గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్.. రబాడపై నిషేధం ఎత్తివేత

by Harish |

దక్షిణాఫ్రికా, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడకు భారీ ఊరట లభించింది.

గుజరాత్ టైటాన్స్‌కు గుడ్ న్యూస్.. రబాడపై నిషేధం ఎత్తివేత
X

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా, గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడకు భారీ ఊరట లభించింది. వినోద డ్రగ్ వాడటంతో అతను నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం ఇటీవల బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా రబాడపై విధించిన నిషేధాన్ని సౌతాఫ్రికా ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రగ్ ఫ్రీ స్పోర్ట్(ఎస్‌ఏఐడీఎస్) ఎత్తివేసింది. రబాడ ట్రీట్మెంట్ ప్రొగ్రామ్‌ను సంతృప్తికరంగా పూర్తి చేయడంతో అతనిపై నిషేధాన్ని మూడు నెలల నుంచి నెలకు తగ్గించింది.

ఫలితంగా గత నెల 1న విధించిన సస్పెన్షన్ గడువు తాజాగా ముగిసింది. దీంతో రబాడ తిరిగి ఆడేందుకు ఎస్‌ఏఐడీఎస్ అనుమతినిచ్చింది. ‘సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జనవరి 21న నిర్వహించిన డ్రగ్ టెస్టులో రబాడ విఫలమయ్యాడు. ఏప్రిల్ 1న ఫలితం వచ్చింది. వెంటనే అతనిపై తాతాల్కిక సస్పెన్షన్ విధించాం. దీంతో అతను భారత్ నుంచి సౌతాఫ్రికాకు తిరిగి వచ్చాడు. రబాడ ట్రీట్మెంట్ ప్రొగ్రామ్‌కు హాజరయ్యాడు. రెండు సెషన్లు పూర్తి చేశాడు. ఒక నెల తాత్కాలిక సస్పెన్షన్ ముగిసింది.’అని ఎస్‌ఏఐడీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ గత నెలలో వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే, డోపీగా తేలడంతో ఇక అతను ఐపీఎల్‌కు దూరమైనట్టే అని వార్తలు వచ్చాయి. తాజాగా నిషేధం ఎత్తివేయడంతో రబాడ తిరిగి ఐపీఎల్‌లోకి కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌‌లో రెండే మ్యాచ్‌లు ఆడిన రెండు వికెట్లు తీశాడు. రబాడ రాకతో గుజరాత్ బలం మరింత పెరిగినట్టే.


Next Story