- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL Suspended : దేశం కంటే ఐపీఎల్ గొప్పదేం కాదు : బీసీసీఐ
ఐపీఎల్-2025ను బీసీసీఐ వారంపాటు వాయిదా వేసింది.

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అందరూ ఊహించిందే జరిగింది. ఐపీఎల్-2025 వాయిదా పడింది. వారం రోజులపాటు లీగ్‌ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో గురువారం ధర్మశాల వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది. వాటాదారులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. దీంతో ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌తోపాటు వారంలో నిర్వహించే మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది.
దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు : బీసీసీఐ
క్రికెట్ భారత్‌కు జాతీయ అభిరుచి అయినప్పటికీ, తమకు దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని బీసీసీఐ తెలిపింది. ‘దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత కంటే గొప్పది ఏదీ లేదు. దేశాన్ని రక్షించే అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి బీసీసీఐ కట్టుబడి ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంతోనే బీసీసీఐ ఉంటుంది. భారత ప్రభుత్వానికి, త్రివిధ దళాలకు, దేశ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూరును కొనసాగిస్తూ దేశాన్ని రక్షిస్తున్న మన సాయుధ దళాల ధైర్యసాహసాలకు, నిస్వార్ధ సేవకు సెల్యూట్ చేస్తున్నాం.’అని బీసీసీఐ తెలిపింది.






