ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ.. ఒక్క బెర్త్ కోసం నాలుగు జట్లు.. ప్లే‌ఆఫ్స్‌లో ఎవరెవరు..?

by  |
ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ.. ఒక్క బెర్త్ కోసం నాలుగు జట్లు.. ప్లే‌ఆఫ్స్‌లో ఎవరెవరు..?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంటున్నది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. ఇతర జట్లతో ఎలాంటి సంబంధం లేకుండా మూడు బెర్తులు తీసేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్పాట్ కోసం ఏకంగా నాలుగు జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో కోల్‌కతాకు మరోమ్యాచ్ మిగిలి ఉండగా 12 పాయింట్లు ఖాతాలో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌కు కూడా మరొక్క మ్యాచే ఉన్నది. అయితే కింగ్స్ ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. ముంబై, రాజస్థాన్ జట్లకు చెరి రెండు మ్యాచ్‌లు ఉండగా.. తలా 10 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీ – చెన్నయ్ మధ్య మ్యాచ్ ఈ నాలుగు జట్ల మ్యాచ్‌లతో సంబంధం లేదు. మిగిలిన ఆరు మ్యాచ్‌లు ఫైనల్ బెర్త్ ఎవరిదో ఖరారు చేయనున్నది. దీంతో ఆ నాలుగు జట్లు బెర్తు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

కోల్‌కతాకు చాన్స్..?

ఈ నాలుగు జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే ప్లే ఆఫ్స్ బెర్త్ దొరికేందుకు మెరగైన అవకాశం ఉంది. ప్రస్తుతం 12 పాయింట్లతో పాటు మంచి నెట్‌రన్ రేట్ కలిగి ఉన్నది. మిగిలిన ఒక్క మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ కనుక గెలిస్తే రాజస్థాన్ రాయల్స్‌ను ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పించినట్లే అవుతుంది. అంతే కాకుండా 14 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. కేకేఆర్‌కు 14 పాయింట్లు వచ్చినా.. ఉన్న ఒకే ఒక అడ్డంకి ముంబై ఇండియన్స్. ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న ముంబై జట్టుకు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో.. మరొక మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడాల్సి ఉన్నది. ఈ రెండు మ్యాచ్‌‌ల్లో ముంబై గెలిచినా 14 పాయింట్లు వస్తాయి. కానీ ముంబై ఇండియన్స్ నెట్‌రన్ రేట్ చాలా తక్కువగా ఉన్నది. అంటే ముంబై జట్టు రాజస్థాన్, హైదరాబాద్ జట్లపై భారీ తేడాతో గెలిచి కోల్‌కతా రన్‌రేట్ కంటే మెరుగ్గా ఉంటే అప్పుడు ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ముంబై జట్టు ఫామ్‌ను చూస్తే.. గెలుపు సాధ్యమే కానీ భారీ తేడాతో గెలవగలుగుతుందా అనేది అనుమానమే.

రాజస్థాన్ పరిస్థితేంటి?

రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్నది. మిగిలిన రెండు మ్యాచ్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడాల్సి ఉన్నది. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి సమీకరణలు అవసరం లేకుండా 14 పాయింట్లతో నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. కోల్‌కతాపై గెలిచి.. ముంబైపై ఓడితే మాత్రం అవకాశాలు ఉండవు. ఎందుకంటే రాజస్థాన్ కంటే కోల్‌కతా రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందున 12 పాయింట్లతో అది ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇక రెండు ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. పంజాబ్ జట్టుకు ఒక మ్యాచ్ మిగిలి ఉన్నది. చెన్నయ్ సూపర్ కింగ్స్ మీద విజయం సాధించినా.. మిగిలిన జట్ల ఫలితాల తర్వాతే దాని చాన్స్ ఎలా ఉన్నదోతెలుస్తున్నది. కానీ పంజాబ్‌కు అవకాశాలు దాదాపు శూన్యమే అని చెప్పుకోవచ్చు. మిగిలిన మ్యాచ్‌లలో అన్ని జట్లు ఒక్కో గెలుపు మాత్రమే సాధిస్తే.. అన్నీ 12 పాయింట్లతో నిలుస్తాయి. అలా చూసినా మెరుగైన నెట్‌ రన్‌రేట్ కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కే అవకాశం ఉంది. ఇకపై కోల్‌కతా తప్ప ఏ జట్టు గెలిచినా భారీ తేడాతోనే విజయాలు సాధించాలి. అలా అయితేనే రన్‌రేట్ మెరుగుపడి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. మరి ఏ జట్టు చివరి స్పాట్ దక్కించుకుంటుదో వేచి చూడాలి.

మిగిలిన మ్యాచ్‌లు ఇవే..

అక్టోబర్ 5 – రాజస్థాన్ రాయల్స్ Vs ముంబై ఇండియన్స్
అక్టోబర్ 6 – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs సన్‌రైజర్స్ హైదరాబాద్
అక్టోబర్ 7 – చెన్నయ్ సూపర్ కింగ్స్ Vs పంజాబ్ కింగ్స్
అక్టోబర్ 7 – కోల్‌కతా నైట్‌రైడర్స్ Vs రాజస్థాన్ రాయల్స్
అక్టోబర్ 8 – సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs ముంబై ఇండియన్స్
అక్టోబర్ 8- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs ఢిల్లీ క్యాపిటల్స్


Next Story

Most Viewed