విద్యార్థులకు పంగనామాలు పెట్టేందుకు జగన్ స్కెచ్

95

దిశ, ఏపీ బ్యూరో: అమ్మ ఒడి పథకం అమలుకు 75శాతం హాజరు తప్పనిసరి అని సీఎం జగన్ ప్రకటించడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. విద్యార్థుల హాజరును ఏనాడు పట్టించుకోని ప్రభుత్వం నేడు హాజరును సాకుగా చూపించి విద్యార్థులకు పంగనామాలు పెట్టేందుకు సిద్ధపడుతుందని మండిపడ్డారు. విద్యార్థులకు 75 శాతం హాజరును బూచిగా చూపించి అమ్మ ఒడిని అమలు చేయలేకపోతున్నామని చెప్పడం హేయమైన చర్య అని విమర్శించారు. ఏ పథకమైన ప్రజలకు ఊరించి ఉసూరు మనిపించడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయిందన్నారు.

అమ్మ ఒడి పేరుతో వచ్చే పథకాన్ని నిలిపివేశారని మండిపడ్డారు. ‘84 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఈ ఏడాది కేవలం 44 లక్షల మంది విద్యార్థులకు ఇస్తున్నారు. మొదటి నుంచి అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల సుడిగా మార్చారు’ అంటూ ధ్వజమెత్తారు. ‘విద్యార్థుల సంఖ్యను కుదించేందుకు 7 రకాల వింత ఆంక్షలు విధించారు. రూ.15 వేలు ఇస్తామని హామీ నిచ్చి దానిని రూ.14వేలకు కుదించారు. 2021లో కరోనా కారణంతో పాఠశాలలు తెరుచుకోకపోయినా అమ్మ ఒడిని అమలు చేశామని ఆర్బాటంగా చెప్పుకున్నారని ఇది సరికాదని’ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హితవు పలికారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..