- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు
<p>దిశ, వెబ్ డెస్క్: దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు. అది ఒక కాలరాత్రి… 1977 నవంబర్ 19 అర్ధరాత్రి సముద్రుడు ఉగ్రరూపం దాల్చి గ్రామాలపై విరుచుకుపడ్డాడు. ఈ ఉగ్రరూపానికి గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. నవంబర్ 18 సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతమై చిరు వర్షపు జల్లులు కురిశాయి. ఇది వర్షమే కదా అని దివి ప్రజలు భావించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఆయా ప్రాంతాలు చీకట్లు […]</p>

దిశ, వెబ్ డెస్క్: దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు. అది ఒక కాలరాత్రి… 1977 నవంబర్ 19 అర్ధరాత్రి సముద్రుడు ఉగ్రరూపం దాల్చి గ్రామాలపై విరుచుకుపడ్డాడు. ఈ ఉగ్రరూపానికి గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. నవంబర్ 18 సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతమై చిరు వర్షపు జల్లులు కురిశాయి. ఇది వర్షమే కదా అని దివి ప్రజలు భావించారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఆయా ప్రాంతాలు చీకట్లు కమ్మాయి. దీంతో సముద్ర తీర ప్రాంతాలలోని గ్రామాలలోని ప్రజలు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. ఇంతలోనే పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు భారీ వర్షం కురియ సాగింది. సముద్రుడు మరింత ఉగ్రరూపం దాల్చి అలలు తాడి చెట్టు ఎత్తున ఎగసిపడి గ్రామాలపై విరుచుకుపడ్డాయి. అలల నీటి ప్రళయంలో గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి.

సుమారు రెండు గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. ఇళ్లలోని ప్రజలు భయంతో దేవాలయాలలో, ప్రార్థనా మందిరాలలో, కమ్యూనిటీ భవనాలలో తలదాచుకున్నారు. మరికొంతమంది ఇంటి పై కప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా మరికొందరు చెట్లు, చెట్ల కొమ్మలు ఎక్కి వేలాడారు. ఒక్కసారిగా సముద్రపు అలలు విరుచుకుపడడంతో ఇల్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వందలాది మంది మృత్యువాత పడ్డారు. కొందరు చెట్ల కొమ్మలకు పట్టి ప్రాణాలు విడిచి వేలాడగా, ఎటు చూసినా శవాల గుట్టలే కనిపించాయి. పశువులు నీటి ప్రళయంలో కొట్టుకుపోయి మృత్యువాత పడడంతో పశువుల కలేబరాలే కనిపించాయి. ఆయా ప్రాంతాలు శవాలు, పశువుల కలేబరాలతో కనిపించడంతో మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలే వినిపించాయి. భర్తలను కోల్పోయిన వారు కొందరైతే, మరికొందరు భార్యలను కోల్పోయి, పిల్లలను సైతం కోల్పోయిన వారు కొందరు దీనితో దివిసీమ రూపురేఖలు మారిపోవడంతో పాటు గ్రామ గ్రామాలు చెదిరిపోయాయి.

ఆనాటి శాసనసభ్యులు, మంత్రి మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవం తీసుకురావడానికి విశేష కృషి చేశారు. ఉప్పెనలో చనిపోయిన మృతుల శవాలను స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు. అప్పటి పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఎన్ వి నారాయణ రావు ఐపీఎస్ పోలీసు బలగాలను దింపి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా నాగాయలంక మండలం సొర్ల గొంది గ్రామాన్ని దత్తత తీసుకొని భవనాలు నిర్మించడంతోపాటు అందుకు చిహ్నంగా స్థూపాన్ని కూడా నిర్మించారు. ఆ స్తూపం నేటికీ దివిసీమ ఉప్పెనకు చిహ్నం గా ఉంది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, సేవా మూర్తి మదర్ తెరిసా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దివిసీమను సందర్శించి వారి సహకారాన్ని అందించారు.

తీవ్రంగా ఆస్తి, పంట నష్టం…
దివిసీమ ఉప్పెన వందలాది గ్రామాలను తుడిచిపెట్టుకుపోవడం తో తీవ్ర ఆస్తి నష్టం తో పాటు, పంట నష్టాన్ని కలిగించింది. నాగాయలంక,కోడూరు మండలాలతో పాటు దివిసీమలో సుమారు 20 వేల ఎకరాలకు పైబడి పంట నష్టం జరిగింది. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా కోట్లలో జరిగింది. ఆస్తి, పంట నష్టం తో పాటు రహదారులు పూర్తిగా చెదిరిపోయాయి. గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసం అవడంతో గ్రామాలకు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది.







