Turkey: భారత్ పై అక్కసు.. పాక్ కు మద్దతుగా 350 డ్రోన్లు, సైనికులు పంపిన తుర్కియే

by Shamantha N |

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) సమయంలో పాక్ కు తుర్కియే (Turkey) సాయం చేసింది. భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లు అందించి సాయం చేసింది.

Turkey: భారత్ పై అక్కసు.. పాక్ కు మద్దతుగా 350 డ్రోన్లు, సైనికులు పంపిన తుర్కియే
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) సమయంలో పాక్ కు తుర్కియే (Turkey) సాయం చేసింది. భారత్‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు డ్రోన్లు అందించి సాయం చేసింది. కాగా.. ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. డ్రోన్ సాయమే కాకుండా.. దాయాదికి తుర్కియే తమ సైనికి సిబ్బందిని కూడా పంపినట్లు వార్తలొస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ చేపట్టిన దాడుల్లో చనిపోయిన వారిలో ఇద్దరు తుర్కియే సైనికులు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ భారీస్థాయిలో భారత్‌పై డ్రోన్‌ దాడులు చేసింది. దాదాపు 350 కన్నా ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. భారతదేశానికి వ్యతిరేకంగా బేరక్తర్ టీబీ2 (TB2), వైఐహెచ్ఏ (YIHA) డ్రోన్‌లను ఉపయోగించినట్లు సమాచారం వాటిని భారత్‌ కూల్చివేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరీక్షించారు. అవన్నీ తుర్కియేకు చెందిన ‘అసిస్‌ గార్డ్‌ సోనగర్‌’ డ్రోన్లుగా ధ్రువీకరించారు.

పాక్- తుర్కియేల మధ్య రక్షణ సంబంధాలు

మరోవైపు, పాకిస్థాన్‌-తుర్కియేల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇటీవల భారీగా పెరిగాయి. భారత్‌పై దాడికి పాకిస్థాన్‌.. తుర్కియేకు చెందిన వందల డ్రోన్లను ఉపయోగించింది. అయితే, తుర్కియే ప్రభుత్వం కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ను సరఫరా చేయడమే కాకుండా పాకిస్థాన్ సైన్యానికి శిక్షణ కూడా నిర్వహించింది. అయితే.. వాటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలిటరీకి చెందిన వ్యక్తులను ఇస్లామాబాద్‌కు తుర్కియే పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా తర్వాత తుర్కియేకి భారత ఎగుమతులు విస్తరించడం వల్లే తన రక్షణ ఉత్పత్తిని పెంచుకోవడానికి సహాయపడిందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు తొలి నుంచీ భారత్‌ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను ఎర్దొగాన్‌ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా.. మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా వ్యక్తం చేయడానికి ఆయన ఇష్టపడలేదు.

బాయ్ కాట్ తుర్కియే

మరోవైపు భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల సమయంలో దాయాదికి మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో చాలామంది సోషల్‌ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్‌, బాన్‌ తుర్కియే’ని ట్రెండ్‌ చేస్తున్నారు. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని ఇక్కడి వ్యాపారులు నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు భారత పర్యాటకులు (Indian tourists) టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీ కోసం తాము తమ డబ్బును ఖర్చుపెట్టదల్చుకోలేదని వారు ప్రకటించారు. అంతేకాకుండా, తుర్కియే (Turkey) పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ టీఆర్‌టీ వరల్డ్‌ (Turkish broadcaster TRT World)ను భారతప్రభుత్వం బ్లాక్‌ చేసేసింది. ఆ అకౌంట్‌ను విత్‌హెల్డ్‌ (withheld)లో ఉంచింది. అంతకు ముందు చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్‌ టైమ్స్‌, జిహువా న్యూస్‌ ఎక్స్‌ ఖాతాలను బ్లాక్ చేసింది.

Next Story