అమానుష ఘటన.. ఆ బాలిక ఇక లేదు

9

దిశ, పాలేరు: ఖమ్మం నగరంలో అమానుషానికి గురైన పదమూడేళ్ల బాలిక మోతె నర్సమ్మ మరణించింది. ఈ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడి, పెట్రోల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం… ఖమ్మంలోని పార్శీబంధంలో నివసించే అల్లం సుబ్బారావు ఇంట్లో మోతె నర్సమ్మ(13) అనే బాలిక పనిచేస్తోంది. గత నెల 19వ తేదీన ఉదయం 6 గంటల సమయంలో నర్సమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించి, సుబ్బారావు కుమారుడు అల్లం మారయ్య(25) ఆమెను బలాత్కరించే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె నిరాకరించింది.

దీంతో బాలికను చంపాలనే ఉద్ధేశంతో ఆమెపై పెట్రోల్ పోసిన మారయ్య నిప్పంటించి తగులబెట్టాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తండ్రి ఉప్పలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారయ్యపై కేసు నమోదు చేశారు. దీంతో వెంటనే మారయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తీవ్రంగా గాయపడిన నర్సమ్మను ఖమ్మం నగరంలోని పూజ ఆస్పత్రి చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. గత వారం రోజులుగా అక్కడ చికిత్స పొందుతున్న నర్సమ్మ ఆరోగ్యం విషమించి శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది.