9.32 లక్షల మందికి రైతు‘బందు’

by  |
9.32 లక్షల మందికి రైతు‘బందు’
X

రాష్ట్రంలో 9.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదు. రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. ప్రభుత్వం వారికి అవకాశం కల్పించినట్టే చేసినా నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుబంధు సాయం అందడం లేదు. అయితే రైతుల జాబితాలో ఉన్నా వ్యవసాయ భూమిగా రికార్డుకెక్కినా రైతుబంధు నగదు రావడం లేదు. వీరి కోసం ఇచ్చే సొమ్ము బ్యాంకు ఖాతాల్లోనే ఉంటున్నాయి. వ్యవసాయ భూమి ఉన్నా సేద్యం చేస్తున్నా పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు కాకపోవడంతో ఈ యాసంగి సీజన్ కూడా పెట్టుబడి సాయం దక్కడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్దీకరణకు 2018లో అవకాశం కల్పించింది. రైతుల భూముల క్రయవిక్రయాలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లు లేకపోయినా తెల్ల కాగితాలపై రాసుకున్న వారికి మ్యూటేషన్ చేసేందుకు అవకాశం కల్పించారు. వ్యవసాయ భూమికి నాలుగు దిక్కులుగా ఉన్న భూ యాజమానులు ధృవీకరించిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 12.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలా గ్రామాల్లో తెల్ల కాగితాలపై రాసుకుని భూ విక్రయాలు చేశారు. ప్రభుత్వ ప్రకటనతో చాలామంది రైతులు తమ భూములు క్రమబద్దీకరిస్తారని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించడం వరకే పరిమితమైంది. వచ్చిన దరఖాస్తుల్లో 2.18 లక్షల దరఖాస్తులను పరిశీలించి వాటిని క్రమబద్దీకరించింది. ఆ తర్వాత వాటిని మూలకేసింది. తహసీల్దార్ల అంశం, రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన వంటి అంశాలతో సాదాబైనామాల అర్జీలను పట్టించుకోలేదు. క్రమబద్ధీకరణతో రైతులు సంతోషపడ్డారు. భూముల క్రమబద్ధీకరణ జరిగి పట్టాదారు పాసు పుస్తకాలు వస్తాయని సంబురంతో రైతుబంధు కోసం ఎదురుచూశారు. సాగు భూముల లెక్కల్లో వారి భూములున్నా రైతుబంధు మాత్రం రావడం లేదు. సాదాబైనామాను క్రమబద్ధీకరిస్తారని ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. దీంతో ఏటేటా వీరికి పెట్టుబడి సాయం రావడం లేదు.

నగదు బ్యాంకుల్లో..

రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచీ కూడా అందరు రైతులకు పూర్తిగా పెట్టుబడి సాయం అందడం లేదు. ప్రతి సీజన్‌లో రైతుల సంఖ్యకు కోత పడుతోంది. 2018–19 లో రెండు సీజన్లు కలిపి దాదాపు 21 లక్షల మందికి కోత పెట్టింది. 2019–20 ఖరీఫ్​లోనూ పన్నెండున్నర లక్షల మందికి రైతు బంధు అందలేదు. వీరంతా రైతుల జాబితాల్లో ఉంటున్నా వీరు సాగు చేసే భూమి సాగు లెక్కల్లో ఉన్నా రైతుబంధు మాత్రం వీరి ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ యాసంగిలో 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. కానీ సాదాబైనామాల దరఖాస్తులకు సంబంధించిన రికార్డుల ప్రక్షాళనకు ఆదేశాలివ్వ లేదు. సీఎం నిర్ణయం కోసం రెవెన్యూ అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు. ముందుగా 2.18 లక్షల మంది దరఖాస్తులను క్రమబద్ధీకరించి తర్వాత ప్రభుత్వం ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తర్వాత వాటి జోలికెళ్లలేదు. ఫలితంగా ఈ ఏడాది కూడా 9.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం రావడం లేదు. అయితే వీరు సాగు చేస్తున్న భూమికి మాత్రం ప్రభుత్వం నుంచి సొమ్ము వస్తోంది. అది బ్యాంకు ఖాతాల్లోనే మూలుగుతోంది.



Next Story

Most Viewed