అర్థరాత్రి పెళ్లి బరాత్.. బ్యాండ్ యజమాని మృతి.. అసలేం జరిగింది..?

by Vadlamudi Anukaran |

<p>దిశ, శేరిలింగంపల్లి : పెళ్లి బరాత్‌కు వచ్చిన బ్యాండ్ యజమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే పోలీసులు కొట్టడం వల్లే సదరు యువకుడు మృతి చెందినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా, అనారోగ్య సమస్యల వల్లనే చనిపోయాడంటున్నారు పోలీసులు. వివాదాస్పదంగా మారిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పీజేఆర్ నగర్‌లో శుక్రవారం రాత్రి వడ్ల వీరేశం పెళ్లి బరాత్‌ జరిగింది. [&hellip;]</p>

అర్థరాత్రి పెళ్లి బరాత్.. బ్యాండ్ యజమాని మృతి.. అసలేం జరిగింది..?
X

దిశ, శేరిలింగంపల్లి : పెళ్లి బరాత్‌కు వచ్చిన బ్యాండ్ యజమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే పోలీసులు కొట్టడం వల్లే సదరు యువకుడు మృతి చెందినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా, అనారోగ్య సమస్యల వల్లనే చనిపోయాడంటున్నారు పోలీసులు. వివాదాస్పదంగా మారిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పీజేఆర్ నగర్‌లో శుక్రవారం రాత్రి వడ్ల వీరేశం పెళ్లి బరాత్‌ జరిగింది. ఈ బరాత్‌లో సికింద్రాబాద్‌కు చెందిన సరస్వతీ బ్యాండ్ నిర్వాహకుడు నరేష్ ( 29) తన టీంతో కలిసి బ్యాండ్ వాయించేందుకు వచ్చాడు. అయితే రాత్రి 11 గంటలు దాటినా బ్యాండ్ మేళంతో డిస్టర్బ్‌గా ఉందని స్థానికులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లి బరాత్ వద్దకు చేరుకున్న రాయదుర్గం పోలీసులు బ్యాండ్ మేళాన్ని ఆపేయించారు.

అయితే 12.19 గంటలకు మరోసారి అదే రకంగా 100 నెంబర్ కు కాల్ రావడంతో, సైరన్ మోగిస్తూ పెళ్లి బరాత్ దగ్గరకు పోలీసులు వెళ్లారు. ఇది గమనించిన బ్యాండ్ మేళం వారు హడావుడిగా అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గుండప్ప అనే యువకుడు టాటా ఏసీ వాహనాన్ని నడిపే ప్రయత్నంలో ముందున్న వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో గుండప్పతో పాటు సంతోష్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా బ్యాండ్ సామాగ్రి సైతం దెబ్బతింది. ఈ ఘటన నేపథ్యంలో సరస్వతి బ్యాండ్ యజమాని నరేష్ తీవ్ర ఒత్తిడికి గురై కిందపడి పోయాడు. అంతేకాకుండా ఆటో రాడ్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని పోలీసులు ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

పోలీసులు కొట్టడంతోనే చనిపోయాడు: కుటుంబ సభ్యులు

పోలీసులు కొట్టడంతోనే నరేష్ మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు బరాత్ ను నిలిపివేయాలంటూ బ్యాండ్ మేళం వారిని కొట్టడం, యజమాని నరేష్ ను గట్టిగా తోయడంతో నరేష్ కింద పడ్డారని, తలకు బలమైన గాయమై మృతిచెందాడని చెబుతున్నారు. పోలీసుల దెబ్బల వల్లనే చనిపోయాడని, తెలుగు రాయడం, చదవడం రాని బ్యాండ్ సిబ్బందితో తెలుగులో ఫిర్యాదు రాయించుకొని కేసును కావాలనే పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తాము చెప్పిందే చెప్పాలంటూ బ్యాండ్ సిబ్బందిని భయపెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

మృతి ఘటనపై మాదాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ

నరేష్ మృతి ఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బ్యాండ్ యజమాని నరేష్ గుండెపోటుతో మృతిచెందాడని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా ఓ అంచనాకు వచ్చామన్నారు. దీంతో పాటు పూర్తి మెడికల్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ఘటనపై మాదాపూర్ ఏసీపీ రఘునందన్ ఆధ్వర్యంలో విచారణ చేపడతామని, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story