- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: రాజస్థాన్ చిత్తు.. గుజరాత్‌కు వరుసగా నాలుగో విజయం
ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-18లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. సాయి సుదర్శన్(82) కీలక ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా సుదర్శన్ రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 217/6 స్కోరు చేసింది. సుదర్శన్‌తోపాటు బట్లర్(36), షారుఖ్ ఖాన్(36) విలువైన రన్స్ జోడించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చేతులెత్తేసింది. 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. హెట్మేయర్(52), కెప్టెన్ శాంసన్(41) పోరాటం వృథా అయ్యింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ(3/24), రషీద్ ఖాన్ (2/37), సాయి కిశోర్ (2/20) సత్తాచాటి రాజస్థాన్ పతనాన్ని శాసించారు.
రాజస్థాన్ విలవిల
ఛేదనలో రాజస్థాన్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. గుజరాత్ బౌలర్లు ప్రసిద్ధ్, రషీద్, సాయి కిశోర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. దీంతో రాజస్థాన్ మొదటి నుంచే తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(6), నితీశ్ రాణా(1), ధ్రువ్ జురెల్(5) దారుణంగా నిరాశపరిచారు. కెప్టెన్ శాంసన్(41)ను ఆదుకునేందుకు చూశాడు. రియాన్ పరాగ్(26)తో కలిసి కలిసి కాసేపు జట్టును నడిపించాడు. ధాటిగా ఆడే క్రమంలో పరాగ్ క్యాచ్ అవుటవ్వగా.. స్కోరు 100 దాటిన తర్వాత శాంసన్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత హెట్మేయర్(52) ఒంటరి పోరాటం చేశాడు. ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే, మరో ఎండ్‌లో అతనికి సహకరించే వారు లేకపోవడంతో అతని పోరాటం కూడా ఫలించలేదు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద సాయి కిశోర్‌కు దొరికిపోయాడు. అనంతరం తుషార్ దేశ్‌పాండే(3), తీక్షణ(5) వికెట్లు కోల్పోవడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ ఆట ముగిసింది.
మెరిసిన సాయి సుదర్శన్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ గిల్(2)ను ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 రన్స్ చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 19వ ఓవర్ వరకూ క్రీజులో పాతుకపోయాడు. ఈ క్రమంలో బట్లర్(36)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. బట్లర్ అవుటైన తర్వాత షారుఖ్ ఖాన్(36)తో కలిసి జట్టును నడిపించాడు. షారుఖ్ కూడా ధాటిగా ఆడాడు. అయితే, అతను కూడా ఎంతో సేపు క్రీజులో లేడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ సుదర్శన్ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అయితే, సెంచరీ దిశగా సాగుతున్న అతన్ని తుషార్ దేశ్‌పాండే 19వ ఓవర్లో అవుట్ చేశాడు. ఇక, రాహుల్ తెవాటియా(24 నాటౌట్), రషీద్(12) ఆఖర్లో విలువైన రన్స్ జోడించడంతో గుజరాత్ స్కోరు 200 దాటింది.






