ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌లో స్టార్క్ పాల్గొనడం డౌటే

by Harish |

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఐపీఎల్-2025ను వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్‌లో స్టార్క్ పాల్గొనడం డౌటే
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఐపీఎల్-2025ను వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 16 నుంచి టోర్నీని పున:ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. లీగ్ వదిలివెళ్లిన విదేశీ, స్వదేశీ ప్లేయర్లును తిరిగి పిలవాలని ఇప్పటికే బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియా క్రికెటర్లు తిరిగి రావడంపై సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఐపీఎల్‌లో పాల్గొనడంపై మిచెల్ స్టార్క్ అక్కడి మీడియాతో స్పందించడానికి నిరాకరించాడు. ఐపీఎల్-2025లో స్టార్క్ బహుశా పాల్గొనకపోవచ్చని అతని మేనేజర్ మీడియాతో తెలిపారు.

దీంతో అతని రాకపై అనుమానాలు నెలకొన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్క్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా ఐపీఎల్‌కు తిరిగొచ్చేది డౌటే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడనున్నాయి. వచ్చే నెల 11 నుంచి 15 వరకు లార్డ్స్ మైదానంలో టైటిల్ పోరు జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవడంపై ఆసిస్ క్రికెటర్లు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ వాయిదా పడటంతో టోర్నీ ముగింపు ఆలస్యమయ్యేలా ఉంది. ఈ నెల 25న ఫైనల్ జరగాల్సి ఉండగా తాజా నివేదికల ప్రకారం ఈ నెల 30 లేదా జూన్ 1న ఫైనల్ జరిగే అవకాశం ఉంది. టోర్నీ ఆలస్యమవడం కూడా ఆసిస్ క్రికెటర్లు తిరిగి రాకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. అదే జరిగితే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఢిల్లీకి స్టార్క్ లేకపోవడం భారీ దెబ్బే.


Next Story