కలలో కూడా ఊహించని విధంగా పాక్ గుండెలపై దాడి చేశాం.. ప్రధాని మోడీ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు.

కలలో కూడా ఊహించని విధంగా పాక్ గుండెలపై దాడి చేశాం.. ప్రధాని మోడీ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన భారత్‌ - పాకిస్తాన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘పెహల్గాంలో భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలా చెప్పాం.. అందుకే దానికి ఆపరేషన్ సిందూర్ అనే పేరు పెట్టాం. పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ఎదుల కాల్చి చంపారు. ఈ దాడితో దేశం మొత్తం నివ్వెరపోయింది. దేశంలోని ప్రతీ హృదయం చలించింది. పౌరులు, రాజకీయ పార్టీలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారత సైన్యానికి మద్దతుగా నిలబడ్డాయి. పెహల్గాం దాడి జరిగిన తర్వాత నాలుగు రోజుల వరకు భారత సైన్యం సంయమనం పాటించింది. నిఘావర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతికత సామార్థ్యాన్ని దేశం చూసింది. ఉగ్రవాదులపై దాడిలో మన సైన్యం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది.

ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. భారత రక్షణ దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికే తలమానికం. ఉగ్రవాద శిబిరాలపై భారత మిస్సైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాయి. బహవల్‌పూర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితి భారత్ సృష్టించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలు, ఉగ్ర సానుభూతి పరులు గుండెళ్లో భయం మొదలైంది. తాము కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశాం. కానీ మధ్యలో పాక్ దూరింది. అందుకే పాక్‌పై ఎటాక్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు కూడా తగిన బుద్ధి చెప్పాం. పాక్ తదుపరి చర్యలపై కూడా ఓ కన్నేసి ఉంచాం. మళ్లీ పాక్ గీత దాటితే సహించేది లేదు. పాక్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే.. మేమే చేయాలో కూడా ముందే డిసైడ్ అయ్యాం. పాక్ తోకజాడిస్తే ఇక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాక్ మనపై దొంగ దెబ్బకు ప్రయత్నించింది. కానీ మనం దొంగదెబ్బ కొట్టలేదు. పాక్ గుండెలపై దాడి చేశాం. ఇక నుంచి ఉగ్రవాద అంతానికి ఎప్పటికప్పుడు కొత్త పంథా తీసుకొస్తాం. పోరాటంలో వీరత్వాన్ని ప్రదర్శించిన భారత ఆర్మీకి నా సెల్యూట్ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Next Story