75ఏళ్లు దాటిన వృక్షాలకు పెన్షన్

by  |
75ఏళ్లు దాటిన వృక్షాలకు పెన్షన్
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్19 సెకండ్ వేవ్ నేపథ్యంలో, మనదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కొవిడ్ -19 రోగులకు అవసరమైన వైద్య ఆక్సిజన్ సంక్షోభాన్ని చూశాయి. అయితే భవిష్యత్తులో ఈ లోటును
తీర్చడానికి హర్యానా ప్రభుత్వం ‘ప్రాన్ వాయు దేవతా పెన్షన్ పథకం(పివిడిపిఎస్)’, ‘ఆక్సి వన్ (ఆక్సిజన్ అడవులు)’ అనే రెండు కొత్త ప్రాజెక్ట్‌లతో ముందుకు వచ్చింది. మరి ఈ రెండు ప్రాజెక్ట్‌ల ఉద్దేశం ఏమిటి? ప్రాధాన్యమెంత?

మనదేశంలో 60ఏళ్లు పైబడిన వృద్ధులకు పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అలానే 75 సంవత్సరాలు లేదా అంతకంటే పాత చెట్ల నిర్వహణ కోసం, పివిడిపిఎస్ పేరిట సంవత్సరానికి 2,500 రూపాయల పెన్షన్ అందించనుండటం విశేషం. రాష్ట్రంలో వృద్ధాప్య సమ్మన్ పెన్షన్ పథకం మాదిరిగానే ఈ ‘ట్రీ పెన్షన్’ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ప్రాణవాయువును ఉత్పత్తి, కాలుష్యాన్ని తగ్గించడం, నీడను అందిస్తూ జీవితాంతం మానవాళికి నిస్వార్థ సేవ చేసిన 75 సంవత్సరాల, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లన్నింటినీ గౌరవించటానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘ప్రాన్ వాయు దేవతా పెన్షన్ పథకం’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

రాష్ట్రమంతటా ఇటువంటి చెట్లను గుర్తించి, స్థానిక ప్రజలను లేదా గ్రామ పంచాయతీలను పథకంలో భాగం చేయడం ద్వారా, వీటిని టేక్ కేర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం, ఇప్పటివరకు కనీసం 2,500 చెట్లను గుర్తించారు. ఈ పాత చెట్లను గుర్తించడానికి అటవీ శాఖ ఒక సర్వేను చేపట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వాటి పెంపకం కోసం చెట్టుకు 2,500 రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీలకు ‘పెన్షన్’ గా అందిస్తారు.

ఆక్సివన్ :

ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రమంతటా అడవులు పెంచడానికి కొంత భూమిని సేకరించి 3 కోట్ల చెట్లు, 8 లక్షల హెక్టార్ల భూమిలో 10శాతం ఆక్సి ఫారెస్ట్‌లు ప్రారంభించనున్నారు. అందులో చిట్ వన్ (ఫారెస్ట్ ఆఫ్ బ్యూటీ), పాఖి వన్ (పక్షుల అటవీ), ఆంత్రిక్ష్ వన్ (రాశిచక్ర చిహ్నాల అటవీ), తపో వన్ (ధ్యాన అటవీ), ఆరోగ్య వన్ (హీలింగ్ / హెర్బల్ ఫారెస్ట్), నీర్ వన్ (ఫారెస్ట్ ఆఫ్ వాటర్ ఫాల్స్), రిషి వన్ (సప్త్ రిషి), పంచవటి (ఐదు చెట్లు), స్మరన్ వన్ (జ్ఞాపకాల అటవీ), సుగంధ్ సువాస్ / సుగంధ్ వన్ (సువాసన అటవీ) లను సృష్టించనున్నారు.

‘పట్టణ ప్రాంతాల్లో వాహన, పారిశ్రామిక కాలుష్యం ఫలితంగా గాలి నాణ్యత బాగా పడిపోయింది. అంతేకాదు ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. నగరాలు, పట్టణాల్లో వేడి ప్రభావాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికే ఈ ప్రాజెక్ట్స్. ఆక్సి ఉద్యానవనాల్లో సమాచార కేంద్రం, ఓ స్మారక దుకాణం కూడా ఉంటుంది. ప్రజలు తమ ఇంటి స్థలంలో పెంచుకోవడానికి రాశి (రాశిచక్రం)కి సంబంధించిన మొక్కలను సబ్సిడీ ధరలకు కొనుగోలు చేయొచ్చు. వీటితోపాటు వినోదాన్ని అందించేందుకు యాంఫిథియేటర్ నిర్మిస్తున్నాం. ఈ ఆక్సి వన్ వివిధ అంశాలను కవర్ చేస్తూ లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది. ‘ప్రాణ వాయు’కి ప్రత్యామ్నాయం లేనందున ఈ అడవికి ఆక్సి ఫారెస్ట్ అని పేరు పెట్టాం’
– హర్యానా ప్రభుత్వం


Next Story

Most Viewed