- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్నోపై పంజాబ్ విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువగా కింగ్స్
ఐపీఎల్-18లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. ధర్మశాల వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 236 రన్స్ చేసింది. ప్రభ్‌సిమ్రాన్(91)కుతోడు ఇతర బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో పంజాబ్.. లక్నో ముందు 237 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఛేదనలో పోరాడిన లక్నో 199/7 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ఛేదనలో లక్నోకు సరైన ఆరంభం దక్కలేదు. అర్ష్‌దీప్ ఆరంభంలోనే ఆ జట్టును దెబ్బకొట్టాడు. మార్ష్(0), మార్‌క్రమ్(13), పూరన్(6)లను అవుట్ చేశాడు. దీంతో పవర్ ప్లేలోనే లక్నో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. పంత్(18) మరోసారి చేతులెత్తేయగా.. మిల్లర్(11) కూడా నిరాశపర్చడంతో 73 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఆయుశ్ బదోని(74) జట్టును ఆదుకున్నాడు. అతనికితోడు అబ్దుల్ సమద్(45) కూడా సత్తాచాటాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును గాడిన పట్టారు. పంజాబ్ బౌలర్లపై విరుచుకపడి ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు కొట్టారు. దీంతో 154/6తో లక్నో పోటీలోకి వచ్చింది. అయితే, పంజాబ్ బౌలర్లు మరింత పట్టు వదలకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో సమద్‌ను జాన్సెన్ అవుట్ చేయడంతో లక్నో షాక్ తగిలింది. ఇక, చివరి ఓవర్‌లో చాహల్.. బదోనికి కూడా చెక్ పెట్టాడు. దీంతో లక్నో 200లోపే కట్టడి అయ్యింది. లక్నో వరుసగా మూడో పరాజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.
రెచ్చిపోయిన ప్రభ్‌సిమ్రాన్
ముందుగా పంజాబ్‌కు పేలవ ఆరంభమే దక్కింది. యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(1) తొలి ఓవర్‌లోనే వికెట్ పారేసుకున్నాడు. అయితే, మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్(91) మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పోటాపోటీగా ఫోర్లు, సిక్స్‌లు దంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రాన్‌కు ఇది 3వ అర్ధ శతకం. హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత చెలరేగి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన 19వ ఓవర్ వరకు నిలబడ్డాడు. 19వ ఓవర్‌లో ఐదో బంతికి దిగ్వేశ్ అవుట్ చేయడంతో ప్రభ్‌సిమ్రాన్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అతను 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 91 రన్స్ చేశాడు. ప్రభ్‌సిమ్రాన్ తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్‌లో మిగతా వాళ్లు కూడా క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సత్తాచాటాడు. 25 బంతుల్లో 45 రన్స్ చేశాడు. జోష్ ఇంగ్లిస్(30) కూడా కాసేపు మెరుపులు మెరిపించాడు. ఇక, శశాంక్ సింగ్(33నాటౌట్), స్టోయినిస్(15 నాటౌట్) కూడా డెత్ ఓవర్లలో చెలరేగిపోయారు. దీంతో పంజాబ్ 236 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.






