెక్కుతున్నది. ఆదివాసులను ఐక్యం చేయడం వెనుక ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. వీరిద్దరూ పూర్తిస్థాయిలో ఆదివాసి సంఘాలకు మద్దతు ఇవ్వడం పూర్తిగా సమంజసమేనని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Next Story