కాసుల వేటలో కరీంనగర్ కార్పొరేటర్.. ఇళ్లు కట్టుకోవాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనట..!

by  |
కాసుల వేటలో కరీంనగర్ కార్పొరేటర్.. ఇళ్లు కట్టుకోవాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనట..!
X

దిశ, కరీంనగర్ సిటీ : అది నగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. నగరం కార్పొరేషన్‌గా రూపుదిద్దుకున్న అనంతరం స్మార్ట్ సిటీగా ఎంపికైంది. ఈ క్రమంలోనే బల్దియాలో కూడా విలీనమైంది. అయినా, అక్కడ మాత్రం ఇంకా అరాచక పాలన కొనసాగుతూనే ఉంది. నల్లా కనెక్షన్ నుంచి మొదలుకుని ఇంటి నిర్మాణం వరకు అన్నీ ఆయన అనుమతి తీసుకున్నాకే మొదలు పెట్టాలి. ఆనుమతికోసం తక్కువలో తక్కువ రూ.10 లక్షలు చెల్లించాల్సిందే.లేదంటే మరునాడే పనులు నిలిచిపోతాయట. అయినా, ఆయన ఆదేశాలు కాదని కొనసాగిస్తే నిర్మాణదారులపై దాడులు, దౌర్జన్యాలు తప్పవట. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోరని టాక్.. పైగా, ఎందుకులే ఆయనతో గొడవ అడిగినంత కట్నం చెల్లించి, మీ పని మీరు చేసుకోండి.

మేము మాత్రం ఫిర్యాదు స్వీకరించం అంటూ ఖరాకండిగా తెగేసి చెబుతారట. అంతా ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా అక్కడ నడుస్తుండగా.. బాధితులు ఎవరితో చెప్పుకోవాలో తెలీక గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని 21వ డివిజన్ పరిధిలోని సీతారాంపూర్లో సంతోష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతుండగా కార్పొరేటర్ జంగిలి సాగర్ అడ్డుపడి డబ్బులు ఇవ్వాలని వేధించాడు. ఇవ్వని పక్షంలో భయ భ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాడు బాధితుడు.

రూ.10 లక్షలు ఇవ్వాలంటూ తన ఇంటిపై తన అనుచరులతో కార్పొరేటర్ రాళ్ల దాడులు చేయిస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారని బోరున విలపించాడు. బల్దియాలో విలీనానికి ముందు గ్రామ పంచాయతీ సర్పంచిగా కూడా డబ్బులు డిమాండ్ చేశాడని, దీంతో అంత డబ్బులు చెల్లించుకోలేక వెనక్కి తగ్గినట్టు తెలిపాడు. నగర పాలక సంస్థలో విలీనం అయిన అనంతరం అన్ని అనుమతులు తీసుకుని ఇల్లు నిర్మించుకుంటుండగా అడ్డుపడి దాష్టీకం ప్రదర్శించడం ఎంటనీ ప్రశ్నించారు. అధికార పార్టీ కార్పొరేటర్ ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఉన్నతాధికారులు, మంత్రి జోక్యం చేసుకుని వెంటనే న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.



Next Story

Most Viewed