వీడియో వైరల్.. బాలుడి ఫేట్ మార్చిన బీజేపీ నేతలు

by  |
వీడియో వైరల్.. బాలుడి ఫేట్ మార్చిన బీజేపీ నేతలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అనుకోకుండా వచ్చిన అవకాశాలు కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతాయి. అదే కోవలోకి వచ్చాడు ఓ తొమ్మిదేళ్ల బాలుడు. బీజేపీ బహిరంగ సభకు మాసిన బట్టలు, చేతిలో చెత్తను ఎరుకునే సంచితో వచ్చిన ఆ బాలుడిలో ఉన్న ఎక్స్ ప్రెషన్స్ చూసి కమలం పెద్దలు ఫిదా అయిపోయారు. అంతే ఆ బాలుడిని పిలిపించి సపర్యలు చేసి చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు.

అసలేం జరిగింది..

బాన్సువాడలో గురువారం బీజేపీ బహిరంగ సభ జరిగింది. తొమ్మిదేళ్ల నర్సింహా తన తండ్రితో చిత్తు కాగితాలు ఏరుకుంటూ సభా ప్రాంగణానికి వచ్చాడు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నంత సేపు నర్సింహ ఒక చేతిలో సంచి పట్టుకునే మరో చేతితో బీజేపీ నేతలు చేస్తున్న ప్రసంగానికి తన హావభావాలను పలికించాడు. అంతేకాదు వారి మాటలకు శ్రుతి కలిపాడు. నేతల ప్రసంగానికి పళ్లు కొరుకుతూ, తొడ కొడుతూ.. ఊగిపోయాడు. అక్కడున్న వారు ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా విపరీతంగా వైరల్ అయింది. అది చూసిన బీజేపీ పెద్దలు ఆ బాలుడి ఎక్స్ ప్రెషన్స్‌కు ఫిదా అయ్యారు. ఆ బాలుడిని శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు, కొత్త బట్టలు కొనిచ్చాడు. 2వ తరగతి చదివి మానేశాడని గుర్తించి స్కూల్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు నర్సింహ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తానని బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్యాద్రి రెడ్డి బాలుడి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed