‘కార్పొరేట్’ దందా!​ కరోనా వేళ కాలేజీల దోపిడీ!

by  |
‘కార్పొరేట్’ దందా!​ కరోనా వేళ కాలేజీల దోపిడీ!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగర పరిధి ఆర్మూర్ రోడ్డు లోని ఓ కార్పొరేట్ కళాశాల ప్రాంతీయ కార్యాలయం కేంద్రంగా నాలుగు శాఖలను నడుపుతోంది. సదరు ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోంది. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, నెలాఖరులోగా డబ్బులు చెల్లిస్తామన్నా కనికరించడం లేదు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వ ప్రకటన విని కళాశాలకు బయలుదేరిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురవుతోంది. మొత్తం ఫీజులో సగం కడితేనే కాలేజీలోకి ఎంట్రీ ఉంటుందని, లేదంటే బయటకు వెళ్లిపోండని దబాయిస్తుండడంతో వారు భిక్కమొహంతో వెనుదిరుగుతున్నారు.

నిజామాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాల కరికులమ్​ను అమలు చేసి విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తోంది. పాత బకాయిలు మొత్తం క్లియర్​చేయాలని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. హాస్టల్ ఫీజుతో పాటు రెగ్యూలర్ తరగతులకు సంబంధించి ఫీజు మొత్తం వసూలు చేస్తోంది. ఏప్రిల్ 7 నుంచి జరిగే ప్రాక్టికల్స్ కు, మే 1 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజులను కట్టనిచ్చేది లేదని మొండికేసింది. కామారెడ్డి, బోధన్​పట్టణంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమదైన శైలిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. దానికి తోడు పరీక్షల ఫీజులను పెంచి దోపిడీకి దిగుతున్నాయనే ఆరోపణలున్నాయి.

నీట్, జేఈఈ అడ్వాన్స్, ఐఐటీలో సీట్ గ్యారంటీ పేరుతో జిల్లా కేంద్రంలో శాఖోపశాఖలుగా విస్తరించిన కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులకు చుక్కలు చూపుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడు నెలలు ఆన్​లైన్​క్లాసులు జరుగగా, ఈ నెల ఒకటి నుంచి కళాశాలలు తెరిచారు. ఈ క్రమంలోనే ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజులు కట్టాల్సిందేనని ఒత్తిళ్లు పెంచుతున్నాయి. కరోనా కాలంలో ఉద్యోగులను తీసేయకుండా వారితోనే ఆన్ లైన్ తరగతులు నిర్వహించామని, ఇప్పుడు మొత్తం ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం కళాశాలలో చేరేందుకు వచ్చిన నాన్ బోర్డర్ విద్యార్థులు వంద శాతం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం వివాదానికి దారి తీసింది. నిజామాబాద్ నగరంలోని మరో కార్పొరేట్ కళాశాల కూడా ఫీజులను చెల్లించాలని స్పష్టం చేయడంతో ప్రస్తుతం కళాశాలలకు విద్యార్థుల తల్లిదండ్రుల తాకిడి పెరిగింది.

ఒక్క సీటు రాలే..!

ఉమ్మడి జిల్లాలో మొత్తం 163 ఇంటర్ ​కళాశాలలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 46, కామారెడ్డి జిల్లాలో 28 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. కానీ ఒక్క కళాశాల విద్యార్థికి ఇప్పటి వరకు నీట్, జేఈఈ అడ్వాన్స్ లో సీటు వచ్చిన దాఖలాలు లేవు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ కళాశాలలు తమ సొంత ప్రయోజనాలు, పబ్లిసిటీ, ర్యాంకుల కోసం విద్యార్థులను బట్టీపట్టి చదివేలా తయారు చేస్తున్నా ఇంటర్​బోర్డు అధికారులు చర్యలు తీసుకోక పోవడంపై విమర్శలు ఉన్నాయి.

–పరీక్ష ఫీజుల పేరిట అదనపు దోపిడీ..

ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్​కళాశాలలో పరీక్ష ఫీజు పేరిట దోపిడీ షురువైంది. ఆర్ట్ అండ్ సైన్స్ విద్యార్థులకు రూ.480 సాధారణ పరీక్ష ఫీజు కాగా ప్రాక్టికల్స్​కు హాజరయ్యే వారు రూ.670 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఆ ఆదేశాలను కళాశాలలు తుంగలోకి తొక్కాయి. రెట్టింపు ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంటర్​అధికారులు దృష్టి సారించకపోవడంపై పలు అనుమానాలున్నాయి.

–50 శాతం వసూలు ఒట్టిమాటే..

లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్ క్లాసులు జరుగడంతో 50 శాతం ఫీజు తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. జనవరి 31 వరకు ఆన్ లైన్ తరగతులు జరుగగా, ఆఫ్ లైన్ లో ఏప్రిల్ 7వ తేదీ వరకు క్లాసులు జరుగనున్నాయి. అప్పటి వరకు జరిగే విద్యా సంవత్సరం కాల పరిమితిని పరిగణలోకి తీసుకుని 60 రోజులకు గాను ట్యూషన్ ఫీజు సగం మాత్రమే వసూలు చేయాలని నిబంధన జారీ చేసింది. కానీ, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాలల నిర్వాహణపై సమావేశాలు నిర్వహించిన ఇంటర్​బోర్డు అధికారులు ఫీజుల వసూళ్ల విషయంలో జరుగుతున్న దోపిడీని పట్టించుకోలేదు. దాంతో వారు ఇష్టారీతిన వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


Next Story

Most Viewed