2.4లక్షల మందికి అందని రైతుబంధు.. సర్కార్ కీలక ప్రకటన

by  |
raithu bandhu photo
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది వానకాలం సీజన్‌లో 2.41 లక్షల మంది రైతులు రైతుబంధు పథకానికి దూరమయ్యారు. సాంకేతిక కారణాలు, పాస్ పుస్తకాల్లో సమస్యలు వివిధ కారణాల వలన రైతుబంధును అందుకోలేకపోయారు. కోటి 50 లక్షల ఎకరాలకు చెందిన 63.25 లక్షల మంది రైతులకు రూ.7,580 కోట్లు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కోటి 47 లక్షల ఎకరాలకు చెందిన 60.84 లక్షల మంది రైతులకు రూ.7,360.41కోట్లను పంపిణీ చేశారు. జూన్ 25 నాటికి ఈ సీజన్‌కు రైతుబంధు పథకం పూర్తయినట్టుగా ప్రభుత్వ ప్రకటించింది.

63.25లక్షల మందికి రైతుబంధు అమలు చేసేందుకు ప్రణాళికలు..

రాష్ట్రంలో 63.25 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. కోటి 50లక్షల 18వేల ఎకరాలకు గాను రూ.7,580 కోట్లు అవసరమవుతాయని నివేదికలు తయారు చేశారు. గత యాసంగి కన్నా ఈ సారి 2.81 లక్షల మంది రైతులు పెరగడంతో, నూతనంగా 66,311 ఎకరాల భూమి రైతుబంధు జాబితాలో చేరింది. వీరందరి పట్టాదార్ పాసుబుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతాల వివరాలను స్థానిక ఏఈఓలు సేకరించి పథకం అమలుకు చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 12.18 ఎకరాలకు చెందిన 4,72,983 మంది రైతులు రూ.608.81 కోట్లను, అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 77 వేల ఎకరాలకు చెందిన 39,762 మంది రైతులకు రూ. 38.39 కోట్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడు జిల్లాలకు రూ.300 కోట్ల నుంచి రూ. 400 కోట్లను, 11 జిల్లాలకు రూ.200 నుంచి రూ. 300 కోట్లను, 10 జిల్లాలకు రూ.100 నుంచి రూ.200 కోట్లను రైతుబంధు ద్వారా పంపిణీ చేస్తామన్నారు. వరంగల్ అర్బన్, ములుగు, మేడ్చల్ జిల్లాలకు రూ.100 కోట్ల లోపు నిధులు పంపిణీ చేస్తామన్నారు.

రైతుబంధు అందుకోని 2.41లక్షల మంది రైతులు..

ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 60.84లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,360.41 కోట్లను జమచేసి రైతుబంధు పథకం ముగిసిందని ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2.41లక్షల మంది రైతులు రూ.219.59 కోట్ల రైతుబంధు సాయాన్ని అందుకోలేక పోయారు.

సాంకేతిక కారణాల వలన అందించలేపోయాం : మంత్రి నిరంజన్ రెడ్డి

సాంకేతిక కారణాల వలన పూర్తిస్థాయిలో రైతుబంధును అమలు చేయలేకపోయాము. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో పాస్ బుక్‌లు ఉన్నప్పటికీ ఆ భూముల్లో వివిధ రకాల పారిశ్రామిక కార్యకలాపాలు జరగడం వలన రైతుబంధు అమలు కాలేదు. మరి కొంత మంది రైతులు పాస్ బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా లేకపోవడం, పలు భూ సమస్యలు ఉండటం వలన రైతుబంధు నిలిచిపోయింది.


Next Story

Most Viewed