IPL 2025 : వర్షం కారణంగా పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్

by Harish |

ఐపీఎల్-18లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణమైంది.

IPL 2025 : వర్షం కారణంగా పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్
X

దిశ, స్పోర్ట్స్ : గత మ్యాచ్‌లో ఓటమికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ కింగ్స్ చూసింది. ఆ దిశగానే కేకేఆర్ తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ చెలరేగి ఆడటంతో 202 పరుగుల లక్ష్యం కేకేఆర్ ముందు ఉంచింది. భారీ టార్గెట్ పెట్టడంతో గెలుపుపై దీమాగా ఉన్న పంజాబ్‌పై వరుణుడు పంజా విసిరాడు. తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో కేకేఆర్‌పై రివేంజ్ తీర్చుకోవాలన్న పంజాబ్ ఆశలపై నీళ్లుచల్లినట్టైంది.

ఐపీఎల్-18లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణమైంది. తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షం కురవగా మ్యాచ్‌లో ఫలితం తేలేలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ సీజన్‌లో వర్షం కారణంగా రద్దైన తొలి మ్యాచ్ ఇదే. టాస్ నెగ్గిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్(83), ప్రియాన్ష్ ఆర్య(69) రాణించడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఇక, 202 పరుగుల లక్ష్యంతో కేకేఆర్ ఛేదనను ఆరంభించిన కాసేపటికే వర్షం మొదలైంది. కేకేఆర్ ఒకే ఓవర్ బ్యాటింగ్ చేసింది. 9:35 గంటల సమయంలో అనూహ్యంగా వర్షం వచ్చింది. 10 గంటల తర్వాత వర్షం తగ్గింది. దీంతో 10:30 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుందని అంతా భావిస్తుండగా.. మళ్లీ వర్షం కురవడం మొదలైంది. ఇక, వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో 11: 00 గంటల సమయంలో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేసినట్టు ప్రకటించారు. ఇరు జట్లకే చెరో పాయింట్ కేటాయించారు. పంజాబ్ 11 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది.కోల్‌కతా 7 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నది.

ఓపెనర్లు దంచేశారు

అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ అదరగొట్టారు. యువ బ్యాటర్ ప్రియాన్స్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను కేకేఆర్ బౌలర్లను ఊచకోతకోశాడు. 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ కూడా ఏం తగ్గలేదు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన అతను పవర్ ప్లే తర్వాత మాత్రం బ్యాటు ఝుళిపించాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు దంచాడు. తొలి వికెట్‌కు ఈ జోడీ ఏకంగా 120 రన్స్ జోడించడంతో పంజాబ్ 200లకు పైగా స్కోరుపై కన్నేసింది. అయితే, దూకుడు మీద ఉన్న ప్రియాన్ష్‌ను రసెల్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ప్రియాన్ష్ అవుటైనా ప్రభ్‌సిమ్రాన్ తన జోరును కొనసాగించాడు. సకారియా, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్యాటు ఝుళిపించి సెంచరీ దిశగా వెళ్లాడు. కానీ, వైభవ్ అరోరా బౌలింగ్‌లో క్యాచ్ అవుటవడంతో ప్రభ్‌సిమ్రాన్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక, చివరి ఐదు ఓవర్లలో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో మ్యాక్స్‌వెల్(7), జాన్సెన్(3) నిరాశపరిచాడు. అయితే, శ్రేయస్ అయ్యర్(25 నాటౌట్), జోష్ ఇంగ్లిస్(11 నాటౌట్) విలువైన రన్స్ జోడించడంతో స్కోరు 200 దాటింది.

Next Story