గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ .. ప్రజలను వెంటాడుతున్న ప్రమాదాలు

by  |
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ .. ప్రజలను వెంటాడుతున్న ప్రమాదాలు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో గులాబ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ కారణంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు గ్రామాల్లో చెరువులు, వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. తాజాగా మాచారెడ్డి మండలం ఫరీద్ పేట పెద్ద వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో చిక్కుకుంది. దాంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే ట్రాక్టర్ తెప్పించి ట్రాక్టర్‌కు, ఆటోకు తాడు కట్టి ఆటోను సురక్షితంగా బయటకు లాగారు. దాంతో పెను ప్రమాదం తప్పింది.

అలాగే సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో గల పెద్దవాగులో ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కామారెడ్డి నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం వైపుకు భవన నిర్మాణ పనుల కొరకు సెంట్రింగ్ చెక్కలతో వెళ్తున్న టాటా సుమో వాహనం పెద్ద వాగులో చిక్కుకుంది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. అక్కడున్న స్థానికులు గమనించి వాహనాన్ని రక్షించేందుకు ట్రాక్టర్ ను రప్పించి తాడు సాయంతో టాటా సుమోను బయటకు తీశారు. సుమారు గంట సేపు టాటా సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణీకులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నరకయాతన అనుభవించారు.

స్థానికులు ఒడ్డుకు చేర్చడంతో ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ చెరువు అలుగు పారడంతో ఆ అలుగు ప్రవాహంలో గ్రామానికి చెందిన పందిరి భగవాన్ రెడ్డి అనే వ్యక్తి వాహనం ఇరుక్కుపోయింది. అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రవాహంలో భగవాన్ రెడ్డి కొట్టుకుపోయాడు. గ్రామస్తులు అప్రమత్తమై గజ ఈతగాళ్లతో వేతకగా భగవాన్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. గులాబ్ తుఫాన్ ప్రభావం జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed