- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి కలగన్నాడు.. వైభవ్ సాకారం చేశాడు.. 14 ఏళ్ల చిచ్చర పిడుగు సక్సెస్ స్టోరీ ఇదే
క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతుంది.

దిశ, స్పోర్ట్స్ : సాధారణంగా తల్లిదండ్రులు తమ కలలను కొడుకుల రూపంలో నెరవేర్చుకోవాలనుకోవడం సహజం. ఆ తండ్రి కూడా క్రికెటర్ కావాలనుకున్నాడు. కానీ, పరిస్థితులు సహకరించక కాలేకపోయాడు. కానీ, తన కొడుకు ద్వారా కలను నిజం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేశాడు. కొడుకు ట్రైనింగ్ కోసం పొలం కూడా అమ్మేశాడు. ఇక, ఆ కొడుకు కూడా తండ్రి కలను నెరవేర్చడానికి కష్టపడ్డాడు. 14 ఏళ్ల వయసులో స్నేహితులతో కలిసి సరదాగా గడపాల్సిన తన పసితనాన్ని స్టేడియానికి అంకితం చేశాడు. చివరికి తన నాన్న కలను నిజం చేశాడు. ఆ కొడుకు మరెవరో కాదు వైభవ్ సూర్యవంశీ.. ఆ తండ్రి సంజీవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఈ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ చిచ్చర పిడుగు ఏకంగా 35 బంతుల్లోనే సెంచరీ బాది ఐపీఎల్‌లోనే కాదు.. టీ20 క్రికెట్‌లోనే శతకం చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. దీంతో వైభవ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
రైతు కుటుంబం నుంచి
బీహార్‌లోని సమస్తిపూర్‌లోని మోటిపూర్ గ్రామం వైభవ్ స్వస్థలం. సంజీవ్ సూర్యవంశీ, ఆర్తి దంపతులకు 2011 మార్చి 27న జన్మించాడు. సంజీవ్‌ది ఓ సాధారణ రైతు కుటుంబం.సంజీవ్ కూడా క్రికెటర్ కావాలని కలలు కన్నారు. కానీ, పరిస్థితులు సహకరించలేదు. దీంతో తన కొడుకును క్రికెటర్ చేయాలని అనుకున్నాడు. అందుకోసం ఏ త్యాగానికి కూడా వెనుకాడలేదు. చేస్తున్న పనిని వదిలేశాడు. వైభవ్ ట్రైనింగ్ కోసం పొలం కూడా అమ్మేశాడు. వైభవ్ తల్లి రాత్రి 11 గంటలకు పడుకుని ఉదయం 3 గంటలకే లేచేది. వైభవ్‌కు భోజనం సిద్ధం చేసేది. ఆమె రోజులో మూడు గంటలే పడుకునేదాని వైభవే తెలిపాడు. వైభవ్ అన్నయ్ పని చేస్తూ ఇంటిని చేసుకున్నాడు.
శిక్షణ కోసం 100 కి.మీ
9 ఏళ్ల వయసులో వైభవ్ కోచ్ మనీష్ ఓజా వద్ద శిక్షణలో చేరాడు. సమస్తిపూర్ నుంచి పాట్నాకు 100 కిలో మీటర్లు. రోజు తప్పించి రోజు వైభవ్ ట్రైనింగ్‌కు వెళ్లేవాడు. తండ్రి సంజీవ్ స్వయంగా వైభవ్‌ను తీసుకెళ్లేవాడు. వైభవ్‌తోపాటు అతనికి బౌలింగ్ చేసే నెట్ బౌలర్ల కోసం 10 టిఫిన్ బాక్స్‌లు తీసుకెళ్లేవాడు. వైభవ్ ఉదయం 7:30 గంటలకు సాధన మొదలుపెట్టేవాడు. ప్రతి రోజు 600 బంతులు ఆడేవాడు. పేసర్లను ఎదుర్కోవడానికి గంటకు 15 కి.మీ వేగంతో వచ్చే సైడ్ ఆర్మ్ త్రోడౌన్‌లతో ప్రాక్టీస్ చేశాడు. ఇలా వైభవ్ నాలుగేళ్లు కష్టపడ్డాడని కోచ్ ఓజా తెలిపాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్టులో సెంచరీ సాధించడంతో వైభవ్ బిహార్ జట్టులో చోటు సంపాదించాడు. వయసు తక్కువగా ఉన్న అతని టాలెంట్‌ను గుర్తించి రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు.
వైభవ్ సక్సెస్ వెనుక లక్ష్మణ్
ఐపీఎల్‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో వైభవ్ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను వేలంలో ఎంపిక చేయడం వెనుక క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్షణ్ పాత్ర ఉంది. నేషనల్ క్రికెట్ అకాడమీకి లక్ష్మణ్ హెడ్‌గా ఉన్న విషయం తెలిసిందే. భారత అండర్-19 జట్టుకు ఆడే సమయంలో వైభవ్ ప్రతిభను లక్ష్మణ్ గుర్తించాడు. అతనిలో స్ఫూర్తినింపాడు. గతేడాది వేలానికి ముందు రాహుల్ ద్రవిడ్‌కు వైభవ్ గురించి చెప్పాడు. లక్ష్మణ్ సూచనతో ద్రవిడ్ అతన్ని ప్రాక్టీస్ క్యాంప్‌కు రప్పించాడు. అక్కడ వైభవ్ ప్రతిభను గుర్తించిన ద్రవిడ్ వేలంలో అతన్ని రాజస్థాన్ జట్టులోకి తీసుకున్నాడు.
వేలంతోనే అందరి దృష్టిని..
ఐపీఎల్ అరంగేట్రం చేయకముందే వైభవ్ పేరు మారుమోగింది.గతేడాది నిర్వహించిన మెగా వేలంలో అతని కోసం రాజస్థాన్ భారీగా ఖర్చు చేసింది. ఏకంగా రూ.1.10 కోట్లు కుమ్మరించింది. ఓ అనామక ప్లేయర్ కోసం రాజస్థాన్ భారీ ధర పెట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆ ధరకు న్యాయం చేస్తూ వైభవ్ ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. లక్నోపై అరంగేట్రం చేసిన అతను ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి రికార్డు నెలకొల్పాడు.
వైభవ్‌కు రూ.10 లక్షల క్యాష్ ప్రైజ్
వైభవ్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ప్రైజ్‌మనీని ప్రకటించారు. ఈ సందర్భంగా వైభవ్‌కు ఫోన్ చేసి నితీశ్ అభినందించారు. ‘వైభవ్ సూర్యవంశీ తన కృషి, ప్రతిభతో భారత క్రికెట్‌కు ఆశాకిరణంలా మారాడు. నేను 2024లో అతడిని, అతడి తండ్రిని కలిశాను. వైభవ్ కు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు అతడి అద్భుతమైన ప్రదర్శన చూసి రాష్ట్రం గర్విస్తోంది.’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.






