నిన్న బీఎస్పీ…. ఇవాళ టీఆర్‌ఎస్.. క్షణాల్లో కండువాలు మార్పు

by  |
నిన్న బీఎస్పీ…. ఇవాళ టీఆర్‌ఎస్.. క్షణాల్లో కండువాలు మార్పు
X

దిశ, భద్రాచలం: రాజకీయం రంగులు మారుతోంది. నాయకులు, కార్యకర్తలు క్షణాల్లో కండువాలు మార్చేస్తున్నారు. ఇవాళ ఒకపార్టీలో ఉంటే తెల్లారేసరికి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈలోగా ఏమైనా అడ్డంకులు ఎదురైతే ‘అయ్యో.. మేము పార్టీ మారలేదు. సొంతపార్టీలోనే కొనసాగుతున్నాం’ అని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు ఏ రోజున ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి వైఖరి ముఖ్యంగా మీడియాకి తలనొప్పిగా మారితే ప్రజలు సైతం అయోమయానికి గురౌతున్నారు. ఇటీవల దుమ్మగూడెం మండలంలో ఇలాంటి సంఘటనే జరిగింది. తామంతా టీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగి బీఎస్పీలో చేరినట్లుగా ఎర్రబోరు గ్రామ యువకులు నీలం రంగు కండువాలు వేసుకొని మీడియాకి న్యూస్ రిలీజ్ చేశారు.

ఏమైందో గానీ మరునాడు మళ్ళీ వాళ్ళే గులాబీ కండువాలు వేసుకొని తాము బీఎస్పీలో చేరామనేది అబద్దంమని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ మళ్ళీ ప్రెస్‌కి న్యూస్ రిలీజ్ చేశారు. ఈ ఒక్క ఊరిలోనే ఇలా కాదు. అనేకచోట్ల ఇదే పరిస్థితి. అందుకే నిలకడలేని తత్వం వలన అందరూ అయోమయానికి గురౌతున్నారనేది నిజం. ఈ క్షణాన మీరు ఏ పార్టీలో ఉన్నారని జంప్ జిలానీలను ప్రజలు అడగాల్సి వస్తోంది.

వాళ్ళు ఏం చేసినా ప్రజల కోసమేనట..!

పార్టీలు మారుతున్న నాయకులు లేదా కార్యకర్తలు చెప్పేది ఒక్కటే మాట. తాము ఏం చేసినా ప్రజలకు మేలు చేయడం కోసమే. ప్రజాసంక్షేమం, గ్రామాల అభివృద్ధే తమ లక్ష్యం. ఈ పార్టీలో ఉంటేనే ఆశించిన మేరకు ప్రజలకు అన్నివిధాలుగా మేలు చేయగలమని చెప్పడం గమనార్హం. రాజకీయ నాయకులుగా ప్రజలకు సేవచేయడానికి అధికార పక్షమైతే అన్ని రకాల లాభదాయకమని కొందరు, ప్రతిపక్ష పార్టీలే పవర్‌పుల్ అని మరికొందరు భావిస్తూ తమకు నచ్చిన పార్టీల్లోకి వలసలు పోతున్నారు. ఇది తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎవరి వ్యక్తిగతం వారి ఇష్టం. అలా పార్టీలు మారేవాళ్ళను ప్రజలు ఆదరిస్తారా? లేక తిరస్కరిస్తారా? అనేది వేరే విషయం. అయితే ఇక్కడ నాయకులు తమ వ్యక్తిగత స్వార్థపు ఆలోచనలను పార్టీ కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయమని ప్రజలపై రుద్దడం ముమ్మాటికి తప్పే అనేది రాజకీయ పరిశీలకుల భావన. నాయకుల స్వార్థపు ఎత్తుగడలను ప్రజలు నిరంతరం గమనిస్తుంటారనేది యదార్థం.

రోడ్లపై కుస్తీ… లోపాయికారి దోస్తీ

ఇక కొంతమంది నాయకుల వైఖరి గమ్మత్తుగా ఉంటుంది. చేతిలో జెండా పట్టుకొని రోడ్లపైకి వచ్చి ప్రత్యర్థి పార్టీల తీరుని, నాయకుల వైఖరిని వేలెత్తిచూపించి దుమ్మెత్తిపోస్తారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా అవసరమైతే రోడ్లపై కుస్తీ పడతారు.‌ తాము ప్రజల పక్షం, తమకు ప్రజలే సపోర్టు అన్నంతగా నమ్మిస్తారు.
ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండవవైపు చూస్తే సంపాదన ధ్యేయంగా నాయకుల నడుమ ఒడంబడికలు, ఆర్థిక లావాదేవీలు, పరస్పర సహకార రాజీధోరణులు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలను నీరుగార్చే ప్రయత్నాలు, మద్యం వ్యాపారం, ఇసుక ర్యాంపులు, కాంట్రాక్టు పనుల్లో పొత్తులు, జాయింట్ పైరవీలు రాజకీయ నాయకుల లోపాయికారీ దోస్తీకి నిలువెత్తు నిదర్శనాలు. ఇక్కడ ప్రజా సమస్యలు, పార్టీల అభివృద్ధి కంటే నాయకుల నడుమ అవగాహన, సంపాదనే ముఖ్యమనేది జగమెరిగిన సత్యం. ఇలాంటి తీరుని అనుక్షణం ప్రజలు గమనిస్తుంటారు.


Next Story

Most Viewed