ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి ఆత్మహత్య

by  |
ఘట్‌కేసర్‌లో కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఘట్‌కేసర్ కిడ్నాప్ కేసులో పోలీసులను తప్పదోవ పట్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షుగర్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నెల 10వ తేదీన కాలేజీకి వెళ్లిన యువతి, తిరుగు ప్రయాణంలో తనను కిడ్నాప్ చేసినట్లు తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో తల్లి 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసు బృందాలు అప్రమత్తమయ్యాయి. బాధితురాలి సిగ్నళ్ల ఆధారంగా ఆమె ఘట్ కేసర్‌కు సమీపంలోనే ఉన్నట్లు గుర్తించారు. రహదారి వెంట సైరన్ చేస్తూ పోలీసుల వాహనాలు దూసుకొచ్చాయి. ‘ఆటోలో అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరైనా చూస్తే సమాచారం ఇవ్వండి’ అంటూ మైకుల్లో ప్రకటన చేశారు. బాధితురాలి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఉన్న లోకేషన్‌కు చేరుకొని ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.

నిందితులు తనను ఘట్కేసర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారని బాధితురాలు ఆరోపించింది. మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. 100 మంది పోలీసులతో టీమ్‌లు ఏర్పాటు చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి ఆధారాలు సేకరించారు..

కానీ, పోలీసులు సేకరించిన ఆధారాలకు, బాధితురాలు చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉన్నాయి. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా బాధితురాలు రాంపల్లి చౌరస్తా నుంచి కాలినడకన సుమారు 4 కి.మీ. దూరం ఘట్కేసర్ వైపు వచ్చినట్లు తేలింది. ఆమెను ఆ విషయమై ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. ఆ వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బాధితురాలు ఇంట్లో నుంచి పారిపోవాలని భావించింది. ఆ రోజు సాయంత్రం స్నేహితుడితో కలిసి ఘట్కేసర్ వైపు వచ్చేసింది. తల్లికి ఫోన్ చేసి కిడ్నాప్ చేశారని తప్పుడు సమాచారం ఇచ్చింది. పోలీసులు వేగంగా రియాక్ట్ అవడంతో తాను చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి రక్తి కట్టించింది. పోలీసులు వచ్చేసరికి రోడ్డు పక్కన కాస్త విదారకంగా పడి ఉంది. నాటకం రక్తి కట్టించడానికి తన ప్యాంట్ కూడా తొలగించుకుందని పోలీసులు తెలిపారు. అయితే బుధవారం ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed