US-Pak: పాక్‌కు హ్యాండిచ్చిన పెద్దన్న

by S Gopi |

పాక్ చరిత్రను చూస్తే, భారత్‌తో తగువుకు దిగిన అన్ని వేళలా అమెరికా ఆదుకోవడం, ఆత్మీయ హస్తం అందించి కాపాడుతూ వచ్చింది.

US-Pak: పాక్‌కు హ్యాండిచ్చిన పెద్దన్న
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, దానిపై ఆధారపడే మనుగడ సాగిస్తున్న పాకిస్తాన్ మెల్లమెల్లగా ఒంటరవుతోంది. పెహల్గాం దాడి తర్వాత భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి కంగారు పడిన పాకిస్తాన్ భారత్‌లోని పౌరుల ఇళ్లు, సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలు దిగింది. దీనికి ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం కరాచీ మొదలుకొని పాక్ ప్రధాన మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో భారత్ దాడికి ఉక్కిరిబిక్కిరి అయిన శత్రు దేశానికి శుక్రవారం మరో షాక్ తగిలింది. దశాబ్దాలుగా భారత్‌తో కయ్యానికి దిగిన ప్రతీసారి అత్యంత నమ్మకమైన స్నేహ హస్తాన్ని అందిస్తున్న పెద్దన్న అమెరికా కూడా తాజా పరిణామాల మధ్య పాక్‌కు మద్దతిచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. పాక్ చరిత్రను చూస్తే, భారత్‌తో తగువుకు దిగిన అన్ని వేళలా పరిస్థితులు చేయి దాటిన సమయంలో అమెరికా ఆదుకోవడం, ఆత్మీయ హస్తం అందించి కాపాడుతూ వచ్చింది. కానీ, భారత తాజా 'ఆపరేషన్ సిందూర్' తర్వాత అమెరికా సున్నితంగానే పాక్‌కు హ్యాండ్ ఇచ్చింది.

పాక్ కుత్సిత బుద్ధిని అర్థం చేసుకోవాలంటే ఓసారి గతాన్ని చూడాలి. 1999 నాటి ఇదే సమయంలో పాకిస్తాన్ కార్గిల్‌లోని కొండ ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని ఆక్రమణకు దిగింది. మే నేలలోనే భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ముజాహిదీన్‌ల ముసుగుతో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి వచ్చిన శత్రుసేనలు, కార్గిల్‌ ప్రాంతంలోని మన కీలక స్థావరాలను ఆక్రమించాయి. పాక్‌కు తగిన బుద్ధి చెప్పకుండా వెనక్కి పంపకూడదనే ఉద్దేశంతో భారత్ చర్యలకు దిగింది. 'ఆపరేషన్ విజయ్' ద్వారా ఎదురుదాడికి దిగింది. బెంబేలెత్తిపోయిన పాక్‌, తోకముడిచింది. ఇదంతా జరుగుతున్న సమయంలోనే భారత్ వ్యూహాత్మకంగా శత్రుసేనలు ఆక్రమణకు దిగిన సమయంలో భారత్ తన ఆర్మీని స్థావరాలను వదిలి వెనక్కి రావాలని సూచించింది. అదే సమయంలో అమెరికన్ గూఢచారి ఉపగ్రహాలు రాజస్థాన్‌లోని రైళ్లలో భారతీయ ట్యాంకులు, భారీ ఫిరంగులను లోడ్ చేస్తున్న ఫోటోలను తీశాయి. దీంతో కార్గిల్‌లో చొరబాటుదారులపై ప్రతీకారంగా భారత్ పాక్‌పై దాడి చేస్తుందనే సందేశం ఖరారైంది.

ఇదంతా జరగడానికి ముందు, పాక్ నియంత్రణ రేఖ నుంచి వెనక్కి వెళ్లేందుకు నిరాకరించడమే కాకుండా, అందులో తమ పాత్ర ఏమీలేదనే అబద్దాలనే చెప్పింది. పైగా భారత్ ఘర్షణకు దిగితే ఇప్పటి మాదిరే అణ్వస్త్ర ఆయుధాలను తీస్తామని ప్రగల్భాలు పలికింది.కానీ, భారత సరిహద్దులో మన ఆర్మీ కదలికల గురించి తెలుసుకున్న పాక్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో సమావేశం కోసం పాకులాడి భేటీ అయ్యింది. ఆ సమావేశంలో తన సేనలను కార్గిల్ నుంచి ఉపసంహరించుకునేందుకు, నియంత్రణ రేఖను వీడేందుకు అంగీకరించింది. అదే ఏడాది జూలై 12న, అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ చొరబాటుదారులు కార్గిల్‌లో ఉండొద్దని సందేశం ఇచ్చారు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం ముగిసింది.

ఈ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దుష్ట మనస్తత్వాన్ని రెండు విషయాలు స్పష్టం చేస్తాయి. ఒకటి, అణ్వాయుధాల బెదిరింపులు, ప్రగల్భాలు పలికినప్పటికీ, భారత్‌తో సాంప్రదాయ యుద్ధానికి పాక్ భయపడుతుంది. రెండు, తనను తాను రక్షించుకునేందుకు పాక్ ముఖం చాటేయడం, లేదా అమెరికాపైనో, అంతర్జాతీయ సమాజంపైనో ఆధారపడుతుంది.

కానీ, ఈసారి భారత్ చేసిన దాడికి బెంబెలెత్తిన శత్రుదేశ దొంగ ఏడుపులను అమెరికా మార్గాలను మూసివేసింది. తాజాగా ఫాక్స్ న్యూస్‌తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాట్లాడుతూ, కొనసాగుతున్న భారత్-పాకిస్తాన్ వివాదంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మేము చేయగలిగేది ఒకటే, ఇరు దేశాలను శాంతియుతంగా ఉండమని చెప్పడమే. కానీ యుద్ధం మధ్యలోకి దూరలేం. ఇదసలు మాకు సంబంధించింది కాదు, పరిస్థితులను నియంత్రించే విషయంలో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు.

ఈ తగువును భారత్, పాకిస్తాన్‌లే పరిష్కరించుకోవాలని వదిలివేస్తూ, వాషింగ్టన్ చేతులు దులుపుకునే స్పష్టమైన సంకేతాల మధ్య, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ కూడా పాక్‌పై మరో బాంబు వేశారు. ఎక్స్ వేదికగా మాజీ ట్రంప్ సహాయకురాలు హేలీ, పెహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ తనను తాను రక్షించుకోవడానికి, ప్రతీకారం తీర్చుకునే హక్కును సమర్థించారు. పైగా పాకిస్తాన్ ఈసారి బాధిత దేశంగా నటించదని ఆమె పోస్ట్ చేశారు.

కాగా, కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ కూడా రక్షణాత్మక స్థితి నుంచి ముందస్తు, ప్రతీకార వ్యూహాలకు దిగుతోంది. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలకోట్ వైమానిక దాడి తరహాలో ప్రత్యక్ష చర్యల ద్వారా బదులిస్తోంది. ఈ విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ తన మిత్రదేశాలపై ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించింది. బలహీన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న రుణ భారం, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్‌లలో అశాంతి, బలహీనమైన రాజకీయ నాయకత్వం కారణంగా భారత్‌తో సాంప్రదాయ యుద్ధానికి దిగే సత్తా లేని స్థాయికి దిగజారింది.

Next Story