60 ఏళ్ల చీకటి జీవితాలకు.. సోలార్ వెలుగులు

by Shyam |

<p>దిశ, ఫీచర్స్: బయటికెళ్తే ఎముకలు కొరికే చలి.. ఇంట్లో ఉంటే చిమ్మ చీకట్లు.. గుడ్డి దీపం వెలుతురులో గుట్టుగా జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లో దశాబ్దాలుగా వెలుగే లేదు. భూతల స్వర్గాన్ని తలపించే ప్రకృతి సౌందర్యమున్నా ఆ గ్రామానికి కరెంటే లేదు. సముద్ర మట్టానికి 14 వేల ఎత్తులో మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నివసిస్తున్న వారంతా మేకల పెంపకందారులుగా, సంచార జాతులుగా జీవనం సాగిస్తుండగా.. భారత్‌లోని మొట్టమొదటి టిబెటన్ రెఫ్యూజీ (టీఆర్) విలేజ్‌గా పేరుగాంచింది ‘దుంగ్తి’. [&hellip;]</p>

60 ఏళ్ల చీకటి జీవితాలకు.. సోలార్ వెలుగులు
X

దిశ, ఫీచర్స్: బయటికెళ్తే ఎముకలు కొరికే చలి.. ఇంట్లో ఉంటే చిమ్మ చీకట్లు.. గుడ్డి దీపం వెలుతురులో గుట్టుగా జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లో దశాబ్దాలుగా వెలుగే లేదు. భూతల స్వర్గాన్ని తలపించే ప్రకృతి సౌందర్యమున్నా ఆ గ్రామానికి కరెంటే లేదు. సముద్ర మట్టానికి 14 వేల ఎత్తులో మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నివసిస్తున్న వారంతా మేకల పెంపకందారులుగా, సంచార జాతులుగా జీవనం సాగిస్తుండగా.. భారత్‌లోని మొట్టమొదటి టిబెటన్ రెఫ్యూజీ (టీఆర్) విలేజ్‌గా పేరుగాంచింది ‘దుంగ్తి’. వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్‌ఐసీ) చాలా దగ్గరగా ఉండే ఈ గ్రామానికి 60 ఏళ్లుగా కరెంటు లేదని గుర్తించిన నలుగురు సోలార్ ఇంజనీర్లు.. తమ ప్రాజెక్టులో భాగంగా గ్రామాన్ని పూర్తిగా విద్యుదీకరించి గ్రామస్తుల ముఖాల్లో, వారి గ‌ృహాల్లో కొత్త వెలుగులు నింపారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? విద్యుదీకరణ తర్వాత గ్రామస్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలేంటి? తెలుసుకుందాం..

1962‌లో భారత్ – చైనా యుద్ధం తరువాత, టిబెట్ నుంచి వలసొచ్చిన 30 కుటుంబాలు లఢఖ్‌లోని దుంగ్తి గ్రామంలో స్థిరపడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి టిబెటన్ రెఫ్యూజీ (టీఆర్) గ్రామమైన ‘దుంగ్తి’కి రోడ్డు మార్గం గుండా వెళ్లాలంటే లేహ్ నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. వీరి ప్రధాన జీవనాధారం ‘పష్మిన’ జాతి మేకల పెంపకం. వాటి నుంచి వచ్చే ఉన్నిని విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. 1962 నుంచి భారతదేశ సరిహద్దుల్లో నివసిస్తున్న ఈ గ్రామస్తులకు విద్యుత్ సౌకర్యం లేదు. కాగా గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ (జీహెచ్‌ఈ)తో కలిసి పనిచేస్తున్న నలుగురు ఇంజనీర్ల కృషి ఫలితంగా 2021 ఫిబ్రవరి 4 నుంచి దుంగ్తి విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతోంది. మొత్తం 65 గృహాలున్న ఈ గ్రామంలో 52 కుటుంబాలు నివసిస్తున్నాయి. మిగతావారిలో కొందరు రెబో గుడారాల్లో సంచార జాతులుగా నివసిస్తుండగా, మరికొంతమంది ఉపాధి కోసం లేహ్‌కు వలస వెళ్లారు. ఈ గ్రామం అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి నెలవైనప్పటికీ, సముద్ర మట్టానికి 13,000-14,000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల శీతాకాల ఉష్ణోగ్రతలు -25 నుంచి -30 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంటాయి.

గ్రామానికి విద్యుదీకరణ

గ్రామానికి సరిపోయేలా 8.6 కిలోవాట్స్ సెటప్‌ను నెలకొల్పిన ఇంజనీర్ల బృందం.. ప్రతీ ఇంటికి యూఎస్‌బీ చార్జింగ్ సదుపాయాలతో పాటు మూడు ఎల్‌ఈడీ లైట్లు, రెండు ఎల్‌ఈడీ బాటన్స్ (ట్యూబులు)తో కూడిన సోలార్ నానో గ్రిడ్‌ను అమర్చారు. అంతేకాదు 10 సోలార్ ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌తో పాటు ఆశ్రమాన్ని కూడా విద్యుదీకరించారు. కాగా 60 ఏళ్ల తర్వాత తమ గ్రామం విద్యుత్ వెలుగులకు నోచుకోవడం పట్ల గ్రామస్తులు ఇంజనీర్లకు తమ కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తూ ‘ఖతాగ్స్(టిబెటన్ బౌద్ధ సమాజాల్లో వివిధ సందర్భాల్లో ఇచ్చే సంప్రదాయ ఉత్సవ కండువా)’ ఇచ్చారు. అంతకుమునుపు ఈ ప్రాంతంలో వెలుతురు కోసం పగటిపూట తలుపు తెరిస్తే, ఎముకలు కొరికే చల్లటి గాలి లోపలికి వచ్చేది. అదే తలుపు మూస్తే.. కారు చీకట్లు నిండి ఏదీ చూడలేకపోయేవారు. కానీ ఇక మీదట ఎల్‌ఈడీ వెలుగుల్లో హ్యాపీగా తమ పనులు చేసుకోవచ్చు.

నిర్వహణ

గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్ ప్రాజెక్టులో భాగంగా విద్యుదీకరించే ప్రతి గ్రామంలో ఒకే విధమైన నిర్వహణ విధానాన్ని అనుసరిస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి నెలనెలా రూ .100 గ్రామ ఉమ్మడి ఖాతాలో జమ చేయాలి. ప్రతి ఆరునెలలకోసారి జీహెచ్‌ఈ సభ్యులు గ్రామాన్ని సందర్శించి, సోలార్ లైట్ల పనితీరును పరిశీలిస్తారు. సోలార్ గ్రిడ్ వార్షిక నిర్వహణ ఖర్చులు గ్రామ ఉమ్మడి ఖాతా నుండి చెల్లిస్తారు.

‘గత ఎనిమిదేళ్లలో లడఖ్‌లోని 100 గ్రామాలను సౌర ఆధారిత డీసీ విద్యుత్‌తో విద్యుదీకరించాం. దాదాపు 60 సంవత్సరాలుగా ఈ గ్రామం చీకట్లో ఉందని మా సర్వేలో గుర్తించి, ఇక్కడి ప్రజలకు విద్యుత్ అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ భూభాగం చాలా చల్లగా ఉంటుంది, ముఖ్యంగా ఇంటి వెలుపల మంచు పడుతుంటుంది. ఈ పరిస్థితుల్లో వైరింగ్ చేయడమంటే చాలా కష్టం. చలికి తట్టుకోవడం కష్టమయినా ఐదు రోజుల్లో గ్రామాన్ని పూర్తిగా విద్యుదీకరించాం. గ్రామస్తులంతా మాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. వాళ్లుండేది రెండు చిన్న గదుల్లోనే, అయినా సర్దుకుని, మేము ఉండేందుకు సరిపడా స్థలాన్ని ఇచ్చారు.

– షకీర్ హుస్సేన్, ప్రాజెక్ట్ ప్రధాన ఇంజనీర్, చుచోట్ గ్రామం

ఈ జీరో బోర్డర్ గ్రామంలో విద్యుత్‌ లేకుండా కొన్నేళ్లుగా బాధపడుతున్నాం. గతంలో పలువురు అధికారులకు అభ్యర్థనలు చేశాం. అయినా మాకు విద్యుత్ రాలేదు. నా చిన్నతనం నుంచి నేను విద్యుత్ చూడలేదు. మేము 1962 నుండి ఇక్కడ ఉంటుండగా, అప్పటి నుంచి చీకటిలోనే నివసించాం.

– గోబా లోబ్జాంగ్, గ్రామాధిపతి

52 గృహాలకు కలిపి కేవలం మూడే మరుగుదొడ్లు ఉన్నందున, ఈ గ్రామాభివృద్ధికి పరిపాలన సహాయం అత్యవసరం. సరిహద్దు పర్యాటకం కోసం ఈ గ్రామాన్ని పరిశీలిస్తే.. ఇది చాలా అద్భుతమైన గమ్యస్థానంగా ఉంటుంది. లఢఖ్‌లో నిజమైన టిబెట్‌ను చూడాలనుకుంటే.. తప్పక దుంగ్తిని సందర్శించాలి. టిబెటియన్ల దుస్తులు, వంటకాలు, వారి జీవనశైలి, సంస్కృతితో కొత్త అనుభూతిని పొందొచ్చు.

– ఇర్ఫాన్ హుస్సేన్, జీహెచ్ఈ సభ్యుడు

Next Story