ఆర్సీబీ విజయానికి కారకులు..సీజన్ ఆసాంతం చెలరేగిన ప్లేయర్లు వీళ్లే!

by Phanindra |

ఆర్సీబీ విజయానికి ఐదుగురు స్టార్ ప్లేయర్లే కారణం. సీజన్ ఆసాంతం చెలరేగిన ప్లేయర్లు ఎవరంటే?

ఆర్సీబీ విజయానికి కారకులు..సీజన్ ఆసాంతం చెలరేగిన ప్లేయర్లు వీళ్లే!
X

దిశ, స్పోర్ట్స్: 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడింది. సీజన్ ఆరంభం నుంచి ఈ టీం ఆడుతున్న విధానం చూసిన విశ్లేషకులంతా.. ‘ఇంతకాలం ఆర్సీబీలో మిస్సయిన మ్యాజిక్ ఈ సంవత్సరం కనపడుతోంది. ట్రోఫీ వాళ్లదే’ అని చెప్తూనే వచ్చారు. ఆ మాటను నిజం చేస్తూ ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ నిలిచింది. ఈ ప్రయాణంలో కొందరు ఆర్సీబీ ప్లేయర్లు కీలకమైన పాత్ర పోషించారు. వారెవరంటే..?

జితేశ్ శర్మ

సీజన్ మొదలవడానికి ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘జితేశ్ వచ్చాడు. అంతా చూసుకుంటాడు’ అని ఫ్యాన్స్‌కు మాటిచ్చాడీ వికెట్‌కీపర్ బ్యాటర్. ఆ మాటను నిలబెట్టుకుంటూ సీజన్ ఆసాంతం ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక చివరి లీగ్ మ్యాచులో లక్నోపై జితేశ్ ఆడిన ఇన్నింగ్స్ ఎవరైనా ఎలా మర్చిపోగలరు. ఫైనల్‌లో కూడా కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు చేసి బెంగళూరుకు మంచి స్కోరు అందించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఫిల్ సాల్ట్

ఆర్సీబీకి అద్భుతమైన ఆరంభాలు అందించిన ఈ ఇంగ్లిష్ ప్లేయర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫియర్‌లెస్ బ్యాటింగ్‌తో ఈ సీజన్‌లో 175.98 స్ట్రైక్ రేటు, 33.58 సగటుతో 403 పరుగులు చేశాడు. ప్రత్యర్థి ఎవరైనా ఆర్సీబీకి అదిరే ఆరంభాలు అందించడానికే ప్రయత్నించిన సాల్ట్.. క్వాలిఫైయర్-1లో కూడా జస్ట్ 27 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

జోష్ హేజిల్‌వుడ్

ఐపీఎల్ 2025లో బెస్ట్ బౌలర్ల లిస్టులో హేజిల్‌వుడ్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. గాయంతో అన్ని మ్యాచులు ఆడలేకపోయిన అతను కేవలం 12 మ్యాచుల్లోనే 22 వికెట్లు తీసుకొని ఔరా అనిపించాడు. కొన్ని మ్యాచులను తన సూపర్ స్పెల్స్‌తో ఆర్సీబీ వైపు తిప్పిన హేజిల్‌వుడ్.. క్వాలిఫైయర్-1లో కూడా పంజాబ్‌పై మూడు వికెట్లతో మెరిశాడు.

కృనాల్ పాండ్యా

చాలా గ్యాప్ తర్వాత కృనాల్ తన ఫుల్ మోజోలో కనిపించాడీ సీజన్‌లో. ఆర్సీబీకి ఒక గొప్ప ఆయుధంలా మారాడు. 15 ఇన్నింగ్సుల్లో 17 వికెట్లతో అదరగొట్టాడు. ముంబైపై 4 వికెట్లతో చెలరేగిన అతను.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆల్‌రౌండ్ షోతో రెచ్చిపోయాడు. ఇక ఫైనల్‌లో కూడా పంజాబ్ ఛేజ్ సాఫీగా సాగిపోతున్నప్పుడు ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్‌ను అవుట్ చేసి పీబీకేఎస్ నడ్డివిరిచాడు.

విరాట్ కోహ్లీ

ఎప్పట్లాగే కోహ్లీ మరోసారి ఆర్సీబీ కోసం ప్రాణం పెట్టేశాడు. సాల్ట్‌తో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. అదే టైంలో జట్టు కష్టాల్లో ఉంటే యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ.. అవసరమైనప్పుడు స్పీడు పెంచుతూ జట్టు విజయతీరాలకు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 15 మ్యాచుల్లో 657 పరుగులతో టాప్ స్కోరర్ల లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తం 8 హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఫైనల్‌లో అతని 43 పరుగులు ఒక విధంగా ఆర్సీబీకి చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనే చెప్పాలి.

వీళ్లంతా తమ పెర్ఫామెన్స్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాలన్నీ వీళ్ల వల్లనే అని కూడా చెప్పలేం. ఈ టీంలో 9 మంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకున్నారు. అంటే ప్రతి మ్యాచులో ఎవరో ఒకరు అద్భుతమైన ప్రదర్శన చేశారన్నమాట. ఇక కెప్టెన్‌గా రజత్ పటీదార్ వ్యూహాలు, బౌలింగ్ మార్పుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత ఒత్తిడి ఉన్నా సరే.. చాలా కూల్‌గా నిర్ణయాలు తీసుకుంటూ, తన ప్లాన్ ఫాలో అవుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా కృనాల్, సూయశ్‌ను రజత్ వాడుకున్న విధానం సూపర్ అనే చెప్పాలి. ఇలా ఆ జట్టంతా కలిసి కప్పు కొట్టింది.

Next Story