- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : రాజస్థాన్ ఆల్‌రౌండ్ షో.. పంజాబ్ దూకుడుకు బ్రేక్
ఐపీఎల్-18లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చండీగఢ్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో వరుసగా రెండు విజయాలతో దూకుడు మీద ఉన్న పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. ముందుగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ దారుణంగా తడబడింది. రాజస్థాన్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, సందీప్ శర్మ, తీక్షణ చెరో రెండు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఆర్చర్ తొలి ఓవర్‌లోనే పంజాబ్‌కు భారీ షాక ఇచ్చాడు. ప్రియాన్ష్ ఆర్య(0)తోపాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(10)ను అవుట్ చేశాడు. స్టోయినిస్(1), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(17) కూడా నిరాశపర్చడంతో పంజాబ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో నేహాల్(62) జట్టును ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. మ్యాక్స్‌వెల్(30) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్‌తో కలిసి నెహాల్ ఐదో వికెట్‌కు 88 పరుగులు జోడించి జట్టును పోటీలోకి తీసుకొచ్చాడు. 15 ఓవర్లలో 131/4తో పంజాబ్ మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ, రాజస్థాన్ బౌలర్లు మరోసారి చెలరేగారు. 20 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు తీసి రాజస్థాన్ విజయాన్ని లాంఛనం చేశారు. నేహాల్‌ను హసరంగ అవుట్ చేసి పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లగా.. వరుసగా మ్యాక్స్‌వెల్, సూర్యంష్ షెడ్గే(2), జాన్సెన్(3), అర్ష్‌దీప్(1) వికెట్లు పారేసుకున్నారు. దీంతో పంజాబ్ 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులకే ఆట ముగించి ఓటమిపాలైంది.
రాణించిన జైశ్వాల్, పరాగ్
రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ సత్తాచాటింది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫామ్ అందుకున్నాడు. చక్కటి సిక్సర్లతో అలరించిన అతను అతను 45 బంతుల్లో 67 రన్స్ చేశాడు. కెప్టెన్, మరో ఓపెనర్ శాంసన్ కూడా కీలక పరుగులు జోడించాడు. జైశ్వాల్, శాంసన్ కలిసి తొలి వికెట్‌కు 89 రన్స్ జోడించడంతో రాజస్థాన్‌కు మంచి ఆరంభం దక్కింది. 10ఓవర్ల తర్వాత రాజస్థాన్ తడబాటుకుగురైంది. స్వల్ప వ్యవధిలోనే శాంసన్, జైశ్వాల్ అవుటయ్యారు. గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన నితీశ్ రాణా(12) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఇక, శాంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా అతను మాత్రం పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి దిగాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లో 43 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో రాజస్థాన్ స్కోరు 200 పరుగుల మార్క్‌ను దాటింది.






