Depression : స్త్రీలు డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్తారు? సైకోథెరపిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..!

by Bhoopathi Nagaiah |

కొంతమంది స్త్రీలు నిరాశాపూరిత నిస్సహాయ స్థితిలో డిప్రెషన్‌కి గురవుతారు. గదిలోపల్నించి కేకలు, ఏడ్పులు వినిపిస్తాయి.

Depression : స్త్రీలు డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్తారు? సైకోథెరపిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..!
X

కొంతమంది స్త్రీలు నిరాశాపూరిత నిస్సహాయ స్థితిలో డిప్రెషన్‌కి గురవుతారు. గదిలోపల్నించి కేకలు, ఏడ్పులు వినిపిస్తాయి. జయమ్మ నిస్సహాయంగా గది బయట నిలబడి గుడ్ల నీరు కక్కుకుంటోంది. ఆ కేకలు జయమ్మ కూతురు విజయవి, విజయ భర్త రఘు ఆమెని బెల్ట్‌తో కొడుతున్నాడు. విజయ కేకలు ఉధృతం అయ్యాయి. అమ్మా! అంటూ కేకేసింది విజయ. జయమ్మ భరించలేక తలుపు బాదసాగింది. విసురుగా తలుపు తెరిచాడు రఘు. చేతిలోని బెల్ట్ క్రిందికి విసిరేసి బయటకు వెళ్లిపోయాడు. దెబ్బతిన్న పక్షిలా బెడ్ మీద పడి ఉంది విజయ. వీపు మీద వాతలు, చెంపపై చేతివేళ్ల ముద్రలు, జయమ్మ కూతుర్ని గుండెల్లో పొదువుకుంది, అల్లుడ్ని "రాక్షసుడు" అని తిట్టుకుంటూ..

విజయ బ్యాంక్‌లో పని చేస్తుంది. మంచి జీతం తెచ్చుకుంటోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. ఉన్న పొలాన్ని సగం కౌలుకిచ్చి మిగతా సగం అమ్మి కూతుర్ని డిగ్రీ వరకు చదివించింది. బ్యాంకులో ఉద్యోగమూ వచ్చింది. పెళ్లి చేద్దాం అనుకునేంతలో రఘుని ప్రేమించింది. రఘుకి ఉద్యోగం లేదు. ఆస్తిపాస్తులూ చాలా ఉన్నాయి అని నమ్మించాడు. బ్యాంకు ఉద్యోగస్థురాల్ని చేసుకుంటే ఇక తనకు ఢోకా ఉండదని ప్రేమ కథ నడిపించి విజయను పూర్తిగా లొంగదీసుకున్నాడు. నిస్సహాయురాలైన జయమ్మ కూతురు మొండితనానికి లొంగి ఇద్దరికీ పెళ్లి చేసింది. ఆర్నెళ్లు బాగానే ఉన్నా తర్వాత నుంచి రఘు అసలు రూపం బయటపడింది. ఆడదాని సొమ్ముపై బతుకుతున్నాడన్న మంది అవహేళనలు భరించలేక ఆత్మన్యూనతతో విజయని వేధించేవాడు. ఆమె బ్యాంక్ నుంచి ఆలస్యంగా వస్తే ఎవడితో తిరిగొచ్చావే అని అనుమానిస్తూ దారుణంగా కొట్టడం, సిగరెట్ వాతలు పెట్టడం మొదలుపెట్టాడు. తల్లీ కూతుళ్లు నిస్సహాయంగా బలైపోయేవారు. వేధించి డబ్బులు తీసుకుని సిగరెట్లు, తాగుడు, సినిమాలు, రోజూ చికెన్, మటన్‌తో భోజనం. జీతం తెచ్చి ఆమె అతని చేతిలో పెట్టాల్సిందే. ఖర్చులకు అతని ముందు చేయి చాచాల్సిందే. అది పల్లెటూరు. విజయ విషయం క్షణాల్లో ఆ ఊరందరికి తెలిసిపోయేది.

విజయను జాలిచూపుల్తో చూసేవారు పెదవిపై, బుగ్గలపైన సిగరెట్ వాతల్ని అర్థవంతంగా చూసేవారు బ్యాంక్‌లో. అదికాక రఘు బ్యాంక్‌కొచ్చి అక్కడ కూడా ఏమే - ఒసే అని, ఆమెను అవమానించేవాడు. సంవత్సరంపాటుగా నరకయాతనను ఉదాశీనంగా ఉండటం, మాటిమాటికి కన్నీరు కార్చడం, అన్నం సరిగా తినకపోవడం, రాత్రిళ్లు, నిద్రపోకపోవడం, బ్యాంక్‌లో, ఇంట్లో అసహనంగా, చిరాకుగా ఉండటం, స్నానం సరిగా చేయకపోవడం, విరక్తిగా ఉండటం మొదలైంది. విపరీతమైన తలనొప్పి ఒళ్లునొప్పులతో బాధపడసాగింది. అందరితో మాట్లాడటం మానేసింది. మౌనంగా ఉండటం మొదలైంది. దీంతో రఘు ఇంకా రెచ్చిపోయి ఆమెను కొట్టసాగాడు. ఉన్నట్లుండి ఒకరోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకి ప్రయత్నం చేసింది. జయమ్మ సమయానికి డాక్టరు వద్దకు తీసుకువెల్లి కూతుర్ని బతికించుకుంది.

విజయ కేసుని 'డిప్రెసివ్ న్యూరోసిస్'(Depressive neurosis) - అంటే మానసిక ఒత్తిడి(mental stress) ఎక్కువయి వచ్చిన "కృంగుబాటుతనం" అంటారు. నిరాశ, నిస్పృహ, నిస్సాహాయతతో కూడిన మానసిక స్థితి. దీనిని మేజర్ ఎఫెక్టివ్ డిసార్డర్ (Major affective disorder) అని కూడా అంటారు. నిరాశ, నిస్పృహలతో డిప్రెషన్‌(Depression)లో కూరుకుపోయి నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడే విజయలాంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. నేటి సమాజంలో ప్రతి స్త్రీ ఏదో ఒక స్థితిలో డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటుంది.

భర్తను కోల్పోయినవారు, భర్తనించి విడిపోయిన వారు, ఒంటరి స్త్రీలు, డిప్రెషన్‌కు లోనవుతారు. అలాగే కుటుంబ జీవనంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి మూలంగా కూడా ఈ వ్యాధి బారిన పడతారు. ఉదా: విజయపై భర్త దౌర్జన్యం, హింస ఆమెని డిప్రెషన్‌కి లోను చేసింది. ఫలితం ఆత్మహత్యా ప్రయత్నం(suicide attempt). ఇవేకాక కుటుంబంలో అణచివేత, భర్త అహంకారపూరిత ప్రవర్తన, భార్యాభర్తల మధ్య అవగాహనలోపాలు, అత్త, ఆడపడుచుల పెత్తనం, నిర్విరామ కుటుంబ శ్రమ, పిల్లల పెంపకం బాధ్యతల మూలంగా పెరిగే ఒత్తిడి. ఇంకా చదువుకుని ఉద్యోగాలు చేసే స్త్రీలు ఇటు ఇంటి పనికి, ఆఫీసు పనికి నలిగిపోతూ - సతమతమవుతూ అటు ఆఫీసుల్లో పురుషాధిక్యతకు, వేధింపులకు లోనవుతూ, ఇటు ఇంట్లో భర్త, అత్తమామల ఆధిపత్యానికి లోనవుతూ డిప్రెషన్‌కు గురవుతున్నారు. పెళ్లి తర్వాత అత్తవారింట్లో సంభవించే పరిణామాలు ఇష్టం లేకపోయినా విద్యను, తెలివిని తను వ్యక్తిగత వికాసానికి కాక కుటుంబ ఉన్నతికి వినియోగించవలసి రావటం, అణచివేతకు గురికావటం డిప్రెషన్‌కు దారితీస్తుంది. సాంఘిక జీవితంలో దౌర్జన్యాలకు మానభంగాలకు గురికావటం, ఉద్యోగినులు ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురికావటం - సమర్థత విషయంలో వివక్షకు గురికావలసి రావటం డిప్రెషన్‌కు దారి తీస్తుంది. చదువుకుని మేధస్సును ప్రతిభను పెంచుకుని - జీవితంలో ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడానుకునే స్త్రీలు పెళ్లి తరువాత గృహిణిగా, గృహ బానిసగా మిగిలిపోవలసి రావటంతో డిప్రెషన్‌కు లోనవుతారు. ఇవేకాకుండా ఆర్థిక కారణాలు కూడా మనిషిని డిప్రెస్ చేస్తాయి.

డిప్రెషన్ లక్షణాలు(Symptoms of depression):

శారీరక లక్షణాలు : ఆకలి మందగించడం, మలబద్ధకం, కీళ్లు నొప్పులు, ఒళ్లు నొప్పులు, నోరు ఎండుకుపోవం, తలనొప్పి, తల తిరగడం, నిద్ర ఎక్కువ, తక్కువ కావడం, ఆకలి ఎక్కువ కావడం, రుతుక్రమంలో మార్పులు, ఛాతీలో మంట.

మానసిక లక్షణాలు : మతిమరుపు, ఆత్మన్యూనతాభావం, ఆత్మనింద, పశ్చాత్తాప ధోరణి, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఎప్పుడూ నిరాశగా ఉండటం కోసం, చిరాకు, అసహనం తమను ఇతరులతో పోల్చుకుని బాధపడటం, ఆత్మహత్య సంబంధిత ఆలోచనలు చేయడం, ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం. దాంపత్య జీవితంలో ఆసక్తి కోల్పోవడం, సామాజిక సంబంధాలు ఏర్పర్చుకోవటం, ఒంటరిగా ఉండాలనుకోవటం, ఇవేకాక జుట్టు పీక్కోవడం, పళ్లు కొరుక్కోవటం, కూర్చొన్నప్పుడు నిరంతరం కాళ్లూ, చేతులు కదల్చడం లాంటి లక్షణాలు ఉంటాయి. డిప్రెషన్‌కు లోనయినవారు తాగుడు, జర్దా అలవాటు, సిగరెట్లు, డ్రగ్స్‌కి బానిసలయ్యే అవకాశం ఉంది.

తీవ్రమైన డిప్రెషనకి గురైన రోగులు 70 శాతం ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తే 10-15 శాతం మంది ఆత్మహత్య చేసుకుంటారు. విజయ చేసుకోవలసింది ఆత్మహత్యా ప్రయత్నం కాదు ! మానసిక దాస్యాన్ని తెంచుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం !! ఎందుకంటే విజయ సమస్య వ్యక్తిగతం కాదు! ఆమె సమస్యకు మూల కారణం వ్యవస్థే అంటే ఆమె చుట్టూ ఉన్న సామాజిక నియమావళిలో ఉంది. భర్త ఎంత క్రూరుడైనా, చేతకానివాడైన అతడిని దేవుడిలా భరించి తీరాలి! అన్ని విధాలుగా అంటే చదువు, తెలివి, ఆర్థిక స్వాలంబన ఉన్నా, పురుషుడి అండలేనిదే వాడెలాంటివాడైన కానీ స్త్రీకి రక్షణ లేదు. భద్రత లేదు అన్న నెగటివ్ సూచనలను తరతరాలుగా స్త్రీల అంత:చేతనలోకి స్త్రీలే తిరస్కరించలేని విధంగా తయారు చేశారు. ఇంట్లోనే భర్త తిరస్కారానికి, హింసలకు లైంగిక దౌర్జన్యాలకు, ఆర్థిక దోపిడీకి, అగౌరవానికి పర్యవసానంగా తీవ్రమైన మానసిక ఆందోళనకి, అభద్రతాభావానికి గురవుతున్నా, అతడ్నిపెల్లి అన్న సామాజిక నియమావళి ప్రకారం భరించాల్సిందే! ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక గౌరవం ఉన్న విజయ అతనికి శారీరక, మానసిక దాస్యం చేస్తూ జీవితాంతం నరకానికి గురి కావాలసిన అవసరం లేదు! లేదా అతనికి భయపడి తన అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవలసిన పని లేదు! రఘు లేకుండా ఆమె ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపగలదు. దీనికి కావలసిఉంది కొద్దిపాటి ఆత్మవిశ్వాసం, సమస్యలను ఎదురొడ్డి నిలిచే పోరాట పటిమ మాత్రమే. మౌనంగా దౌర్జన్యాన్ని, అణిచివేతను భరిస్తున్నంత కాలం లక్షలాది రఘులు తయారవుతారు. లక్షలాది విజయలు బలవుతారు. కాబట్టి ఆర్థికంగా నిలబడడమే ఆత్మవిశ్వాసాన్నివ్వదు - ధైర్యంగా పోరాడ్డమే - విజయాన్ని సాధించడమే ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. లొంగి బతికితే జీవితం మరింత పరాధీనం, వ్యక్తిత్వ శూన్యం అవుతుంది.

మానసిక ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండి తీరాల్సిందే. జీవితంలో ఏదైనా సాధించడానికి, కానీ ఈ మానసిక ఒత్తిడిని పాజిటివ్ దృష్టి కోణంతో చూస్తే నిర్మాణాత్మక పథకాలతో విజయాల్ని సాధించవచ్చు. నెగటివ్ దృష్టి కోణంతో చేస్తే అశాంతికి, అస్థిరతకు గురై ఆచరణాత్మక పథకాలు విఫలమై అపజయం కలుగుతుంది. తద్వారా డిప్రెషన్‌కు గురవుతారు. పాజిటివ్ దృష్టి అనేది మనిషి ఆలోచనా దృక్పథంపై ఆధారపడుతుంది. మనిషి పరిస్థితులకు, సంఘటనలకు ప్రతిస్పందించే తీరూ, ఆ సంఘటనల ప్రభావం మనిషి ఆలోచనలను నియంత్రించడమో - నిర్మాణాత్మకంగా మార్చడమో చేస్తాయి. ఊహలకు వాస్తవానికి మధ్య జరిగే సంఘర్షణ మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. చైతన్యంలో సమస్యల పట్ల సమగ్రమైన, జ్ఞానవంతమైన అవగాహనతో పాటుగా నిశ్చలమైన మానసిక స్థైర్యంతో, ఆత్మగౌరవంతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. తద్వారా డిప్రెషన్ తగ్గుతుంది. డిప్రెషన్‌కి పరిష్కారం ఎక్కడో లేదు. మన స్త్రీల మనస్సుల్లో వచ్చే చైతన్యవంతమైన మార్పుల్లోనే ఉంది.

డిప్రెషన్‌ తగ్గడానికి సైకో హిప్నో థెరపీ (Psycho hypnotherapy) చాలా ఉపయోగపడుతుంది. మనో విశ్లేషణా చికిత్స ద్వారా డిప్రెషన్‌కు గల మూల కారణాలను వ్యవస్థ లోపాలతో సహా వారికి విశ్లేషించి వివరించడం జరుగుతుంది. నిరాశ, నిస్పృహ, భయాందోళనల, అభద్రతాభావం, సంశయంలాంటి నెగటివ్ ఆలోచనలను ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం, ఆత్మగౌరవం లాంటి పాజిటివ్ ఆలోచనలు మార్చి వారి నిస్సహాయస్థితి నుంచి బయటకు తెచ్చి వారిలోనే సమస్యా పరిష్కార శక్తిని పెంచడం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ (Personality Development) సెషన్స్ (వ్యక్తిత్వ వికాస తరగతులు)లో చెప్పటం జరుగుతుంది.

Next Story