రూ.700తో 1,500 కి.మీ ప్రయాణం.. ఎలాగో తెలుసా?

by  |
రూ.700తో 1,500 కి.మీ ప్రయాణం.. ఎలాగో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ వెహికల్స్(ఈవీ)దేనని మార్కెటింగ్ విశ్లేషకులు చెబుతున్న మాట. పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు, కాలుష్య స్థాయికి చెక్ పెట్టేందుకు ఈ వెహికల్స్ ది బెటర్ అప్షన్. వీటితో ఇంధన ఖర్చు కూడా తక్కువే. జైపూర్ ఇంజినీర్ ఆకాశ్ 1,500 కిలోమీటర్ల రోడ్ ట్రిప్‌ అందుకు చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. లీటర్‌కు సగటున 15 కి.మీ ఇచ్చే ఐసీ ఇంజిన్ వెహికల్‌లో వెళితే, పెట్రోల్‌కే దాదాపు రూ.9 వేలుఖర్చయ్యేవి. కానీ, ఆకాశ్ రూ.700లతో ట్రిప్ ముగించాడు. ఆ జర్నీ విశేషాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆకాశ్, తన స్నేహితులతో కలిసి జైపూర్ నుంచి లోనెవాలా (ఇండో పాక్ బార్డర్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేశాడు. చివరి నిమిషంలో తన ఫ్రెండ్స్ ట్రిప్‌ క్యాన్సిల్ చేసుకోవడంతో ఆకాశ్ తన భార్యతో కలిసి జైపూర్, పుష్కర్, జోధ్‌పూర్, జైసల్మేర్ మీదుగా లోనెవాలాకు తన టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో బయలుదేరాడు. ట్రిప్‌కు ముందురోజు తన వెహికల్‌ను రాత్రంతా చార్జ్ చేశాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ప్రయాణిస్తున్న కిలోమీటర్ల బట్టి మిగిలి ఉన్న బ్యాటరీ ఎనర్జీని డిస్ ప్లే చేస్తాయి. కాగా, ఎన్ని కిలోమీటర్లకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలుసుకోవడానికి ఓ కేబుల్ తయారు చేసి, దాన్ని విద్యుత్ మీటర్ (ఎలక్ట్రోమీటర్)‌తో జతచేశాడు ఆకాశ్. దీని సాయంతో ఆ కారు వినియోగించే విద్యుత్ కొలవవచ్చు. ఎక్కడ వీలైతే అక్కడ..హెటల్స్ లేదా దాబాల్లో చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఎర్తింగ్ కిట్‌ను కూడా రూపొందించాడు.

‘ఈవీని చార్జ్ చేయడానికి ప్రతి 200 కిలోమీటర్లకు చేరువలో ఉన్న హోటల్, స్నేహితుడి ఇల్లు లేదా విద్యుత్తు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో బస చేశాం. ఆగిన ప్రతి ప్రదేశంలో మా కారును 10 నుంచి 11 గంటల వరకు చార్జ్ చేశాం. బ్యాటరీ చార్జింగ్ 15 శాతానికి వస్తే, పూర్తి చార్జ్ కోసం 8 గంటలు పడుతుంది. ఇక ఈవీలో వెళ్లేటప్పుడు ఎక్కడా చార్జింగ్ చేసే సదుపాయం లేకపోతే పునరుత్పాదక చార్జింగ్ (రెజెన్) లేదా టో చార్జింగ్ ద్వారా ఈవీని చార్జ్ చేయాలి. ఇందుకోసం ఓ తాడును వెంట తీసుకెళ్లాలి. కారు లాగడానికి మరో కారు సాయం తీసుకుంటే..వాహనం లాగిన ప్రతి 1 కిలోమీటర్‌కి, సుమారు 1.1% చార్జ్ అవుతుంది. అంటే 5 కిలోమీటర్ల వరకు వాహనాన్ని లాగితే, 6% బ్యాటరీ చార్జ్ పొందొచ్చు. కారు 1% చార్జ్ అయితే 2.5 కిమీ వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. అంటే వాహనాన్ని 5 కిలోమీటర్లు లాగితే, సుమారు 15 కిలోమీటర్ల దూరం జర్నీ చేయొచ్చు. ఇక ఫుల్ చార్జ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్‌లో గంటకు 80 కిలోమీటర్లు వేగంతో వెళితే, 200-220 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అదే గంటకు 40 కిలోమీటర్లు వేగంతో వెళితే, 300 కి.మీ ప్రయాణించొచ్చు. వేగం పెరిగిన కొద్దీ బ్యాటరీలో చార్జింగ్ తక్కువైపోతోంది’ అని ఆకాశ్ తెలిపారు.

పెట్రోల్ వాహనంలో వెళితే తప్పనిసరిగా 100 లీటర్ల పెట్రోల్ అవసరమయ్యేది. అందుకోసం లీటర్‌కు రూ.90 అనుకున్న రూ.9వేలు అవుతాయి. అదే ఆకాశ్ ఈవీలో 1,500 కిలోమీటర్లు ప్రయాణించడానికి సుమారు 200 యూనిట్ల విద్యుత్ ఖర్చు చేశాడు, అంటే యూనిట్‌కు రూ .7 అనుకున్నా సుమారు 1,400 రూపాయల ఖర్చు అవుతుంది. అయితే ఆకాశ్ తన కారును చార్జ్ చేసిన చాలా ప్రదేశాల్లో ఆయా యజమానులు విద్యుత్ కోసం ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఆ లెక్కన ఆకాశ్‌కు ఇంధన ఖర్చులు నిమిత్తం రూ. 700 నుంచి 800 వరకు మాత్రమే ఖర్చయ్యాయి. ఎర్తింగ్ రాకుండా ఎలక్ట్రిక్ వెహికల్‌ను సురక్షితంగా చార్జ్ చేయడం అన్నింటికన్నా ప్రధానం. ప్రతి చోటా ఎర్తింగ్ ఉండదు. దాంతో యాత్ర పూర్తి చేసిన తర్వాత ‘ఈవీ ట్రావెల్ చార్జింగ్ కిట్‌’ను ఆకాశ్ అభివృద్ధి చేశాడు. ఇందులో ఎనర్జీ మీటర్‌తో పాటు ఎక్స్‌టెన్షన్ కేబుల్, ఇండికేటర్, ఐరన్ రాడ్, కాపర్ ప్లేట్, ఎర్తింగ్ కిట్ ఇతర పరికరాలు ఉన్నాయి. లాంగ్ రోడ్ ట్రిప్స్‌లో ఈవీ కిట్ తప్పకుండా అవసరమవుతుంది. దీని ధర సుమారు రూ.9,878 . ఈ ప్రొడక్ట్ ఆహా3డి (Aha3D)వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.


Next Story

Most Viewed