మా సేటు పైసలు తీసుకొని వస్తడు.. మనం కొట్టెద్దాం.. పక్కా ప్లాన్.. కానీ చివరికి

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-30 08:10:09  IST  )

<p>దిశ, కోదాడ : ఈజీ మనీకి అలవాటు పడి తన యజమాని డబ్బులు తన స్నేహితులతో కలిసి దొంగతనం చేశాడో వ్యక్తి. కానీ చివరికి సీన్ రివర్స్ అవడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన పశువుల వ్యాపారి మహమ్మద్ జమాల్ వద్ద మహమ్మద్ సల్మాన్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జమాల్ ప్రతి వారం కోదాడ సంతకు వచ్చే [&hellip;]</p>

మా సేటు పైసలు తీసుకొని వస్తడు.. మనం కొట్టెద్దాం.. పక్కా ప్లాన్.. కానీ చివరికి
X

దిశ, కోదాడ : ఈజీ మనీకి అలవాటు పడి తన యజమాని డబ్బులు తన స్నేహితులతో కలిసి దొంగతనం చేశాడో వ్యక్తి. కానీ చివరికి సీన్ రివర్స్ అవడంతో కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ రఘు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన పశువుల వ్యాపారి మహమ్మద్ జమాల్ వద్ద మహమ్మద్ సల్మాన్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జమాల్ ప్రతి వారం కోదాడ సంతకు వచ్చే సమయంలో లక్షల రూపాయలు తీసుకురావడాన్ని సల్మాన్ గమనించాడు. జమాల్ వద్ద ఉన్న డబ్బును దొంగతనం చేసేందుకు డ్రైవర్లుగా పనిచేస్తున్న తన స్నేహితులైన భగిది విక్కీ అలియాస్ వికాస్, కాలే రాజు, హమాలీ పనిచేస్తున్న కే రాజు లతో కలిసి పథకం పన్నాడు. జమాల్ పై గతంలో రెండు సార్లు తిరుపతి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి డబ్బులు, పశువులు దొంగతనం చేశారు. అయితే ఆ సంఘటనపై జమాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఇది గమనించిన సల్మాన్ అదే తరహాలో మరోసారి దోపిడీ చేసేందుకు ప్లాన్ చేశాడు. దీంతో ఈ నెల 20వ తేదీన జమాల్ కోదాడ పశువుల సంతకి వస్తున్న విషయాన్ని సల్మాన్ ముందుగానే తన మిత్రులకు చేరవేశాడు. దీంతో వారు మరో కారులో జమాల్‌ను వెంబడించారు.

కారు కోదాడ బైపాస్ రోడ్డులోని సర్వీస్ రోడ్డు చేరుకోగానే తమ కారు అడ్డుగా పెట్టి, మాస్కులు వేసుకొని జమాల్‌ను కత్తులతో బెదిరించారు. అయితే జమాల్ వారి మాట వినకపోవడంతో హుజూర్‌ నగర్ రోడ్ లోని నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్లి అతని చేతిని గాయపరిచారు. జమాల్ తనవద్దనున్న మూడు లక్షల రూపాయల నగదు వారికి ఇచ్చాడు. నగదుతో పాటు జమాల్, సల్మాన్‌ల సెల్ ఫోన్లు గుంజుకుని నిందితులు కారులో పారిపోయారు. ఈ సంఘటన పై జమాల్ కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో కోదాడ సీఐ నరసింహ రావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనలో జమాల్ కార్ డ్రైవర్ సల్మాన్ అమాయకత్వంగా నటించడాన్ని గమనించిన పోలీసులు అతడిని కూడా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.

ఆదివారం ఈ సంఘటనపై కోదాడ పశువుల సంతలో అనుమానితులను విచారిస్తుండగా, అదే సమయంలో ఈ ముఠా మరోసారి దోపిడికి పాల్పడేందుకు వచ్చారు. వారిని జమాల్ గుర్తించడంతో పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారు మూడు లక్షల రూపాయలను వాటాలు వేసుకున్న తరువాత 14 వేల రూపాయలను ఖర్చు చేశారు. వారివద్ద నుండి 2.86 లక్షల నగదు, సెల్ ఫోన్లు, మంకీ క్యాప్‌ లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారంలో కీలకంగా వ్యవహరించిన కోదాడ పట్టణ సీఐ నర్సింహా రావు, ఎస్ఐ రాంబాబు, ట్రాఫిక్ ఎస్ఐ క్రాంతి కుమార్, లతోపాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ రఘు ను అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ నరసింహారావు పాల్గొన్నారు.

Next Story