భారత్ vs పాక్.. యుద్ధం చేస్తే నెక్స్ట్ పరిస్థితేంటి!

by Malleboina Mahesh |

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

భారత్ vs పాక్.. యుద్ధం చేస్తే నెక్స్ట్ పరిస్థితేంటి!
X

దిశ, నేషనల్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు చేపట్టింది. భారత సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ దాడుల తర్వాత భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ ఆర్మీ రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

దీంతో రెండు దేశాల మధ్య యుద్ధానికి తొలి అడుగులు పడినట్లు అనిపిస్తోంది. మరోవైపు భారత్ బుధవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలనే విషయంపై అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల బలం ఎంత? ఏ దేశం వద్ద ఎన్ని ఆయుధాలున్నాయి? ఎంత సైన్యం ఉంది, ఇరు దేశాలు మధ్య యుద్ధం వస్తే నెక్స్ట్ పరిస్థితేంటి! అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

భారత త్రివిధ దళాల బలం

గ్లోబల్ ఫైర్ పవర్ వెబ్ సైట్ ప్రకారం.. 2025 మిలటరీ ర్యాంకింగ్ లో భారతదేశం పాకిస్థాన్ కంటే ముందు స్థానంలో ఉంది. అంతర్జాతీయ సైనిక శక్తికి సంబంధించి 145 దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంటే పాక్ 12వ స్థానంలో ఉంది. ఇక భారత్ వద్ద దాదాపు 22 లక్షలకు పైగా సైన్యం ఉన్నట్లు గ్లోబల్ ఫైర్ పవర్ పేర్కొంది. అలాగే 4,201 యుద్ధ ట్యాంకులు, దాదాపు లక్షా 50 వేల ఆర్మర్డ్ వెహికల్స్, 100 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోన్డ్ ఆర్టిలరీ ఉన్నాయి. దీంతో పాటు మల్టీ బారెల్ రాకెట్ ఆర్టిలరీ 264 ఉన్నాయి. ఇక భారత వాయుసేన వద్ద 3 లక్షల 10 వేల మంది బలగం ఉంది.

అలాగే 2,229 విమానాలుండగా.. వాటిలో 513 ఫైటర్ విమానాలు, 270 రవాణా విమానాలు, 130 ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్ లు, 351 శిక్షణ విమానాలు, ఆరు ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్ క్రాఫ్ట్ లున్నాయి. అంతేకాదు, భారత సైన్యానికి చెందిన మూడు విభాగాల దగ్గర 899 హెలికాప్టర్లున్నాయి. వీటిలో 80 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. మరోవైపు భారత నౌకాదళం దగ్గర.. లక్షా 42 వేల మంది సెయిలర్లు ఉన్నారు. అలాగే, రెండు విమాన వాహక నౌకలు సహా మొత్తం 293 నౌకలుండగా.. వాటిలో 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి. భారత ఆర్మీ పరిధిలో 311 ఎయిర్ పోర్టులు, 56 పోర్టులు ఉన్నాయి.

పాకిస్తాన్ త్రివిధ దళాల బలం

పాకిస్తాన్ సైన్యంలో దాదాపు 13 లక్షల 11 వేల మంది సైనికులు ఉన్నారు. లక్షా 24 వేల మంది నౌకాదళ సిబ్బంది, 78 వేల వైమానిక సిబ్బంది ఉన్నారు. ఇక పాక్ దగ్గర మొత్తం 1,399 ఎయిర్ క్రాఫ్ట్ లు ఉండగా.. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 90 ఎటాక్ టైప్స్, 64 ట్రాన్స్ పోర్ట్ విమానాలు, 565 ట్రైనర్లు, 4 ట్యాంకర్ ఫ్లీట్లు, 373 హెలికాప్టర్లుండగా అందులో 57 ఎటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. అదేవిధంగా 2,627 ట్యాంకులు, 662 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 2,629 టోడ్ అర్టిలరీ, 600 మల్టీ బ్యారల్ ఆర్టిలరీ ఉన్నాయి. ఇక పాకిస్తాన్ నౌకాదళం దగ్గర మొత్తం 121 యుద్ధ నౌకలున్నాయి. వాటిలో 9 ఫ్రిగేట్లు, 9 కార్వెట్టులు, 8 సబ్మెరైన్లు, 69 పెట్రోల్ నౌకలున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ పరిధిలో మూడు పోర్టులు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు 116 ఎయిర్ పోర్టులు, 60 మర్చంట్ మెరైన్ ఫ్లీట్లు ఉన్నాయి.

స్వీడిష్ థింక్ ట్యాంక్ స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. భారత్ దగ్గర 172 న్యూక్లియర్ వార్ హెడ్ లు ఉండగా.. పాక్ దగ్గర 170 ఉన్నాయి. ఇక రెండు దేశాలు ఎన్ని అణు ఆయుధాలను కలిగి ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. కాగా చైనా వద్ద మాత్రం 500 వరకు అణ్వాయుధాలున్నట్లు సమాచారం.

రెండు దేశాల దగ్గర ఎన్ని డ్రోన్లు ఉన్నాయంటే?

గత ఏడాది నుంచి ఇరు దేశాలు తమ డ్రోన్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర తక్కువ డ్రోన్లు ఉన్నాయి. కానీ, పాక్ దగ్గర అనేక రకాల సామర్థ్యం ఉన్న 10 నుంచి 11 రకాల డ్రోన్లు ఉన్నట్లు సమాచారం. టర్కీ, చైనా నుంచి పాకిస్తాన్ డ్రోన్లు దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ, ఇటలీ నుంచి కూడా పాకిస్తాన్ డ్రోన్లు కొనుగోలు చేసింది. బరాఖ్, శహపర్ వంటి డ్రోన్లను కూడా పాకిస్తాన్ తయారు చేస్తోంది. టర్కీకి చెందిన అధునాతన బైరాక్తర్ డ్రోన్లు టీబీ2, ఎకెంజీ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. 'వాంగ్ లాంగ్ 2' సీహెచ్ 4 వంటి డ్రోన్లను కూడా చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసింది.

ఇదీలా ఉండగా భారత్ 3.5 బిలియన్ డాలర్ల విలువైన ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయడానికి గత ఏడాది అక్టోబరులో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రిడేటర్ డ్రోన్లను ప్రపంచంలో అత్యంత ప్రమాదకర డ్రోన్లుగా భావిస్తారు. వీటితో పాటు 500 మిలియన్ డాలర్ల విలువైన బాంబులు, లేజర్ గైడెడ్ మిస్సైల్స్ కూడా భారత్ కొనుగోలు చేయనుంది. ఆ డ్రోన్లతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించవచ్చు.

Next Story