80 శాతం నీటమునిగిన మూగజీవాలు.. రైతులకు ఎన్నాళ్లీ కష్టాలు

by  |
floodwater
X

దిశ, పరిగి: ఓ వైపు చేతికొచ్చిన పంట.. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామ రైతులను ప్రతీ సంవత్సరం ఈ వాగు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. మనుషులు ఈ వాగు దాటేందుకు వెదురు కట్టెల వారధి నిర్మించుకొని గట్టెక్కినా.. పంటను చేను వద్ద నుంచి వాగు దాటించేందుకు అవస్థలు పడుతున్నారు. పరిగి మండల వ్యాప్తంగా శనివారం కురిసిన భారీ వర్షాలకు చిగురాల్పల్లి మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామానికి చెందిన దోరటి వెంకటయ్య, ఆంజనేయులు సహా మరో 25 మంది రైతులు మొక్కజొన్న(స్వీట్ కార్న్) పండించారు. తాజాగా పంట చేతికి వచ్చింది. ఈ క్రమంలో భారీ వర్షాలు పడి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో చేసేదేంలేక పంటను తెంపి ఎద్దులబండి సాయంతో పీకల్లోతు నీటిలోంచి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగుదాటించారు. అనంతరం ట్రాక్టర్‌లోకి ఎక్కించి ఇళ్లకు తీసుకెళ్లారు. వాగు దాటే క్రమంలో ఎద్దులు దాదాపు 80 శాతం మునిగి మొక్కజొన్న సంచులను తీసుకురావడం చూస్తుంటే.. రైతుల కష్టాలకు కన్నీళ్లు పెట్టాల్సి వస్తోందని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి, సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.



Next Story